సంగీత కళానిధి వసంత దేశాయ్‌
హిందీ చలన చిత్రరంగంలో ఇద్దరు సంగీత దర్శకులకు క్లిష్టమైన హిందూస్తానీ రాగాల్లో మట్లు కట్టగలిగిన ప్రతిభ వుందని సినీ పండితులు చెబుతుంటారు. వారిలో ఒకరు నౌషాద్‌ కాగా మరొకరు వసంత దేశాయ్‌. హిందీ సంగీత రంగానికి వన్నె తెచ్చిన సంగీత ప్రముఖుల్లో వసంత దేశాయ్‌కి ఉన్నత స్థానం వుంది. మంచి భోజన ప్రియుడైన వసంత దేశాయ్‌ ఆజన్మ బ్రహ్మచారి. మంచి మల్లయోధుడు. క్రికెట్‌ ఆట అంటే వల్లమాలిన అభిమానం. మద్య, ధూమపానాలకు కడు దూరం. హిందీ సినీసంగీతంలో వసంత దేశాయ్‌ ఎన్నో ప్రయోగాలు చేశారు. శాంతారామ్‌ నిర్మించిన ‘పర్బత్‌ పే అపనా డేరా’ (1944) సినిమాలో ‘జో దర్ద్‌ బనాకే జమానా పే చాయే జాతే హై’ అనే పాటలో తొలిసారి ‘ఎఖో’ శబ్దాన్ని వినిపించారు. వాణి జయరామ్‌ను హిందీ చిత్రసీమకు పరిచయం చేసి ‘బోల్‌ రే పాపి హరా’, ‘హమ్‌ కో మన్‌ కి శక్తి దేనా’ వంటి అజరామరమైన పాటల్ని ఆమె చేత పాడించినందుకు వసంత దేశాయ్‌ అంటే లతామంగేష్కర్‌కు ఒకింత అసూయ. అయినా వసంత దేశాయ్‌ లతా చేత పాడించిన ‘ఏ మాలిక్‌ తేరే బందే హమ్’ (దో ఆంఖే బారా హాథ్‌), ‘జో తుమ్‌ తోదో పియా’ (ఝనక్‌ ఝనక్‌ పాయల్‌ బాజే), ‘తేరే సుర్‌ అవుర్‌ మేరే గీత్‌’ (గూంజ్‌ ఉఠీ షెహనాయి) వంటి అసంఖ్యాకమైన పాటలు ఎంత అద్భుతమైనవో ఆమెకు తెలుసు. కానీ దేశాయ్‌ని గురించి గొప్పగా చెప్పలేక పోవడం ఆమె సంకుచిత మనస్తత్వమే అనుకోవాలి! దేశాయ్‌ సృష్టించిన ‘ఘనశ్యాం సుందరా’ గీతమంటే మహారాష్ట్రులకు ఎంతో భక్తి. కంచి పరమాచార్య జగద్గురు చంద్రశేఖర సరస్వతి సంస్కృతంలో రచించిన ‘మైత్రీమ్‌ భజతా’ అనే భక్తి గీతాన్ని రాగమాలికగా స్వరపరచి 1966 అక్టోబరు 23న ఐక్యరాజ్య సమితి దినోత్సవంలో ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి చేత పాడిస్తే, భాష తెలియని ఎందరో ప్రపంచ ప్రముఖులు లేచి నిలబడి హర్షధ్వానాలు చేయడం స్వరకర్తగా వసంత దేశాయ్‌కి దక్కిన గొప్ప గౌరవం. దేశాయ్‌ స్వరపరచే పాటల పల్లవులు ఎంత సుతిమెత్తంగా వుంటాయో వాటి చరణాలు అద్భుతంగా, ఆహ్లాదంగా వుంటాయి. వాటిలో వినిపించే కోరస్‌ గమకాల ఇంపు వినాలేగాని మాటల్లో వర్ణించలేం. వసంత దేశాయ్‌ వినిపించే కోరస్‌ పిలుపులు ఆలకించాలంటే ‘ఝనక్‌ ఝనక్‌ పాయల్‌ బాజే’లో హేమంతకుమార్, లతా పాడిన ్డనైన్‌ సో నైన్‌ నహీ మిలావో’ పాట వినాల్సిందే!. ‘డాక్టర్‌ కొట్నిస్‌ కి అమర్‌ కహాని’ (1946)లో చైనీయుల జానపద శైలిలో స్వరపరచిన ‘దేఖో మౌజ్‌ బహార్‌’ (జయశ్రే), ‘ఆశీర్వాద్‌’లో మన్నాడే ఆలపించిన క్లాసికల్‌ పాట ‘జీవన్‌ సే లంబే హై బంధు’ పాటలు అసలు సిసలైన వసంత దేశాయ్‌ శైలిని విశదపరుస్తాయి. ‘గూంజ్‌ ఉఠీ షహనాయి’ సినిమాలో పండిట్‌ బిస్మిల్లా ఖాన్‌ చేత షెహనాయి వాద్యాన్ని, దాదాముని అశోక్‌ కుమార్‌ చేత ‘ఆశీర్వాద్‌’ (1968)లో ‘ఆవో బచ్చోం ఖేల్‌ దిఖాయే రేల్‌ గాడి’ , ‘నావ్‌ చలీ నానీ కి నావ్‌ చలీ’ వంటి బాలల పాటల్ని వినిపిస్తూ పాడించిన ఘనత ఆ సంగీత పహిల్వాన్‌ వసంత దేశాయ్‌ దే! 1975 డిసెంబరు 22న లిఫ్టు ప్రమాదంలో మరణించిన వసంత దేశాయ్‌ 43వ వర్ధంతి సందర్భంగా కొన్ని జ్ఞాపకాలు సితార డిజిటల్‌ పాఠకుల కోసం...


బాల్యం... తొలిరోజులు...
వసంత్‌ దేశాయ్‌ జూన్‌ 9, 1912న మహారాష్ట్రలోని సోనావాడే గ్రామంలోని సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కృష్ణాజి దేశాయ్, ముక్తా. వసంత్‌ దేశాయ్‌కి ఇద్దరు అన్నదమ్ములు. వారు అచ్యుత్, వాసుదేవ్, వసంత్‌ దేశాయ్‌ బాల్యం కుదాల్‌ ప్రాంతంలో జరిగింది. అక్కడి స్కూలులో నాల్గవ తరగతిలోనే మంగళం పాడి హిందుస్తానీ సంప్రదాయ సంగీతంలో ఇదార్‌ రాజాస్థాన సంగీత విద్వాంసుడు ఉస్తాద్‌ ఆలం ఖాన్‌ వద్ద కఠిన శిక్షణ తీసుకున్నారు. తరువాత హైదరాబాద్‌ (పాకిస్తాన్‌)లోని పండిట్‌ ఇనాయత్‌ ఖాన్‌ వద్ద పదేళ్లు శిష్యరికం చేశారు. దాగర్‌ సోదరుల వద్ద ‘ద్రుపద్, ‘ధమార్‌’ సంగీత శాఖల్లో తర్ఫీదు పొందారు. కరాచీ, సింద్‌ ప్రావిన్స్‌లో శాస్త్రీయ సంగీత కచేరీలు నిర్వహించారు. ఆల్‌ ఇండియా రేడియోలో అనేక సంగీత కచేరీలు చేశారు. మరాఠీ నాటకాల్లో పాత్రలు పోషించారు. సినిమా నటుడుగా రాణించాలని పదిహేడేళ్ల వయసులో ‘అన్నాసాహెబ్‌’గా కీర్తించబడిన ప్రముఖ దర్శక నిర్మాత వి.శాంతారామ్‌ కొల్హాపూర్‌లో నెలకొల్పిన ప్రభాత్‌ ఫిలిం కంపెనీలో చేరారు. తొలిసారి ప్రభాత్‌ ఫిలిమ్స్‌ వారి మూకీ సినిమా ‘ఖూని ఖంజరా’ (1930)లో నటించారు.


ప్రభాత్‌ ఫిలిం కంపెనీతో సంగీత పయనం...

