పల్లె పదాలను యాతమేసి తోడిన జాలాది
‘యాలోయాల ఉయ్యాల, ఏడేడు జనమాలు మొయ్యాల... నాలుగు దిక్కుల ఉయ్యాల, నలుగురు కలిసే మొయ్యాల... కళ్ళు తెరుచుకుంటే ఉయ్యాల, కళ్ళు మూసుకుంటే మొయ్యాల’ (ఎర్రమందారం-1991) పాటకు ఉత్తమ గేయ రచయితగా నంది బహుమతి అందుకున్నారు ఆ విశిష్ట రచయిత. ‘యాతమేసి తోడినా ఏరు ఎండదు పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు... దేవుడి గుడిలోదైనా పూరిగుడిసెలోదైనా గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదూ ఆ దీపముండదు’ (ప్రాణం ఖరీదు-1978); ‘అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో తొలిచూపు కిరణాల నెలవంక నీవో’ (గృహప్రవేశం-1982); ‘పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్యభూమి నాదేశం సదా స్మరామి’ (మేజర్‌ చంద్రకాంత్‌- 1993) వంటి వైవిధ్యమైన పాటలు రాసిన ఘనత ఆ గేయరచయితదే. ఇంతకీ ఆ గేయరచయిత పేరు ‘జాలాది’. అసలుపేరు జాలాది రాజారావు. సాంఘిక, జానపద, దేశభక్తి, వేదాంత, శృంగార పరమైన ఎన్నో వైవిధ్యమైన పాటలు రాసిన సినీఘనాపాటి జాలాది. 1976లో నిర్మించిన ‘పల్లెసీమ’ చిత్రంలో ‘సూరట్టుకు జారతాది సితుక్కు సితుక్కు వానసుక్క... గుండెల్నే కుదిపేత్తాది గతుక్కు గతుక్కు ఏందేలక్కా’ అనే గ్రామీణ జానపది గీతాన్ని రాసి చిత్రసీమను ఆకట్టుకున్న జాలాది వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. సినీ గేయరచన ఆయన ప్రవృత్తి. రాశిలో తక్కువే అయినా వాసిలో గొప్ప పాటలు రాసిన అద్భుతకవి జాలాది. ఆగస్టు 9న జాలాది 87వ జయంతి. ఈ సందర్భంగా జాలాది గురించి కొన్ని విశేషాలు...

           

డ్రాయింగు మేస్టారుగా...

జాలాది రాజారావు ఆగస్టు 9, 1932న కృష్ణా జిల్లా దొండపాడులో జన్మించారు. జాలాది తల్లిదండ్రులు అమృతమ్మ, ఇమ్మాన్యుయేలు. వారు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. తండ్రి నాటి కృష్ణా జిల్లా బోర్డు (కృష్ణా జిల్లా ప్రజా పరిషత్‌) సభ్యుడుగా వ్యవహరించారు. ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు కూడా. జాలాది మంచి చిత్రకారుడు. స్కూలు ఫైనల్‌ పూర్తిచేసి స్పెషల్‌ తెలుగులో డిప్లొమా చేశారు. తరువాత టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సు కూడా పూర్తిచేసి జిల్లా పరిషత్‌ పాఠశాలలో డ్రాయింగ్‌ టీచర్‌గా వృత్తిని స్వీకరించారు. టీచర్‌గా వివిధ జిల్లాలలో పనిచేయడం వలన స్థానిక యాసను ఆపోసన పట్టారు. కోయలు, గోండ్లు, సవరలు, రెల్లీలతో పరిచయాలు పెంచుకొని జానపద గీతాలకు సాహిత్య సంపదపై విశేష కృషి చేశారు. స్పెషల్‌ తెలుగులో పట్టా పుచ్చుకున్న తరువాత జాలాదికి సినిమాలలో పాటలు రాయాలనే జిజ్ఞాస పెరిగింది. తన అదృష్టం పరీక్షించుకుందామని శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం స్కూలులో పనిచేస్తూ 1968లో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి గుడివాడలో స్థిరపడ్డారు. కొంతకాలానికి సినిమాలలో పాటలు రాసి అదృష్టం పరీక్షించుకుందామని మద్రాసు వెళ్లి అనేక ప్రయత్నాలు చేశారు. ఎందరో నిర్మాతలను, దర్శకులను కలిశారు. అందరూ ‘చూద్దాం’ అనేవారు కానీ అవకాశం ఇచ్చినవాళ్ళు లేరు. వున్న ఉద్యోగానికి రాజీనామా చేయడంతో మద్రాసులో చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తూ సినిమా అవకాశాలకోసం ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. ‘విశ్వమోహిని’, ‘కాకులమ్మ’ వంటి నవలలు రాస్తూ, ‘అమరజీవి’, ‘తండ్రి’, సమాధి’, ‘కారు మేఘాలు’ వంటి కథలు రాసి పత్రికలకు పంపుతూ జీవనం సాగిస్తూవచ్చారు.పల్లెసీమతో గేయరచయితగా...

