ఈ తరం ఆత్రేయ...చంద్రబోస్‌

ఆయన అక్షరాలను ప్రేమిస్తారు. ఆరాధిస్తారు. శిరసొంచి నమస్కరిస్తారు. గుండెల్లో భద్రంగా పెట్టుకుంటారు.అంతేనా! అక్షరాల అంతరంగాన్ని ఆత్మీయంగా స్పృశిస్తారు. అంతకు మించి అక్షరాలతో ఆడుకుంటారు. మనం మాట్లాడుకునే మాటల్ని పాటలుగా పేర్చి పాడుకుంటారు. శబ్దాడంబరం కాకుండా భావానికి ప్రాధాన్యత ఇచ్చే సినీ కవి ఆత్రేయకి ఏకలవ్య శిష్యుడిగా తనని తాను మలచుకున్నారు. అశేష ప్రేక్షకశ్రోతల విశేషాభిమానాన్ని గెలుచుకున్నారు. భాష కన్నా భావం సూటిగా గుండెల్లోకి దూసుకుపోయి కలకాలం పాటకి చిరాయువు ప్రసాదిస్తుందని నమ్మిన ఈ తరం ఆత్రేయ...ఆయనే చంద్రబోస్‌.

సినీకవిగా రాణించాలంటే ప్రతిబంధకాలెన్నో? సన్నివేశాన్ని ఆకళింపు చేసుకోవాలి. సంగీత దర్శకుడు ఇచ్చిన బాణీలకు తగ్గట్లు మాటల్ని ప్రోదిచేసుకోవాలి. నిర్మాత, దర్శకులను మెప్పించాలి. ఆపై...ప్రేక్షక శ్రోతల మనస్సులను ఆకట్టుకోవాలి. ఓ సినిమాకి పాట రాయాలంటే... అష్టావధానం కన్నా కష్టమంటారు అనుభవజ్ఞులు. కవికి సంపూర్ణ స్వేచ్ఛ ఉండదు. దొరికిన కొద్దిపాటి స్వేచ్ఛలోనే ఆకాశాల్ని అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది. తన ముద్ర చాటుకోవాల్సి ఉంటుంది. అలా చాటుకున్న కవులే సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సముపార్జించుకోగలుగుతారు. ఎందరో మహానుభావుల మధ్య తన ఉనికిని చాటుకోవడం నిజానికి కష్టసాధ్యమే. ఆ కష్ట సాద్యాన్ని ఇష్ట సాధ్యంగా మలచుకుని తనకంటూ ఓ పేజీని కేటాయించుకున్న సినీ కవి చంద్రబోస్‌.
చంద్రబోస్‌ సినీ అరంగేట్రం చేసే సమయానికి అప్పటికే లబ్ధ ప్రతిష్టులైన మహామహా కవులు కొలువు తీరి ఉన్నారు. ఓ పక్క ఎలాంటి పాట అయినా ఇట్టే రాసేయగల ఘటనాఘట సమర్ధుడు వేటూరి సుందరరామ్మూర్తి తన కలం బలంతో సినీ సామ్రాజ్యాన్ని శాసిస్తున్నారు. మరో పక్క పాటల మేస్త్రి సీతారామ శాస్త్రి కూడా స్వైరవిహారం చేస్తున్నారు. ఆలాంటి తరుణంలో... కుటుంబపరంగా ఎలాంటి సంగీత, సాహిత్య నేపథ్యంలేని చంద్రబోస్‌ పాటలు రాయాలని మక్కువతో ప్రయత్నాలు చేసారు.


