అక్షరం గోరంత... అనుభూతి కొండంత... శ్రీరామ్ అనంత!
పాట...ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఉత్సాహాన్ని నింపుతుంది. చైతన్యాన్ని రగిలిస్తుంది. కొత్త దారులు చూపిస్తుంది. సరికొత్త గమ్యాల్ని పరిచయం చేస్తుంది. అంతలా అల్లుకుపోయిన పాట వినోదసీమలోనూ తన సత్తా చాటుతోంది. దర్జా ఒలకబోస్తోంది. బరువైన సన్నివేశాలు చక చకా కదిలిపోతుంటే...హఠాత్తుగా ప్రత్యక్షమైన ఓ పాట మనసుకి అత్తరు పూస్తుంది. హాయిని అందిస్తుంది. సినిమా పుట్టినప్పటినుంచి ఎంతో మంది కవులు పాటలకు పట్టాభిషేకం చేసారు. అక్షర సరస్వతికి అందెలు కట్టారు. చిత్రంలో సన్నివేశాలకు భావుకత అద్దారు. సినిమా పాటకు వన్నె తెచ్చినవారిలో వర్తమానానికి వస్తే అనంత శ్రీరామ్ కూడా ఒకరు.అలతి అలతి పదాలతో అనల్ప కల్పనాచాతుర్యాన్ని అలవోకగా ఆవిష్కరించే సినీ కవిగా ఆనతి కాలంలోనే పేరు తెచ్చుకున్న అనంత శ్రీరామ్ తెలుగు చిత్రసీమలో పదిమంది కోరుకునే పాటల సృష్టికర్త. రాసిన ప్రతిపాటా జనం నాలికలపై నర్తించే ప్రతిభని సంతరించుకున్నదే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక్కోసారి ఈ పాట అనంత శ్రీరామే రాశారా? లేక, సీతారామశాస్త్రి రాశారా? అనే అనుమానం కలిగేంత గాఢత ఉన్న కవి ఆయన. ఉదాహరణకు... నిజంగా నేనేనా... ఇలా నీ జతలో ఉన్నా? ఇదంతా ప్రేమేనా... ఎన్నో వింతలు చూస్తున్నా..అనే పల్లవితో సాగే కొత్త బంగారు లోకం సినిమాలోని ఈ పాటని చాలారోజులవరకూ సీతారామశాస్త్రి గారే రాసారని శ్రోతలు భ్రమించారు. కారణం... రెండక్షరాల ప్రేమని అక్షరాల్లోకి ఆవిష్కరించే విషయంలో సీతారామశాస్త్రి గారికి తన ముద్ర ఒకటుంది. సున్నితమైన భావాన్ని సుతిమెత్తగా చెప్పడంలో ఆయన సిద్దహస్తులు. మరీ ప్రత్యేకించి... సందర్భాన్ని బట్టీ పాటలో ప్రయోగించే పదాలు ఆ పాటకి అలంకారాలుగా మారుతాయి. అది ఆయన శైలి. ఆ శైలిని పట్టుకున్నట్లే...అనంత శ్రీరామ్ కూడా పాటలో కొత్త బంగారు లోకాన్ని అందంగా దింపేశారు. దాంతో...కొన్నాళ్ల పాటు ఆయన రాసిన ఈ పాట సీతారామశాస్త్రిగారి ఖాతాలో శ్రోతలు వేసేసిన తర్వాత అనంత శ్రీరామ్ కూడా అంతటి ప్రతిభను కనబరిచారంటూ ప్రసంశల వర్షం కురిపించారు. పాట రాయడం వేరు...పాట స్థాయిని అవగాహన చేసుకుని అర్ధవంతంగా రాయడం వేరు. అలా రాసిన కవులే అనంతర కాలంలో లబ్ధప్రతిష్టులవుతారు... ఓ అనంత శ్రీరామ్ లా.