1977లో నెల్లూరుకు చెందిన పి.బలరామిరెడ్డి, ఎస్‌.పరంధామరెడ్డి నిర్మాతలుగా శ్రీదేవిఆర్ట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ మీద ‘పల్లెసీమ’ చిత్రాన్ని నిర్మించారు. పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వం వహించగా, కె.వి.మహదేవన్‌ సంగీతం సమకూర్చారు. రంగనాథ్, జయసుధ, శ్రీధర్, గుమ్మడి, శరత్‌ బాబు, ప్రభాకరరెడ్డి, అల్లు రామలింగయ్య ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రంలో ఆరు పాటలుండగా రెండు పాటలను ఆచార్య ఆత్రేయ రాయగా, నారాయణరెడ్డి, అప్పలాచార్య, మోదుకూరి జాన్సన్‌ తలా ఒక పాట రాశారు. ఈ చిత్రానికి మాటలు రాసిన మోదుకూరి జాన్సన్‌ ద్వారా జాలాది దర్శకుడు చంద్రశేఖరరెడ్డికి పరిచయమయ్యారు. చంద్రశేఖరరెడ్డి చొరవతో ఇందులో ఆరవ పాటను జాలాది జానపదశైలిలో అద్భుతంగా రాసి మొదటి చిత్రంతోనే సినీ పండితుల ప్రశంసలు పొందారు. ‘సూరట్టుకు జారతాది సితుక్కు సితుక్కు వానసుక్క...గుండెల్నే కుదిపేత్తాది గతుక్కు గతుక్కు ఏందేలక్కా’ అనే పల్లవితో మొదలయ్యే ఈ పల్లెటూరి పాటను సుశీల శ్రావ్యంగా పాడారు. చరణంలో ‘పొగసూరిన ఆకాశంలో పోకిరోడు మెరిశాడూ...ఊరవతల నేలల్లో నన్ను ఉరిమి ఉరిమి చూశాడు.. సందెకాడ వూరంతా సద్దుమణిగి నిదరోతుంటే... సల్లంగా ఎపుడొచ్చాడో ఇల్లు ఒళ్లంతా తడిపేశాడూ...తడిసిపోయానా రేతిరి ఆడి జిమ్మడిపోనూ...కుదిపి సుట్టేశాడమ్మా, గాలి సచ్చినోడూ... గాలివానగాడూ’ అంటూ గాలివానలో తడిసిన చిన్నదాన్ని అద్భుతంగా వర్ణించారు జాలాది. అదే సంవత్సరం విజయనిర్మల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘దేవుడే గెలిచాడు’ చిత్రంలో ‘ఈ కాలం పదికాలాలు బ్రతకాలనీ ఆ బ్రతుకులో నీవూ నేనూ మిగలాలనీ’ అనే పాటను జాలాది రాయగా సుశీల గళంలో సంగీత దర్శకుడు రమేష్‌ నాయుడు స్వరపరచారు. అదే చిత్రంలో సుశీల పాడిన మరొకపాట ‘రావోయీ ఈరేయీ పోదాము రావోయీ ... వెంటాడుతుందీ సమయం బంధాలను తెంచాలనీ’ను కూడా జాలాది రచించారు. అందులో ‘పంచభూతాలు నేసిన ఈ వస్తాల్రతో రంగురంగు నూలుపోగు దేహాలతో అద్దెకొచ్చి బ్రతుకుతున్న జీవులివి, మడుగునీటి బుడగలాటి ప్రాణులివీ, ఈ దేహం విడిచిరా ఆత్మగా నడిచిరా’ అంటూ అద్భుతంగా చరణం రాశారు. ఈ రెండు పాటలు కూడా బాగా జనరంజకమయ్యాయి. ఈ రెండు సినిమాల పాటలతో జాలాదికి ఒక ప్రత్యేక స్థానం దొరికింది. కృష్ణ, మోహన్‌ బాబు నటించిన ‘చల్‌ మోహనరంగా (1978)లో ‘ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగ కలహంస నడకల కలికి, సింగారమొలకంగ చీర కొంగులు జారే రంకైన నవమోహనాంగి... ఈడు జోడు మనకు ఇంపుగా కుదిరింది కోపమెందుకే కోమలాంగి రావే’ అనే శృంగార గీతాన్ని కృష్ణ కోసం రాశారు. ‘చేసేది పట్నవాసం మేసేది పల్లెల గ్రాసం’ అనే పాటను కూడా అందులోరాశారు.

