అగ్గివంటి వలపంటించి పోయిన.... మంచోడు!
ప్రేమ యాత్రలకు బృందావలనాలకో, కొడైకెనాలకో వెళ్ళాలనిపిస్తుంది ఎందరికో...

అనిపించినా వెళ్ళగలిగేది కొందరే... వెళ్ళలేని వాళ్ళు ప్రేమించిన వ్యక్తి ఎదుట ఉంటే ‘‘వేరే నందనవనాలు ఎందుకో’’ అని సరిపెట్టుకోవడమూ కద్దు. ప్రేమ ‘‘తో’’ ప్రేమ ‘‘లో’’ విహరించటానికి ఎక్కడకు వెళ్ళాలి? అంటే ఈ సమాధానం చూడండి. ‘‘సూరీ చంద్రులతోటి, చుక్కలతోటి ఆటాడుకుందాము. ఆడనే ఉందాము’’ ఇక్కడ అక్కడా కాదు.... ఏకంగా చుక్కలతో ఆడుకొని ఆడనే ఉందాం అనే భావం ఓ అద్భుతం కాదా? ఎక్కడకీ వెళ్ళడానికి వీలు లేదా? అయితే ‘‘జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోతూ’’ ఉంటే సరిపోతుందట, ఇటువంటి ‘‘భావోద్వేగం ఒక్క కిళంబి వేంకట నరసింహాచార్లుకే చెల్లింది. ఎవరా కిళంబి? ఇలా అసలు పేరు చెబితే చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ... ‘మనసుకవి’ అంటే ఆత్రేయని తెలియని వారుండరు. (మే 7న ఆత్రేయ జయంతి సందర్భంగా..)


ప్రియమైన వారితో ఎలా ఎక్కడ గడపాలో వారినే అడిగి తెలుసుకోవాలి. కాకతాళీయం కాకపోతే టైటానిక్‌ సినిమాలో గుర్రపుబండి దృశ్యం గుర్తుందా? డ్రైవర్‌ సీట్లో కూర్చొన్న హీరో వెనక నున్న హీరోయిన్‌తో ‘ఎక్కడకు తీసుకెళ్ళాలి మేడమ్‌ అని అడిగితే ఆ ‘‘అందం’’ ఆనందంగా ‘‘చుక్కల దగ్గరకే పోనీ’’ అంటుంది.

సంగీతానికున్న శక్తి ఎంతటిదో కొత్తగా చెప్పనక్కర్లేదు. ‘‘మనసునే మురిపించు’’ గానం, సంగతీ చెప్పనక్కర్లేదు ఆ సరాగాలకు చక్కటి సాహిత్యం తోడయితే ఇంకేం చెప్పక్కర్లేదు. అయితే సాహిత్యం అంటే ‘‘పాండిత్యం’’ అనుకుంటారు. కానీ పాండిత్యం పండితులకే పరిమితం. సామాన్యుడికి చేరలేదు. పాట ముఖ్యంగా సినిమా పాట ఎలా ఉండాలి? యతులు, గుతులు, ప్రాసలు... కొండోకచో సంస్కృత సమాసాలతో రాసిన తెలుగుపాటలు ఎన్నో ఉన్నాయి.

అయితే ఆత్రేయ రాసిన పాటలలో అద్భుతమైన పద ప్రయోగాలు గానీ యతిప్రాసలు గానీ సాధారణంగా ఉండవు. ‘‘కవిత సౌరభం’’ అంటారే అటువంటి వ్యాఖ్యానాల జోలికి పోనవసరం ఉండదు. చాలా తేలికగా ఉంటాయి పదాలు. అందుకే అన్నారు. ఆత్రేయ వ్రాసిన దానికి బాణీ కడితే పాట అవుతుంది. లేదంటే ‘మాటలు’గా తీసేసుకోవచ్చును. అసలు మరి ఆత్రేయ గొప్పదనం ఎక్కడుంది. ఆయన వాడే పదాలు తేలికయినవే కానీ భావమెంతో ఘనమైనది.‘‘మనసు మూగదే కానీ బాసున్నది దానికి, చెవులుంటే మనసుకే వినిపిస్తుంది ఇది’’ ‘‘ముద్దబంతీ పువ్వులో (మూగమనసులు) పాటలోని పై చరణాలలోని భావం కట్టిన రాగం కట్టిపడేస్తాయి.. కాస్త గట్టిగా ఆలోచిస్తే పై భావాన్ని మరింత గ్రాంధికంగా చెప్పొచ్చు.... కాని ఉపయోగం... ఫలితం... శూన్యం.... అర్ధంకాని గ్రంథాలెందుకు?