టాకీలు వచ్చిన కొత్తల్లో కొల్హాపూర్‌లోని ప్రభాత్‌ ఫిలిమ్‌ కంపెనీ స్థాపకుడు, ప్రముఖ దర్శక నిర్మాత మరాఠీలో ‘అయోధ్యేచ రాజా’ (1932) చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర హిందీ వర్షన్‌ ‘అయోధ్య కా రాజా’ తరవాత విడుదలైంది. మరాఠీ చిత్రానికి గోవిందరావు తెంబ్లే సంగీత దర్శకుడు. తనకు సహాయకులుగా మాస్టర్‌ వినాయక్‌ (ప్రముఖ నటి నందా తండ్రి), వసంత దేశాయ్‌ను తెంబ్లే నియమించుకున్నాడు. ఆ చిత్రంలో వసంత దేశాయ్‌ ప్రారంభ గీతం ‘జై జై రాజాహిరాజ’ అనే పాటను కూడా ఆలపించారు. వసంత దేశాయ్‌కి నటన మీద కూడా మక్కువే. ప్రభాత్‌ ఫిలిమ్స్‌ తొలిరోజుల్లో నిర్మించిన ‘మాయామచ్చీంద్ర’ (1932), ‘అమృత్‌ మంథన్‌’ (1934), ‘ధర్మాత్మా’ (1935), ‘సంత్‌ తుకారామ్’(1936), ‘సంత్‌ జ్ఞానేశ్వర్‌’ (1940) వంటి (మరాఠీ, హిందీ) ద్విభాషా చిత్రాల్లో, ‘కుంకూ’ (1937), ‘మాజ్‌ బా’ (1938), మానూస్‌’ (1939), ‘షెజారీ’ (1941) వంటి మరాఠీ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. ఒకరోజు శాంతారామ్‌ ఉదయమే వసంత దేశాయ్‌కి కబురుపెట్టి ‘నిన్ను త్వరలో నిర్మించబోయే హిందీ చిత్రం ‘ఆద్మీ’ (మరాఠీ చిత్రం ‘మాసూస్‌’కు హిందీ రూపం)లో హీరోగా పరిచయం చెయ్యబోతున్నాను. వెంటనే వస్తే స్క్రీన్‌ టెస్ట్‌ చేయిస్తాను’ అన్నారు. లాంచనంగా సాగించిన స్క్రీన్‌ టెస్టులో అంతా ఓకే అయింది. అయితే మరుసటిరోజు శాంతారామ్‌ పిలిపించి ‘అనివార్య కారణాల వలన హీరో పాత్ర సాహు మధోక్‌కు ఇవ్వవలసి వచ్చింది, నొచ్చుకోకు’ అని చెప్పడంతో వసంత దేశాయ్‌ నిరాశకు గురయ్యారు. ఒకరకంగా శాంతారామ్‌ నిర్ణయం మంచిదే అయింది. వసంత దేశాయ్‌ని ఆయన ఒక గొప్ప సంగీత దర్శకుడిగా చూడాలనుకున్నారు. అదే అసలైన కారణం. దాంతో వసంత దేశాయ్‌ సంగీతం మీద దృష్టి పెట్టారు. కొల్హాపూర్‌లో దేవల్‌ క్లబ్‌ అనే సంగీత కళాకారుల సమాజం వుండేది. దానికి బాబా దేవల్‌ వ్యవస్థాపకుడు. సంగీత దర్శకుడు గోవిందరావు తెంబ్లే తీరిక సమయాల్లో అక్కడ కాలం గడిపేవారు. ఈ సంగీత సమాజంలో ప్రముఖ సంగీత కళాకారులు అల్లావుద్దీన్‌ ఖాన్, అబ్దుల్‌ కరీం ఖాన్, మంజీ ఖాన్, వాజే బువా సభ్యులుగా వుండేవారు. వీరి వద్ద దేశాయ్‌ సంగీతంలోని సూక్ష్మమైన మెళకువలు ఆపోసన పట్టారు. ఒకరోజు రాత్రి వసంత దేశాయ్‌ ఇంటికి వెళుతున్న సమయంలో పెద్ద వర్షం రావడంతో దేవల్‌ క్లబ్‌ లో ఉండిపోవాల్సి వచ్చింది. అక్కడ చేరిన మహామహులు వసంత దేశాయ్‌ చేత పాటలు పాడించారు. వాద్య సంగీత విన్నారు. దాంతో గోవిందరావు తెంబ్లే వసంత దేశాయ్‌ని ప్రభాత్‌ ఫిలిం కంపెనీ సంగీత ఆర్కెస్ట్రావిభాగానికి ఇంఛార్జిగా నియమిస్తూ సహకార సంగీత దర్శకునిగా హోదా పెంచారు. అప్పుడే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ‘జైలోఫోన్‌’ అనే వాద్య పరికరాన్ని వాయించే అవకాశం వసంత దేశాయ్‌కి కల్పించారు. ‘అమృత్‌ మంథన్‌’, ‘వహాన్‌’, ‘జ్యోతి’ చిత్రాల్లో వసంత దేశాయ్‌ పాడిన పాటలకు మంచి స్పందన రావడంతో గ్రామఫోన్‌ కంపెనీలు ‘రాయల్టీ’ ఇవ్వటం మొదలైంది. ‘అమృత్‌ మంథన్‌’లో సంగీత సహాయకుడిగా ఉంటూ ‘సఖి రి శ్యాం బడో దితియారో’ అనే పాటలో దేశాయ్‌ వినిపించిన ‘కజారి’ (బర్సన్‌ లాగి)కి దేశవ్యాప్తంగా పాపులారిటీ లభించింది.