                          


మలుపు తిప్పిన ప్రాణం ఖరీదు...

1978లో నిర్మాత క్రాంతికుమార్‌ కె.వాసు దర్శకత్వంలో ‘ప్రాణం ఖరీదు’ చిత్రాన్ని నిర్మించారు. మెగాస్టార్‌ చిరంజీవి మొదట ‘పునాదిరాళ్ళు’ అనే చిత్రంలో నటించినా ముందు విడుదలైన (22-09-1978) చిత్రం ‘ప్రాణం ఖరీదు’. ఇందులో రావు గోపాలరావు, జయసుధ, చంద్రమోహన్, సత్యనారాయణ ముఖ్య తారాగణం. చిరంజీవికి జంటగా రేష్మా రాయ్‌ నటించిన ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం సమకూర్చారు. ఇందులో జాలాది రెండు పాటలు రాశారు. మొదటిది ‘యాతమేసి తోడినా యేరు ఎండదు పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు..దేవుడి గుడిలోదైనా పూరిగుడిసె లోదైనా గాలి ఇసిరికొడితే ఆ దీపముండదూ’ కాగా రెండవది ‘ఎన్నియల్లో ఎన్నియల్లో ఎందాకా యాలమీరి పోయేనమ్మా గూటి సిలకా.. ఓయమ్మా తిరణాల గిలకా వగలాడి వయ్యారి మొలకా, ఎన్నెల్లో ఇల్లెయనా, చుక్కల్లో పక్కేయనా’ అనే పాట. మొదటిది జాలాదికి గొప్పగా పేరుతెచ్చిన పాట. ఈ పాటకు రెండు చరణాలు. ఆ రెండూ అద్భుతాలే. ‘పలుపుతాడు మెడకేస్తే పాడియావురా-పసుపుతాడు ముడులేస్తే ఆడదాయెరా...కుడితి నీళ్ళు పోసినా అది పాలు కుడుపుతాదీ - కడుపుకోత కోసినా అది మణిసికే జనమయిస్తాదీ...బొడ్డుపేగు తెగిపడ్డ రోజు తలచుకో, గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో’ అంటూ మొదటి చరణంలో ఆడదాన్ని పాడియావుతో పోలుస్తూ పేగు బంధాన్ని గురించి చక్కగా చెప్పారు. ఇక రెండవ చరణంలో అన్యాయం ఎదిరించే బీదాబిక్కీలను కాకులతో, తెనెపూత వంటి మాయమాటలు చెప్పే నీటుగాళ్లను కోకిలతో పోల్చారు. ఆ చరణం ఇలా సాగుతుంది... ‘అందరూ నడిచొచ్చిన తోవ ఒక్కటే, సీము నెత్తురులు పారే తూము ఒక్కటే- మేడ మిద్దెలో వున్నా, సెట్టుమీద తొంగున్నా... నిదర ముదర పడినాక పాడె ఒక్కటే వల్లకాడు ఒక్కటే... కూతనేర్చినోళ్ల కులం కోకిలంటరా, ఆకలేసి అరిసినోళ్లు కాకులంటరా’. ఇది జాలాది చేసిన శిఖరాగ్ర వర్ణన. ఈ పాటను సత్యనారాయణ మీద చిత్రీకరించారు. రెండవ పాటలో ‘ఎన్నెల్లో ఇల్లెయ్యనా సుక్కల్లో పక్కేయ్యనా’ అనే వర్ణనకు అవధుల్లేవు. ఈ పాటను చిరంజీవి, రేష్మా రాయ్‌ల మీద చిత్రీకరించారు.ఎల్లలు లేని పాటలు...