‘‘బాస... మూగది... చెవులు...’’ వాటిని మార్చలేం. (ప్రత్యామ్నాయాలను సూచించటం కష్టం)

ఎందుకంటే అవి తిన్నగా మనసును తాకాయి మరి. మనసు కదలాలి అంటే ముందుగా ‘‘అర్ధం’’ కావాలి కాదా.

ఒక చెడువార్తని అర్థంకాని బాషలో నవ్వుతూ చెబితే ఎలా ఉంటుంది.? బాధ కలగదుగా. ఏడుస్తూ చెబితే కనీసం ఏదో నష్టం జరిగిందనుకోవచ్చు. ఏ భావమైనా మనసును తాకితేనే అది పండుతుంది.

మరి ‘‘మనసుకు’ సంబంధించిన విషయం ‘‘మనసుకు’’ తాకాలంటే... ఆత్రేయలాగే చెప్పాలి.కొన్నింటిని ‘‘ప్రామాణికాలు’’గా ఎన్నికచేసి భద్రపరుస్తూ ఉంటారు. ఉదాహరణకి ‘‘దర్శకత్వం’’ శాఖకుగాను ‘‘దొంగరాముడు’’ సినిమాను పూనే ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వాళ్లు భద్రపరిచారు.

‘‘కొందరి జీవితాలను ఆదర్శప్రాయంగా పరిగణించి పాఠ్యపుస్తకాలలో కూడా చేరుస్తుంటారు. ఆ విధంగా చూస్తే మనసుకు సంబంధించిన సినీ సాహిత్యంలో పేటెంట్‌ రైట్స్‌ ఆత్రేయవే.

‘‘మనసు మూగది... మాటలు రానిది, మమత ఒకటే అది నేర్చినది’’ (ఏ తీగపూవ్వులో... మరో చరిత్ర).. అలాంటి మనసు మీద ‘‘మౌనమే నీ భాష ఓ మూగమనసా’’ (గుప్పెడు మనసు) పాట ఓ సిద్ధాంత గ్రంధం వంటింది.

‘‘ఊహల ఉయ్యాలవే.. మాయల దేయ్యానివే...’’ ఈచరణం చాలు కదా!

ఇంకా సరిపోకపోతే...

‘‘ఒక పొరబాటుకు యుగములు పోగిలేవు’’
ఈ చరణం చాలు కదా! ‘‘ఒక పొరబాటుకు యుగములు పోగిలేవు’’ ఈ చరణాన్ని అర్ధం చేసుకొని నడుచుకొటే ‘‘నేటి మానసిక సమస్యలన్నీ’’ తీరిపోతాయి. ‘‘మనసున్న మనుషులే మనకు దేవుళ్లు. మనసూ కలిసిననాడే మనకు తిరనాళ్లు’’ ‘‘గుండె మంటలారిపే చన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ చాన్నాళ్ళు...’’ మూగమనసులు చిత్రం మనసుకవికి పరాకాష్ట. సమస్యలకి మూలం... అర్థం చేసుకోవటం చేసుకోకపోవటం... సరిగ్గా అర్థం చేసుకొంటే రెట్టింపు అవుతుంది. మనసును అర్థం చేసుకోవడం ఎలా? కొంతమంది అర్థం అయినట్లే ఉంటారు కాని అర్థం కాదు.

ఎందుకంటే...‘‘కళ్లల్లో ఉన్నదేదో కన్నులకే తెలుసు. రాళ్లళ్లో ఉన్నదేదో కళ్లకెలా తెలుసు.. నాలో ఉన్న, మనసు నాకు గాక ఇంకెవరికి తెలుసు’ అంటూ ‘అంతులేని కథ’లో పాడినట్టు అంతా తెలుసుకోవటం సరికాదు.

నిజానికి ఎవరికి వారే అవతల వారిది ‘తప్పు’ తమదే ‘ఒప్పు’ అనుకొంటూ సమస్యలు పెంచుకొంటారు. ఏమీ తెలియదనుకొంటే ఎంతో ఉత్తమం.


