ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే

‘ఓ పడుచు బంగారమా... పలకవే సరిగమ, చిలిపి శృంగారమ... చిలకవే మధురిమ’ అంటూ సాగే ‘అందరివాడు’ చిత్రంలోని పాట అనంతశ్రీరామ్‌ని ప్రత్యేకంగా పరిచయం చేసింది. కుర్రాడు భలే రాశాడని అప్పట్లో అప్పట్లో ఆయనకి ప్రశంసలు వెల్లువెత్తాయి. అది మొదలు ఆయన కలం మెరుపులు మెరిపిస్తూనే ఉంది. ‘అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి..’, ‘నిజంగా నేనేనా... ఇలా నీ జతలో ఉన్నా...’, ‘పరారె పరారె...’, ‘నమ్మవేమో కానీ... ’ ఇలా అనంతశ్రీరామ్‌ నుంచి వచ్చిన ప్రతి పాటనీ శ్రోతలు ప్రత్యేకంగా పాడుకొన్నారు. పాలకొల్లు సమీపంలోని దొడ్డిపట్ల అనే గ్రామంలో సీవీవీ సత్యనారాయణ, ఉమారాణి దంపతులకి 1984 ఏప్రిల్‌ 8న జన్మించారు అనంతశ్రీరామ్‌. 12 యేళ్ల వయసులోనే పాటలు రాయడం ప్రారంభించిన అనంతశ్రీరామ్‌ తొలుత ‘ఔననిలే’ చిత్రంతో పరిశ్రమకి పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘ఒక ఊరిలో’, ‘ఏవండోయ్‌ శ్రీవారు’ చిత్రాలకి రాశారు. ‘అందరివాడు’లో పాటే ఆయనకి మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. ఆ తర్వాత చిరంజీవి పిలిచి మరీ ‘స్టాలిన్‌’లో గీతాల్ని రాయించారంటే అనంతశ్రీరామ్‌ కలం బలం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కవితలు రాసే అలవాటున్న అనంతశ్రీరామ్‌కి సాహిత్యంవైపు దృష్టి మళ్లడానికి ఆయన తండ్రి రసధుని అనే సంస్థకి గౌరవాధ్యక్షుడిగా ఉంటూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఓ కారణమట. బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాలలో చేరిన ఆయన మూడో యేడాదిలోనే మానేసి, పాటలవైపు పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు. ‘స్టాలిన్‌’, ‘పరుగు’, ‘ఆకాశమంత’, ‘మున్నా’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’, ‘బృందావనం’, ‘చందమామ’, ‘కొత్తబంగారులోకం’, ‘సత్యమేవ జయతే’, ‘అరుంధతి’, ‘ఏమాయ చేసావె’... ఇలా వరుసగా గీతాలు రాస్తూ విజయాల్ని సొంతం చేసుకొన్నారు. ఇటీవల ఆయన రాసిన పాటలు సంచలనాల్ని సృష్టించాయి. ‘బాహుబలి ది బిగినింగ్‌’లో ‘పచ్చబొట్టేసినా పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా..’, ‘గీత గోవిందం’లో ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే..’ పాట విశేష ప్రాచుర్యం పొందాయి. అనంతశ్రీరామ్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకొనేలా చేశాయి. చక్కటి భాష, భావుకత, శబ్ద సౌందర్యం మేళవింపుతో పాటలు రాస్తుంటారు అనంతశ్రీరామ్‌. ఎ.ఆర్‌.రెహమాన్, ఇళయరాజా, ఎమ్‌.ఎమ్‌.కీరవాణి వంటి అగ్ర సంగీత దర్శకుల చిత్రాలకి తరచుగా పాటలు రాస్తుంటారు అనంతశ్రీరామ్‌. పద్నాలుగేళ్ల సినీ ప్రయాణంలో ఆయన దాదాపుగా 850 పైచిలుకు గీతాల్ని రాశారు. ‘సాక్ష్యం’ చిత్రంలో ఓ కీలక పాత్రలో కూడా మెరిశారు. రాజకీయ నాయకులు చేగొండి హరిరామజోగయ్య అనంతశ్రీరామ్‌కి పెదనాన్న అవుతారు. ఈ రోజు అనంతశ్రీరామ్‌ పుట్టినరోజు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.