శాంతారామ్‌తో రాజకమల్‌ కళామందిర్‌కు...
1940లో వి.శాంతారామ్‌ హిందీ చిత్రనిర్మాణం చేపట్టాలని ప్రభాత్‌ ఫిలిం కంపెనీని విడిచి బొంబాయి వచ్చి ‘శకుంతల’ సినిమా నిర్మాణ సన్నాహాలు మొదలుపెట్టారు. వసంత దేశాయ్‌ కూడా బొంబాయికి మకాం మార్చారు. హోమి వాడియా బ్రదర్స్‌ వెంటనే వసంత దేశాయ్‌ని ఆహ్వానించి ‘శోభ’ (1942) సినిమాకు సంగీత దర్శకత్వం వహించే బాధ్యతను అప్పగించారు. ఆ సినిమాకు అద్భుతమైన సంగీతం సమకూర్చడంతో వారు తరువాత నిర్మించిన ‘ఆంఖ్‌ కి షరమ్’, ‘మౌజ్‌’ చిత్రాలకు వసంత దేశాయ్‌ సంగీత దర్శకత్వం నిర్వహించారు. ఈలోగా శాంతారాం హోమీ వాడియా స్టూడియోని కొనుగోలుచేసి దానిని రాజకమల్‌ కళామందిర్‌గా మార్చి ‘శకుంతల’ చిత్రనిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ సినిమాకు వసంత దేశాయ్‌ని సంగీత దర్శకుడిగా నియమించారు. ఆ సినిమా వసంత దేశాయ్‌ దశనే మార్చివేసింది. ‘ప్యారీ ప్యారీ ఏ సుఖద మాతృభూమి అపనే’, ‘తుమ్హే ప్రసన్న యు దేఖ్‌ కే’ అంటూ శాంతారామ్‌ భార్య జయశ్రీ చేత పాడించిన పాటలు మంచి హిట్లయ్యాయి. వసంత దేశాయ్‌ కూడా ‘కిసీ కన్యా కో’ అనే పాట పాడారు. ‘శకుంతల’ చిత్రం 104 వారాలు ఆడి సూపర్‌ హిట్‌ కావడంతో వసంత దేశాయ్‌కి మంచి పేరొచ్చింది. అదే ఊపులో శాంతారామ్‌ నిర్మించిన ‘పర్బతోం పే అపనా డేరా’ (1944), ‘డాక్టర్‌ కొట్నిస్‌ కి అమర్‌ కహాని’ (1946), ‘మార్వాలా షాహిర్‌ రామజోషి’ (1947- తెలుగు జయభేరి చిత్రానికి ఈ చిత్రం ఆధారం), ‘దబేజ్‌’ (1950) చిత్రాలకు వసంత దేశాయ్‌ సంగీతం సమకూర్చారు. ‘పర్బతోం పే అపనా డేరా’ సినిమాలో పాటకు ప్రతిధ్వనివచ్చే ప్రక్రియను ప్రవేశపెట్టారు. ‘డాక్టర్‌ కొట్నిస్‌ కి అమర్‌ కహాని’ చిత్రంలోని పాటలకు, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కి చైనీయుల జానపద సంగీతాన్ని ఉపయోగించారు. 1946లో వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన ‘జీవన్‌ యాత్ర’ చిత్రంలో లతా మంగేష్కర్‌ చేత తొలిసారి ‘చిడియా బోలే ఛూ ఛూ ఛూ’ అనే పాటను పాడించారు. హిందీలో ఆమె పాడిన తొలి పాట ఇదే కావడం విశేషం. 