మనసుకు కావలసిందేమిటో చెప్పటం. కావలసింది అసలు దొరకక పోయినా, దొరికింది చేజారిపోయినా, మనసు పడే వేదనని చెప్పటం, అది మనసు కదిలేలా చెప్పటం ఆత్రేయ ప్రత్యేకత. ‘నీ జతలో చల్లదనం... నీ ఒడిలో వెచ్చదనం’

ధనవంతుల జాబితాలో ఉండాల్సింది. బిల్‌గేట్స్‌ లేదా ఓ అజీమ్‌ ప్రేమ్‌జీ కాదు.... పై రెండు ‘‘దనాలు’’ కల్గిన వాడే అసలైన ధనవంతుడు. ఈ చరణాలను విశ్లేషిస్తే ఎంతో అర్థం ఉంది. అసలు.... సంసారం అంటే ‘‘కనులు కనులతో కలబడితే’’ (సుమంగళి) కలలొస్తాయిట.. ఆ కలలో ఎవరైనా కలబడితే కారణం మరులట.... ఈ మరులు మనువుకు దారి తీస్తాయట... ఆ మనుగడ పేరే సంసారమట.... సరే మనసు పడినది దొరికితే బాగానే ఉంటుంది. దొరకకపోతే ‘‘ఆత్రేయ విశ్వరూపం’’ కనబడుతుంది. ‘‘ఆ ఆశ్రమ వాసిది కరగని హృదయం’’ అయితే ఈ ‘‘ప్రేమ పిపాసిది తీరని దాహం’’ మరి (ఇంద్ర ధనస్సు) ‘‘అగ్గివంటి వలపంటించి హాయిగా’’ ఉందామనుకొంటున్న ఆ హృదయంలేని ప్రియురాలని (కన్నెమనసులు) చిరుజల్లులా చిలికి పెనువెల్లువలా ఉరికి సుడిగుండంలా ఎందుకు వెలిసావు? అసలు ఎందుకు కలిసావంటూ ప్రశ్నించి తన గాయం ఆమెకు తీరని తాపం కావాలను కొంటాడు.