ఆదిలో అవమానాలు-ఆపై సన్మానాలు

పాటలు రాయాలన్న కోరికతో చంద్రబోస్‌ ఇండస్ట్రీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న మొదట్లో అన్నీ అవమానాలే. ప్రతికూలతలే. నువ్వు పాటలు రాస్తావా? అంటూ ఎగతాళి చేసి వెక్కిరించినవాళ్లెందరో? పాటలు రాయడం అంత సులువు కాదు... తెలుగు భాషలో సంధులు, సమాసాలు తెలిసుండాలంటూ సూచనలు, సలహాలు ఇచ్చినవాళ్లంతమందో? ఇలాంటి పరిస్థితుల్లో ఏ మాత్రం వెనక్కి వెళ్లినా చంద్రబోస్‌ అనే సినీ కవి మన ముందు ఉండేవారు కాదు. అవమానాల్ని సన్మానాలుగా భావించారు. అడ్డంకుల్ని విజయ సోపానాలుగా మలచుకున్నారు. ఎలాగైనా సరే... సినిమాల్లో పాటలు రాయాలన్న సంకల్పాన్ని ఏనాడూ వదులుకోలేదు. వంద అవమానాలు ఎదుర్కోవడానికయినా సిద్ధమేనంటూ ప్రతికూల పరిస్థితులపై ఏకంగా యుద్ధమే ప్రకటించారు. ఒక్కో అవమానాన్ని పంటిబిగువున దిగమింగుతూ రాబోయే మంచి కాలం కోసం ఎదురు చూసారు. ఎలా... 21 అవమానాలు, తిరస్కరణలు ఎదురైన తరువాత చంద్రబోస్‌ కాలానికి దశ తిరిగింది. అవకాశం ముంగిట్లోకి వచ్చి వాలింది. అంతే... ! ఆ తరువాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకున్నారు. తాను నమ్ముకున్న అక్షరం సాక్షిగా మంచి పాట ఇచ్చేందుకే శాయశక్తులా శ్రమించారు. సత్ఫలితాలు సాధించారు. ఇప్పుడు... ఏ నోటా విన్నా చంద్రబోస్‌ పాట పలుకుతోంది. ఏ చోటనైనా ఆయన పాట నర్తిస్తోంది. ఏ కొత్త పాట వినిపించినా... పద ప్రయోగాలు కనిపెట్టి ఇది చంద్రబోస్‌ పాట అని జనం చెప్పుకునే స్థాయికి ఆయన చేరుకున్నారు.


ఎన్ని పాటలో? ఎన్నెన్ని విన్యాసాలో ?

ఒక్కో పాట ఒక్కో రంగూ రుచి చిక్కదనంతో ఉంటుంది. చిత్ర చిత్రానికి సన్నివేశానికి అనుగుణంగా పాటలు రాయాల్సిందే. అలా... సినిమా అవసరాలకు అనుగుణంగా పాటలు రాస్తూనే విశాల జనహితం కోసం కూడా తన అక్షరాన్ని ఉపయోగించారు చంద్రబోస్‌. చిలిపితనం, కొంటెతనం, అల్లరితనం, చీర చుట్టుకున్న శృంగారం, ప్రేమ, ఆత్మీయత, అనురాగం... ఇలా ఆయన పాటలకు ఎన్ని రంగులో? ఎన్ని హంగులో? మధ్యలో ప్రాణాలకు ఊపిరి పొసే సందేశ్‌ గీతాలు సైతం చంద్రబోస్‌ గీత గుచ్ఛంలో ఉన్నాయి. ఉదాహరణకు... మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెప్పింది... అన్నపాట ఎంతమందిలో స్ఫూర్తి నింపిందో? ఆయన మాటల్లోనే... తీవ్ర నైరాశ్యంలో చిక్కుకున్న ఓ యువకుడు ఈ పాట విన్న తరువాత ఆత్మహత్య ఆలోచనను విరమించుకుని...ఎన్ని కష్టాలు ఎదురైనా బతికి సాధించాలని నిశ్చయానికి వచ్చాడట. అంటే...పాట కేవలం ఉల్లాసం అందించడానికే కాదు... మనుషుల్లో ఆశని బతికించి ముందుకు నడిపించే ప్రయోజనకారి అని కూడా నిరూపితమైనది. ఒకప్పుడు...మహాకవి శ్రీశ్రీ రాసిన ‘వెలుగు నీడలు’ చిత్రంలోని ‘‘కల కానిది...విలువైనది... బతుకు కన్నీటి చారాలలోనే బాలి చేయకు’’...అనే పాట కూడా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపినదే.