1955లో శాంతారామ్‌ నిర్మించిన ‘ఝనక్‌ ఝనక్‌ పాయల్‌ బాజే’ సినిమా విడుదలైంది. అందులో వసంత దేశాయ్‌ అద్భుతమైన హిందుస్తానీ శాస్త్రీయ సంగీతాన్ని అందించారు. ఆ చిత్రానికి ఉత్తమ చిత్ర బహుమతి కూడా దక్కింది. శాంతారామ్‌ సినిమాల విజయ ప్రభంజనంతో దేశాయ్‌కి పెద్ద నిర్మాతల నుండి అవకాశాలు రాసాగాయి. వాటిలో ‘సుభద్ర’ (1946), ‘మందిర్‌’ (1948), ‘నరసింహ అవతార్‌’ (1949), ‘శీష్‌ మహల్‌’ (1950), ‘హిందూస్తాన్‌ హమారా’ (1950), ‘ఝాన్సి కి రాణి’ (1953) కొన్ని మాత్రమే. ఈ సినిమాలకు వసంత దేశాయ్‌ సంగీత దర్శకత్వం వహించినా తన తొలి ప్రాధాన్యం శాంతారామ్‌ సినిమాలకే! శాంతారామ్‌ని వసంత దేశాయ్‌ తన మార్గదర్శకుడిగా భావించేవారు. శాంతారామ్‌ వసంత దేశాయ్‌ చేత అద్భుత ప్రయోగాలు చేయించారు. 1956లో శాంతారామ్‌ నిర్మించిన ‘తూఫా అవుర్‌ దీయా’ సినిమా కోసం భక్తి పూరక సంగీతాన్ని వసంత దేశాయ్‌ అందించారు. ఇందులో ఎక్కువగా ‘పియా తే కహాఁ గయా గయే నెహ్రా లగాయే’, ‘మురలియా బాజేరి జమునా కా తీర్‌’, ‘గిరిధర్‌ మానే చాకర్‌ రాఖో జి’, ‘ఆంఖో ఆంఖే దాల్‌ కే క్యా కెహనా చాహతే హో’ వంటి మీరా భజనలతో అద్భుత సంగీతాన్ని సమకూర్చారు. 1957లో వచ్చిన ‘దో ఆంఖే బారా హాథ్‌’ సినిమాలో జానపద సంగీతానికి ప్రాధాన్యమిప్పించారు. ‘ఏ మాలిక్‌ తేరే బందే హమ్’ (లతాజీ), ‘మై గావూ తూ చుప్‌ హో జా’ (లతాజీ), ‘హో ఉమద్‌ ఘుమడ్‌ కర్‌ ఆయీ రే ఘటా’ (మన్నాడే), ‘సయ్యా ఝూటోం కా బడా సరతాజ్‌ నికాలా‘ (లతాజీ) పాటలన్నీ జానపద పోకడలతో స్వరపరచినవే. తరవాత ‘మౌసి’ (1958) సినిమాకు దేశాయ్‌ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా తరువాత రాజకమల్‌ కళామందిర్‌ నుంచి వసంత దేశాయ్‌ బయటకు వచ్చేశారు. అయితే 1966లో శాంతారామ్‌ వసంత దేశాయ్‌ని పిలిపించి ‘లడ్కి సహ్యాద్రి కా’ సినిమాకు సంగీత దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు.


పండిట్‌ బిస్మిల్లా ఖాన్‌తో...