‘‘ప్రేమభిక్ష పెట్టి పేద హృదయాన్ని’’ పగులుకొట్టడమే కాకుండా ‘‘పాత్ర కూడా లేచి బిచ్చగాడిని’’ చేసి పోతే ‘‘ఎవరికోసం’’ (ప్రేమనగర్‌) బతకాలనుకొంటాడు? అయితే ఆమెను పసిపాపలా చూసుకొన్న ఆమెకోసం గుండెను గుడి చేసినా, వదిలి వెళ్ళిపోతే ఆమె మాత్రం. ‘‘ఎక్కడ ఉన్నా ఏమైనా’’ మురళీకృష్ణ) సుఖంగానే ఉండాలని కోరుకుంటాడు. ‘‘ప్రేమ ఎంత మధురమైనా ప్రియురాలు కఠినం (అభినందన)గా ఉంటే ఏం చేస్తాడు పాపం. వలపువలె తీయగా (సుమంగళి) నిండుగా వచ్చినా మెరుపులా మెరిసి పోతుంది మరి. ‘‘గుండెలో పల్లవించమంటాడు తన పాటకు పల్లవి కమ్మంటాడు.’’ (కోకిలమ్మ) వినకపోతే.... ‘‘నీ విరహంలో బ్రతికాను.... ‘‘ఈ విషంతో మరణిస్తాను’’ అంటాడు పాపం....ఎన్నో విధాలుగా ‘‘మనసున్న మనిషికి సుఖము లేదంతే’’ (ప్రేమనగర్‌) అని నిర్ధారించిన ఆత్రేయ నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం మంగళంపాడులో 07.05.1921న జన్మించారు. కోర్టు గుమాస్తాగా జీవితం ప్రారంభించినా క్విట్‌ ఇండియా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొని జైలుజీవితం కూడా చవి చూశారు. 1951లో దీక్ష సినిమాతో సినీరంగ ప్రవేశం చేయడానికి ముందు రంగస్థలానికి ఆయన ఎనలేని సేవనొనర్చారు. సినీరంగంలో కథా రచన, మాటలు, పాటల విభాగాలలో పాలు పంచుకొంటూ ‘‘తోడికోడళ్ళు, మాంగల్యబలం, వెలుగునీడలు, మూగమనసులు, జయభేరి, పెళ్లికానుక వంటి ఎన్నో చిత్రరాజాల విజయాలలో ప్రముఖ పాత్రను వహించారు. ‘వాగ్దానం’ చిత్రానికి దర్శకతం కూడా నెరపారు. తొలితెలుగు వానపాట ‘‘చిటపట చినుకులు’’ (ఆత్మబలం) ఆయనదే.. వాన పాటలలో అదే ఎప్పటికీ మొదటి స్థానంలో ఉంటుంది. ‘‘చిటపట’’ని చిటాపటా’’ అని సాగదీసి ‘‘చిటాపటా చినుకులతో కురిసింది వాన... మెరిసింది జాణ’’ (అక్కాచెళ్ళెళ్లు) అంటే రాసిన మరో వానపాట కూడా ప్రజాదరణ పొందింది. హార్ట్‌ స్పెషలిస్ట్‌ కాబట్టి కన్నెపిల్ల గుండెను శోధించి ఆమె ఆశలను వెలికి తీసిన పాట ‘‘చందమామా’’... ‘‘తేనే మనసులు’’ అనేపాట. ‘‘పెళ్ళిచూపులకు వారొచ్చారు.. చూడాలని నే ఒరగ చూసా....’’ పాటలో అన్నీ ‘‘కన్నెపిల్ల’’ వంటి సున్నిత భావాలే... భక్తి పాటలు రాయడం తక్కువే అయినా రాసినవి ఆణిముత్యాలు. ‘‘శేషశైలా వాసా శ్రీశ్రీనివాసా...’’ ‘‘ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ ఎదురు చూతురా గోపాలా... (వెంకటేశ్వర మహాత్యం). కారులో పోయే అందాలనెన్నింటోనో చూస్తుంటాం కానీ ఆయన మనసు కవి కాబట్టి ‘‘కారులో షికారు కెళ్లే (తోడికోడళ్ళు) పాల బుగ్గల చిన్నదానికా ఎరుపు ఎలా వచ్చిందో చెబుతాడు. ‘‘నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే అనేసరికి ఎందరికో శ్రీశ్రీ కనిపించాడు. ఆత్రేయలో... అయితే ఆత్రేయని ‘‘బూత్రేయగా’’ విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని చరణాలు కాస్త మొరటుగా చెప్పిన మాట నిజమే కాని మనసులో పుట్టిన భావాన్ని యధాతథంగా చెప్పడం ఆయన నైజం మరి. ‘‘ఎట్టాగో ఉన్నాది ఓలమ్మి ఏటేటో అవుతోంది చిన్నమ్మి (దసరాబుళ్ళోడు) కత్తిలాంటి పిల్ల తగిలితే అలాగే ఉంటుంది మరి....‘‘చెంగావి చీర కట్టుకున్న చిన్నదాన్ని’’ (బంగారు బాబు) చూస్తే దిమ్మతిరిగి పోదామరి! పడుచు గుండె బిగువులు సడలిపోనివ్వనని, దుడుకుగ ఉరికిన పరువానికి ఒడుపు తగ్గిపోదనీ.... చేతిలోచేయ్యేసి (దసరాబుల్లోడు) చెప్పమన్నాడంటే సమంజసమే కదా! ‘‘పిక్కల పై దాకా చుక్కల చీరకట్టి పిడికెడంత నడుము చుట్టు పైట చెంగు బిగకట్టిన చిన్నది వస్తానంటే పడిచస్తా కాళ్ళకాడ (కడవెత్తుకొచ్చింది...‘ప్రేమనగర్‌’) అని అనుమానం కలగదా? మరి పైకి చెప్పక పోయినా గుండెలోతుల్లో భావాలిలాగే ఉంటాయి. ఆయన బయటకు చెప్పేసాడు అంతే.

‘‘విధి చేయు వింతలన్నీ (మరోచరిత్ర) మతిలేని చేష్టలేననీ’’ అనుకొని వేగిపోకుండా, ‘‘అనుకొన్నామని జరగవు అన్నీ... అనుకోలేదని ఆగవు కొన్ని... జరిగేవన్నీ మంచికని... అనుకోవడమే మనిషి పని...’’ (మురళీ కృష్ణ) అని పాడించినా... పూలదండలో, పాలగుండెలలో ఏమున్నదో తెలిసిన ఆత్రేయ. రాయక నిర్మాతలనీ... రాసి ప్రేక్షకులనీ ఏడిపించి...

మనకెన్నో తీపిగురుతులను మిగిల్చి.... పోయిన మంచోడు!

‘పోయినోళ్లు అందరూ మంచోళ్ళు’ అని మనమంతా నిట్టూరుస్తూ పాడుకోవడం తప్ప ఏం చేయగలం?

                                                                                                                                                         - పొన్నాడ సత్యప్రకాశరావు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.