వైవిధ్యమైన శైలితో జాలాది 275 సినిమాలలో పదిహేను వందలకుపైగా పాటలు రాసి తన కలం పదును చూపారు. 1979లో బాపు దర్శకత్వంలో వచ్చిన ‘తూర్పువెళ్ళే రైలు’ చిత్రంలో ‘కో అంటే కోయిలమ్మ కోకో... కో అంటే కోడిపుంజు కొక్కొరోకో’ పాట బాగా అలరించింది. అందులోదే మారొక పాట ‘సందెపొద్దు అందాలున్న చిన్నదీ యేటి నీట తానాలాడుతూ ఉన్నదీ... బొమ్మలా ముద్దుగుమ్మలా పువ్వులా పాలనవ్వులా మెరుపుతీగమల్లె తళుకుమంటే ఈ అద్దాల ఒళ్ళంత ముద్దాడుకోనా’ కూడా జనరంజకమైంది. అలాగే మోహన్‌ బాబు, జయసుధ నటించిన ‘గృహప్రవేశం’ చిత్రంలో జాలాది ఒక అద్భుతమైన తత్వాన్ని రాశారు. సత్యం స్వరపరచిన ఈ పాట ‘సిరిదేవి సింగారి సిలకా సిరిమల్లె సొగసైన నడకా... అమ్మరో అందాల బొమ్మా- ఏడేడు జనమాల గూడు కడతావమ్మ’ అనే పల్లవితో మొదలై చరణాలు ఇంకా అద్భుతంగా సాగుతాయి. ‘సూరీడు నుదురెక్కితే అల్ల సిరిలచ్చిమి నవ్విందట, శంద్రయ్య శిరమెక్కితే శివగంగ పొంగిందట- శివధనసు చేపట్టితే అల్ల సీతమ్మ కులికిందట... ఉమరాజు డమరాలలో అల్ల హిమరాణి ఆడిందట ... కలలన్ని నిజమైతె పున్నమేనంట - జలతారు ఎన్నెల్లో జలకాలె నంట’ అనేది తొలి చరణం కాగా మలి చరణంలో ‘నడియేటి నడకంటిది బతుకు పగడాల పడవంటిది అడుగడుగు సుడిగుండమై అల్లాడిపోతుంటది ...వయసేమో వరదంటిది దాని సొగసేమో నురగంటిది - అరిటాకు కెరటాలలో ఆల్లాడి పోతుంటది... ఏ గురుడు చేశాడో ఆ పడవసేత- ఏ బెమ్మ రాశాడో ఈ బొమ్మ రాత’ అంటూ ‘గుడిలాంటి గుండెల్లో బడబానలం రేగి బంగారు కొలిమల్లె బతుకాయెనంట’ అంటూ ముగిస్తారు. అదే సినిమాలో జాలాది ఒక శృంగార గీతాన్ని రాశారు. ‘అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో - ఆ తొలిచూపు కిరణాల నెలవంక నీవు/నవయుగ కవిరాజువో ప్రియతమ నెలరాజువో నా కనుదోయి కమలాల భ్రమరంబు నీవు’ అనేది ఆ శృంగార యుగళగీతం. రాజా, జయసుధ మీద చిత్రీకరించిన ఆ పాట ఓ సంచలనమే. పల్లెటూరి యాసలో జనపదులు ఎంత బాగా రాస్తారో అలంకార ప్రాయంగా ప్రేమగీతాలు కూడా అంతే సులభంగా, శ్రావ్యంగా రాయగల దిట్ట జాలాది. అద్భుత ప్రేమ పాటకు ఉదాహరణగా మోహన్‌ బాబు సొంత చిత్రం ‘బ్రహ్మ’లో జేసుదాసు పాడిన ‘ముసిముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన... ఏ నోము నోచినా ఏ పూజ చేసినా తెలిసి ఫలితమొసగేవాడు బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మఒక్కడే’ అనే పాటను చెప్పుకోవచ్చు. మోహన్‌ బాబు మరో సినిమా ‘అసెంబ్లీ రౌడీ’లో ఆవేశపూరిత గీతం ‘తూరుపు కొండల అగ్గిపుట్టెరో, దిక్కులన్ని ఎరుపెక్కి పోయెరో చీకటి గుండెలు చీల్చుకొచ్చెరో కటకటాలనే ఇరుసుకొచ్చెరో’ కూడా జాలాది రచనే. అందులోదే ‘తానాల గదిలోకి తారాజు వచ్చింది చీరందుకోవాలని అనుకుంటే నాకొంపంటుకుందిరో ఈలోగా’ అనే దివ్యభారతి మీద చిత్రీకరించిన ఉడికింపు పాట. ‘కోతలరాయుడు’ చిత్రంలో ‘ఒక నెలవంక చిరు గోరువంక’; ‘ధర్మచక్రం’లో ‘గోగులు పూచే గట్టుమీద’; ‘వారాలబ్బాయి’లో ‘కాకమ్మ కాకి’; ‘రేపటి పౌరులు’ చిత్రంలో ‘మాతృదేవోభవ తల్లులారా తండ్రులారా’; ‘అల్లుడుగారు’ చిత్రంలో ‘కొండమీద చుక్క పొద్దు’; ‘బొబ్బిలి సింహం’లో ‘శ్రీరస్తు శుభమస్తు’; ‘ఎర్రోడు’ చిత్రంలో ‘రాజనిమ్మలపండు’ వంటి పాటలు ఎన్నిరాశారో చెప్పుకుంటూపొతే పెద్ద చాంతాడే అవుతుంది.పుణ్యభూమి నాదేశం...