రాజకమల్‌ నుంచి బయటకు వచ్చాక 1958లో ‘దో ఫూల్‌’, 1959లో ‘అర్ధాంగిని’, ‘దో బెహనే’, ‘సామ్రాట్‌ పృద్విరాజ్‌ చౌహాన్‌’, ‘స్కూల్‌ మాస్టర్‌’, ‘గూంఝ్‌ ఉఠీ షహనాయి’ చిత్రాలకు దేశాయ్‌ మంచి సంగీతం అందించారు. విజయభట్‌ నిర్మించిన ‘గూంఝ్‌ ఉఠీ షహనాయి’ సినిమాలో ‘తేరే సుర్‌ అవుర్‌ మేరె గీత్‌ దోనో మిల్‌ కర్‌ బనేగి ప్రీత్‌’ (లతాజీ), ‘తేరీ షహనాయి బోలె సునాకే దిల్‌ మేరా డోలే’ (రఫీ, లతాజీ), ‘ఆంఖియా భూల్‌ గయీ హై సోనా’ (లతాజీ, గీతా దత్‌) వంటి పాటలకోసం వారణాసి నుంచి పండిట్‌ బిస్మిల్లా ఖాన్‌ను ఆహ్వానించి షహనాయి వాద్య బిట్లను ఆయనచేత వాయింపజేశారు దేశాయ్‌. సినిమాలకు వాయించిన అనుభవం బిస్మిల్లా ఖాన్‌కు లేకపోవడంతో ‘బేహాగ్‌’ వంటి రాగాలను షహనాయి మీద శాస్తోక్త్రంగా వాయింపజేసి, తనకు అవసరమైనంత వరకు ఆ ట్యూన్లను పాటలకు అనుసంధానించారు. అదీ వసంత దేశాయ్‌ ప్రతిభ. 1970 దశకంలో వసంత దేశాయ్‌ ఎక్కువ చిత్రాలు ఒప్పుకోలేదు. సునీల్‌ దత్‌ నిర్మించి దర్శకత్వం వహించిన ఏక పాత్రాచిత్రం ‘యాదే’ (1964)లో అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించారు. అందులో లతాజీ పాడిన ‘దేఖా హై సపనా కోయి’, ‘రాధా తూ హై దివానీ’ వంటి రెండే పాటలు పెట్టారు. 1968లో హృషికేష్‌ ముఖర్జీ నిర్మించిన ‘ఆశీర్వాద్‌’ చిత్రంలో అశోక్‌ కుమార్‌ చేత చిన్న పిల్లల కోసం ‘ఆవో బచ్చోం ఖేల్‌ దిఖాయే రేల్‌ గాడి’, ‘నావ్‌ చలీ నానీ కి నావ్‌ చలీ’ అనే పాటల్ని పాడించి ప్రయోగంలో సఫలమయ్యారు. ఈ పాటలు పాడేందుకు తొలుత అశోక్‌ కుమార్‌ అంగీకరించకపోయినా, అతణ్ణి ఒప్పించి పాడించడం విశేషం.


వాణి జయరాంను పరిచయం చేసి...
సుమధుర గాయని వాణిజయరాం బొంబాయి స్టేట్‌ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తూ హిందుస్తానీ సంగీత శిక్షణ తీసుకొని తన మొట్టమొదటి హిందుస్తానీ క్లాసికల్‌ కచేరిని మార్చి 1, 1969న ఏర్పాటుచేసి సభికుల్ని అలరించి విద్వాంసుల్ని ఆకట్టుకుంది. అప్పుడే ఆమె వసంత దేశాయ్‌ని కలవటం తటస్థించింది. వినూత్నమైన ఆమె కంఠ స్వరానికి ముగ్దుడైన వసంత దేశాయ్‌ వాణి జయరాం, కుమారగంధర్వలతో