చిన్న గరిగ నుంచి పెద్దస్థాయికి

వరంగల్‌ జిల్లాలోని చిన్న గరిగ అనే చిన్న పల్లెటూరు చంద్రబోస్‌ సొంతూరు. తండ్రి నరసయ్య, తల్లి మదనమ్మ. మే 10న జన్మించిన చంద్రబోస్‌తో సహా నరసయ్య దంపతులకు నలుగురు పిల్లలు. ప్రాధమిక పాఠశాలలో పనిచేసే నరసయ్య తెచ్చే ఆదాయం చాలక కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో పడిపొతే... తల్లి మదనమ్మ కూడా కూలీపనికి వెళ్లి వేన్నీళ్లకు చన్నీళ్లుగా కొంత సొమ్ము ఇంటికి తెచ్చేది. అప్పట్లో అనుభవించిన కష్టాలే తన జీవిత సౌధానికి సోపానాలయ్యాయని చంద్రబోస్‌ తరచూ సన్నిహితులతో చెప్తుంటారు. బాధలు పడనివారికి సుఖపడే అర్హత లేదని ఆయన అంటారు. కష్టాలే బతుకు అర్ధాన్ని విడమరచి చెప్తాయని ఆయన అభిప్రాయం. ఓపక్క కష్టాలు పడుతూనే...హైదరాబాద్‌లోని జవహర్లాల్‌ నెహ్రు టెక్నాలజికల్‌ యూనివర్సిటీలో ఎలక్టాన్రిక్స్‌లో ఇంజనీరింగ్‌ చేశారు చంద్రబోస్‌. పాటల రచయితకన్నా ముందుగా నేపథ్య గాయకుడిగా సినిమాల్లో అవకాశం కోసం ఆశ పడ్డారు. అందుకోసం...దూరదర్శన్‌లో సైతం పాడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలోనే శ్రీనాధ్‌ అనే స్నేహితుడు పాటల రచయితగా ప్రయత్నించమని సూచించడంతో చంద్రబోస్‌ దశ తిరిగింది. 1995లో ముప్పలనేని శివ దర్శకత్వంలో వచ్చిన ‘తాజ్‌ మహల్‌’ చిత్రం కోసం శ్రీలేఖ సంగీత దర్శకత్వంలో ‘‘మంచు కొండల్లోని చంద్రమా!’’.. అన్న పాటతో చంద్రబోస్‌ సినీ రంగ ప్రవేశం జరిగింది. ఆ పాట సూపర్‌ హిట్‌ కావడంతో అప్పటి నుంచి చంద్రబోస్‌ సినీయానం ఏ ఒడిదుడుకులు లేకుండా సజావుగా సాగిపోయింది. ఇంచుమించు అగ్ర దర్శకులందరి దగ్గర చంద్రబోస్‌ పనిచేసారు. అగ్ర హీరోలయిన చిరంజీవి, వేంకటేశ, నాగార్జున, పవన్‌ కళ్యాణ్, జూనియర్‌ ఎన్టీఆర్, రవితేజ, మహేష్‌ బాబు, ప్రభాస్, రామ్‌ చరణ్‌ తేజ...ఇలా ఎంతో మందికి పాటలు రాసారు. తొలినాళ్లలో చిరంజీవి చిత్రాలు ‘మాస్టర్‌’, ‘చూడాలని ఉంది’, ‘బావగారు బాగున్నారా’?, ‘ఇద్దరు మిత్రులు’, ‘ఠాగూô’, ‘అందరివాడు’, ‘జై చిరంజీవ’ ఇలా అనేక సినిమాలకు కలం సాయం అందించారు. అలాగే...మిగిలిన హీరోలకు కూడా ఆయన విజయవంతమైన పాటలు రాసారు. రామ్‌ చరణ్‌ తేజ ‘మగధీర’, ‘రంగస్థలం’ చిత్రాల్లోని పాటలు ఎంతటి హిట్టో చెప్పాల్సిన పని లేదు.