1993లో మోహన్‌ బాబు లక్ష్మి ప్రసన్న పిక్చర్స్‌ బ్యానర్‌ మీద కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘మేజర్‌ చంద్రకాంత్‌’ సినిమా నిర్మించారు. ఎన్‌.టి.రామారావు మేజర్‌గా నటించిన ఈ చిత్రంలో జాలాది ఒక అద్భుతమైన దేశభక్తి గీతాన్ని రాశారు. ఈ పాటలో ఛత్రపతి శివాజీ, వీరపాండ్య కట్టబ్రహ్మన, అల్లూరి సీతారామరాజు, సుబాష్‌ చంద్రబోసు వంటి అమరవీరులను కీర్తిస్తూ సాగుతుంది జాలాది పాట. కీరవాణి స్వరపరచగా బాలు ఆవేశంగా ఆలపించిన ఆ గీతం ‘పుణ్యభూమి నాదేశం నమోనమామి ధన్యభూమి నా దేశ సదా స్మరామీ... నన్ను కన్న నాదేశం నమో నమామి అన్నపూర్ణ నాదేశం సదా స్మరామీ... మహామహుల కన్నతల్లి నాదేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయదేశం ...నా దేశం’ ఒక గొప్ప దేశభక్తిని చాటే గీతం. ఈ పాటకు జాతీయ బహుమతి వస్తుందని అందరూ భావించారు. కానీ మన రాజకీయాల మధ్య అది సాధ్యమౌతుందా? ఈ విషయం జాలాదిని చాలా నిరాశ పరచింది. అందులోనే బాలు, చిత్ర ఆలపించిన ‘సుఖీభవ సుమంగళి సుఖీభవ సుశీలవై చిరాయువై సుఖీభవ’ అనే పాటను కూడా జాలాది రాశారు. జాలాది ముక్కుసూటి మనిషి. తనకు నచ్చని నిర్మాతను తనే దూరంపెట్టేవారు. ఆయన మనసెరిగి పాటలు రాయించుకున్న ఘనత నటుడు మోహన్‌ బాబుకు దక్కింది. విశాఖపట్నంలో స్థిరనివాసమేర్పరచుకున్న జాలాది అక్కడే 14 అక్టోబరు 2011న మరణించారు.

                                 

అవార్డులు... రివార్డులు...

‘ఎర్రమందారం’ సినిమాలో జాలాది రాసిన ‘యాలో యాల ఉయ్యాలా’ పాటకు 1990 సంవత్సరానికి ఉత్తమ గేయ రచయితగా నంది పురస్కారం లభించింది. మద్రాసు కళాసాగర్‌ సంస్థ ఉత్తమ గేయ రచయిత పురస్కారంతో జాలాదిని సత్కరించింది. విజయవాడ కల్చరల్‌ అసోసియేషన్‌ వారు 1957లో ‘కారుమేఘాలు’ నాటికకు ఉత్తమ బహుమతి ప్రదానం చేశారు. ఏలూరు ప్రభు చిత్ర అసోసియేషన్‌ వారు ‘నవరస కవి సామ్రాట్‌’ బిరుదుతో జాలాదిని సత్కరించారు. జాలాదికి ట్విన్‌ సిటీస్‌ కల్చరల్‌ అవార్డు, హైదరాబాదు ఫిలింఫేర్‌ అవార్డు లభించింది. 1987లో మద్రాసు కళాసాగర్‌ సంస్థ అవార్డు ప్రదానం చేసింది. అదే సంవత్సరం సినీ హెరాల్డ్‌ వారు జాలాదిని ఉత్తమ గేయ రచయితగా ఎంపిక చేశారు. ఆంధ్రావిశ్వవిద్యాలయం యాజమాన్యం 2008లో జాలాదికి ‘కళాప్రపూర్ణ’ బిరుదు ప్రదానం చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జాలాదిని ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో సభ్యునిగా నియమించింది. 1991, 1995 సంవత్సరానికి జాలాది నంది అవార్డుల కమిటీలో సభ్యునిగా వ్యవహరించారు.


- ఆచారం షణ్ముఖాచారి  


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.