ఒక మరాఠీ యుగళగీతాన్ని పాడించారు. ఆ వెంటనే హృషికేష్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘గుడ్డి’(1971) సినిమాలో మూడు పాటలు పాడించారు. వసంతదేశాయ్‌ మేఘమల్హర్‌ రాగంలో స్వరపరచిన ‘బోల్‌ రే పపీ హరా’ను తొలిసారి పాడిన వాణిజయరాంకు ఐదు అవార్డులే కాక, ప్రతిష్టాత్మక ‘తాన్సేన్‌ సమ్మాన్‌’ అవార్డు కూడా వచ్చింది. తరువాత వాణి ఎన్నో మరాఠి పాటలు పాడింది. వసంత దేశాయితో మహారాష్ట్ర మొత్తం పర్యటించి గొప్ప మరాఠి పాటల రుచులను ప్రజలకు చేరువ చేసింది. పాఠశాల విద్యార్ధులకు మరాఠీ సంగీతంలో శిక్షణ ఇచ్చింది. నిద్రలేవగానే ఆమె నమస్కరించేది దేవుడి పటంతోబాటు మొదటి గురువు వసంత దేశాయి ఫోటోకే. అంతేకాదు అతని ఫోటోకి నిత్యం పూజ కూడా చేస్తుంది. తరువాత ‘రాణి అవుర్‌ లాల్‌ పరి’ (1975) సినిమా ద్వారా దిల్రాజ్‌ కౌర్‌ను దేశాయ్‌ పరిచయం చేశారు. ‘అమ్మి కో చుమ్మి పప్ప కో ప్యార్‌’, ‘పప్ప కో పపీ లఖో బార్‌’ అనే పాటలను దిల్రాజ్‌ కౌర్‌ చేత పాడించారు. హిందీలో ఎంత బిజీగా వున్నా తన మాతృభాషా మరాఠీ సినిమాలను వసంత దేశాయ్‌ నిర్లక్ష్యం చెయ్యలేదు. దాదాపు ఇరవైకి పైగా మరాఠీ చిత్రాలకు దేశాయ్‌ సంగీతం అందించారు.


మరిన్ని విశేషాలు...

* ఒకసారి హుబ్లిలో ప్రముఖ మరాఠీ రచయిత దినకర్‌ పాటిల్‌ దర్శకత్వంలో వసంత దేశాయ్, మాస్టర్‌ వినాయక్‌ కలిసి మరాఠీ నాటకం ‘ఆంధ్యాచ్యా శాలా’ ప్రదర్శించారు. ఆ నాటకంలో పాటలు లేవు. వసంత దేశాయ్, మాస్టర్‌ వినాయక్‌ ఇద్దరూ మంచి నేపథ్య గాయకులుగా స్థానికులకు తెలుసు కనుక నాటకంలో పాటలుంటాయని ప్రేక్షకులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. పాటలు లేవనితెలిసి ప్రేక్షకులు పెద్దఎత్తున గొడవచేశారు. నిర్వాహకులు ప్రేక్షకులకు నచ్చజెప్పి అదే నాటకాన్ని పాటలతో కలిపి మరుసటిరోజు మళ్లీ ప్రదర్శిస్తామని హామీ ఇచ్చారు. మరుసటి రోజు ఉదయం దినకర్‌ పాటిల్‌ కొన్ని పాటలు రాస్తే వాటిని వసంత దేశాయ్‌ వెంటనే స్వరపరచి సాయంత్రం అదే నాటకాన్ని పాటలతో ప్రదర్శిస్తే, ప్రేక్షకులు హర్షధ్వానాలు చేయడమే కాకుండా పెద్ద మొత్తంలో కానుకలు ఇచ్చారు.