చంద్రబోస్‌ పాపులర్‌ సాంగ్స్‌

చంద్రబోస్‌ అనగానే ఎన్నో పాటలు గుర్తొచ్చినా... కొన్ని పాటలు మాత్రం ఇప్పటికీ జనం నాలికలపై నర్తిస్తూనే ఉన్నాయి. మహేష్‌ బాబు ‘1 నేనొక్కడినే’...చిత్రంలో సాయినార...సాయినార, నాగార్జున ‘డమరుకం’లో లాలీ, లాలీ.. జో లాలి, జూనియర్‌ ఎన్ఠీఆర్‌ ‘ఆది’ సినిమాలో నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది, ‘షిర్డీ సాయి’ చిత్రంలో సాయి అంటే తల్లి, ‘గబ్బర్‌ సింగ్‌’లో ఆకాశం అమ్మాయి అయితే, ‘జుమ్మంది నాద[ం’లో దేశమంటే మతం కాదు, ‘బాలు’ చిత్రంలో ఇంతే ఇంతింతే..., ‘జై చిరంజీవ’ చిత్రంలో జై గణేశా..., ‘నాకు నీవు - నీకు నేను’ చిత్రంలో తెలుగు భాష తీయదనం, ‘స్టూడెంట్‌ నంబర్‌ 1’లో ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి...లాంటి పాటలు ఇప్పటికీ జనం పాడుకుంటూనే ఉన్నారు. ‘సాంబా’లో నమస్తే, నమస్తే నీకు నమస్తే..., ‘మగధీర’లో పంచదార బొమ్మ, ‘నేనున్నాను’లో చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని..., ‘నాని’ సినిమాలో పెదవే పలికే మాటలో తీయని మాటే అమ్మ, ‘పల్లకిలో పెళ్లికూతురు’లో చీరలో గొప్పతనం తెలుసుకో..., ‘మృగరాజు’లో చాయ్‌ చటుక్కున తాగారా భాయ్, ‘రంగస్థలం’లో ఈ సేతితోనే...పాటలు జనాదరణ పొందాయి.


అలరించే ఆట...పాట

చంద్రబోస్‌ కుటుంబం ఆటపాటలతో ఆహ్లాదకరంగా ఉంటోంది. ప్రముఖ కొరియాగ్రాఫర్‌ సుచిత్రను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు చంద్రబోస్‌. దాంతో...అంతవరకూ పాటలతో ప్రతిధ్వనించింది ఇల్లు ఆటలతో కూడా అలరిస్తోందంటారు సన్నిహితులు. చంద్రబోస్‌ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒక కూతురు, ఒక కొడుకు. కూతురి పేరు అమృత వర్షిణి, కొడుకు పేరు నంద వనమాలి.
                     
                                                 

నంది అవార్డు

2002లో ‘పెళ్లి సందడి’ చిత్రానికి రాసిన పాటలకు గాను ఉత్తమ గీత రచయితగా నంది అవార్డుని చంద్రబోస్‌ అందుకున్నారు. 2004లో ‘ఆది’ సినిమాలో నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది పాటకు, అదే సంవత్సరం ‘నేనున్నాను’ చిత్రంలో చీకటితో వెలుగే చెప్పెను పాటకు నంది అవార్డులు అందుకున్నారు. 2014లో ‘మనం’ చిత్రంలో కనిపించిన మా అమ్మకు...అనే పాటకుగాను ఫిలిం ఫేర్‌ అవార్డు అందుకున్నారు. ఇంకా అనేక సాంస్కృతిక సంస్థల నుంచి అనేక పురస్కారాలు అందుకున్నారు.
                                                                                                                                                     
- పి.వి.డి.ఎస్‌. ప్రకాష్‌
సంబంధిత వ్యాసాలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.