‘ఝనక్‌ ఝనక్‌ పాయల్‌ బాజే’ (1955) నిర్మాణ సమయంలో దర్శకనిర్మాత శాంతారామ్‌కు సంగీత విషయంలో కాస్త బెంగ పట్టుకుంది. అందుకు కారణం ఆ సినిమాకు శాస్త్రీయ సంగీతం నేపథ్యం కావడం. విషయం గమనించిన వసంత దేశాయ్‌ ‘కంగారు పడొద్దు. ఈ చిత్రానికి నౌషాద్‌ను సంగీత దర్శకుడిగా నియమించండి. సినిమాకు విలువకూడా పెరుగుతుంది’ అని సలహా ఇచ్చారు. శాంతారామ్‌ అందుకు ఒప్పుకోలేదు. భారం వసంత దేశాయ్‌ మీదే పడింది. దేశాయ్‌ సవాల్‌గా తీసుకొని దేశం మొత్తం పర్యటించి ప్రధమ శ్రేణి వాద్యకారులను ఎంపిక చేశారు. అలా ఎంపిక చేసినవారిలో తబలా విద్వాంసుడు సమతా ప్రసాద్‌ (వారణాసి), ఖోల్‌ వాద్యకారుడు సుదర్శన్‌ (కలకత్తా), సంతూర్‌ వాద్యకారుడు శివ కుమార్‌ శర్మ (కాశ్మీరు), ఫక్వాజ్‌ విద్వాంసుడు రామదాస్‌ (కాశ్మీరు) వున్నారు. వీరి వాద్య సహకారంతో ఈ చిత్రానికి అద్భుతమైన బాణీలు కట్టారు. ఇందులో ముఖ్యంగా ఉస్తాద్‌ అమీర్‌ ఖాన్‌ ఆలపించిన టైటిల్‌ గీతం, మన్నాడే, లతాజీ, ఉస్తాద్‌ అమీర్‌ ఖాన్‌ ఆలపించిన ‘మురళి మనోహర్‌ కృష్ణ కన్హయ్యా’, ‘సయ్యా జావో జావో మోసే నా బోలో’ (లతాజీ), ‘ఓ సునో సునో సునో సునో రే రసియా’ (లతాజీ), లతాజీ, మన్నాడే ఆలపించిన రాగమాలిక బాగా పాపులర్‌ అయ్యాయి. ఈ సినిమా 75 వారాలు ఆడి ప్లాటినం జూబిలీ జరుపుకుంది.

*
ప్రభాత్‌ ఫిలిం కంపెనీ నిర్మించిన ‘సంత్‌ జ్ఞానేశ్వర్ర్‌’ (1940) సినిమాలో సంగీత దర్శకుడు కేశవరావు భోలే వసంత దేశాయ్‌ చేత రెండు పాటలు కంపోజ్‌ చేయించారు. కానీ టైటిల్స్‌లో దేశాయ్‌ పేరు లేదు. అయితే కేశవరావు భోలే తన ఆత్మకథలో వసంతదేశాయ్‌ రెండు పాటల్ని కంపోజ్‌ చేసిన విషయాన్ని ప్రస్తావించి అభినందించారు. 1936లో వసంత దేశాయ్‌ ‘ఛా’ అనే సినిమాకు తొలిసారి సంగీత దర్శకత్వం వహించారు. కానీ అప్పుడు ప్రభాత్‌ ఫిలిం కంపెనీ వారి కాంట్రాక్టులో ఉండడంతో సినిమా క్రెడిట్స్‌లో పేరు వెయ్యలేదు. వసంత దేశాయ్‌ మరాఠీ సినిమాలలో 21 పాటలు, హిందీ సినిమాల్లో 14 పాటలు పాడారు.

*
తన 33 సంవత్సరాల సినీ ప్రస్థానంలో వసంత దేశాయ్‌ 54 హిందీ సినిమాలకు, 20 మరాఠీ సినిమాలకు సంగీతం సమకూర్చారు. నాలుగు ఇంగ్లీషు సినిమాలకు, ఒక్కొక్క బెంగాలి, గుజరాతి సినిమాలకు కూడా సంగీతం అందించారు. ఆయన సంగీతం సమకూర్చిన 8 హిందీ సినిమాలు, 7 మరాఠీ సినిమాలు అనివార్య కారణాలచేత విడుదలకు నోచుకోలేదు. 13 సినిమాకలు బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సమకూర్చారు.

*
వసంత దేశాయ్‌ మంచి బాడీ బిల్డరు. బ్రహ్మచారి. మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు లేని వ్యక్తి. అటువంటి ఒక మంచి మనిషి మీద ముంబై దూరదర్శన్‌ కేంద్రం డాక్యుమెంటరీని రూపొందించింది. 1967లో భారత ప్రభుత్వం దేశాయ్‌కి పద్మశ్రీ బిరుదు ప్రదానం చేసింది. సుర్‌ సింగార్‌ సన్సద్‌ సంస్థ ‘స్వామీ హరిదాస్‌’ అవార్డును బహూకరించింది.డిసెంబరు 22, 1975న ప్రమాదవశాత్తు తన అపార్టుమెంట్‌ లిఫ్ట్‌లో చిక్కుకొని వసంత దేశాయ్‌ మరణించారు. అప్పుడు దేశాయ్‌ వయసు 63.

- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.