* 12వ ఏట పలికిన పాట
12 ఏళ్ల వయసులోనే పాటల పందిట్లో సేద తీరడానికి సమాయత్తమయ్యారు అనంత శ్రీరామ్. చూసిన...స్ఫూర్తిని పొందిన అనేకానేక అంశాలపై పాటలు కట్టడం... మురిసిపోవడం... మళ్ళీ మళ్ళీ ఆ ఇష్ట వ్యాపకంతో మునిగి తేలడం...అలవాటుగా పరిణమించి...ఆ పై ఆ ప్రవృత్తే వృత్తిగా మారడం ఆయనకు అందిన వరం. పాటలు కడుపు నింపుతాయా? అన్న ప్రశ్న తొలినాళ్లలో ఆయనకు కూడా ఎదురైనది. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ లో మూడో సంవత్సరం చదువుతున్నప్పుడు వవ ప్రశ్న కొడవలి లా గాయ పరిస్తే... అంతు చూడాలనే కృత నిశ్చయంతో చదువును అర్ధాంతరంగా ఆపేసి... పాటల బాటసారిగా మారిపోయారు. హైదరాబాద్ ఫిలిం నగర్ లో తనని తను నిరూపించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అప్పట్లో...అనంత శ్రీరామ్ ఆ నిర్ణయాన్ని తీసుకోకుంటే ... తెలుగు సినిమాకి ఓ మంచి కవి పరిచయం కాకుండాపోయేవారు.


* ఇదీ పాటల ప్రయాణం
2005లో కాదంటే ఔననిలే... అన్న సినిమాకి పాటలు రాయడం ద్వారా అనంత శ్రీరామ్ తెలుగు సినిమాకి పరిచయమయ్యారు. అదే సంవత్సరం ఓకే వూరిలో సినిమాలో ఒక్క పాట మినహా అన్ని పాటలను ఆయనే రాశారు. అందరివాడుతో గుర్తింపులోకి వచ్చారు. 2006లో చిరంజీవి అందరివాడు సినిమాకి అనాథ శ్రీరామ్ రాసిన యుగళం జనబాహుళ్యంలోకి యిట్టె వెళ్ళిపోయింది. ఓ పడుచు బంగారమా...పలుకవే సరిగమ... చిలిపి శృంగారమా...చిలకవే మధురిమ ...అన్న పాటతో ఆయన పాటల ప్రస్థానం విజయాల మజిలీలను దాటుకుంటూ శరవేగంగా సాగిపోయింది. అదే సంవత్సరం ఏమండోయ్...శ్రీవారు, బొమ్మరిల్లు చిత్రాల్లోని పాటలకు కూడా మంచి పేరు వచ్చింది. అపుడో...ఇపుడో... కలగన్నానే చెలి... అక్కడో..ఇక్కడో...ఎక్కడో మానసిచ్చానే మరి ...అంటూ రాసిన పాట ఇప్పటికీ తెలుగునాటని ఊపేస్తోంది. 2006లోనే మరోసారి స్టాలిన్ చిత్రం ద్వారా చిరంజీవి కోసం పాటలు రాసారు. గో...గో...గోవా..., తోబరే తోబా, పరారే పరారే పాటలు జనరంజకమయ్యాయి. 2007లో యమదొంగ సినిమాలో సూపర్ హిట్ సాంగ్స్ రాసారు. నువ్వు ముట్టుకుంటే...రబ్బరు గాజులు... నూనూగు మీసాలోడు, నాచోరే...నాచోరే, యంగ్ యమ... పాటలు ఎంతటి ప్రాచుర్యాన్ని సాధించాయో చెప్పనలవి కాదు. యంగ్ యమ పద ప్రయోగం అప్పట్లో ప్రశంసాపాత్రమైనది. ఇక, చందమామ సినిమాకోసం ఆయన రాసిన నాలో ఊహలకు... అన్న పాటకి సుప్రసిద్ధ గాయని ఆశ భోంస్లే ఊపిరులూదారు. ఆ వరవడిలోనే...మున్నా, మహారథి, శౌర్యం, బలాదూర్, ఉల్లాసంగా...ఉత్సాహంగా, ద్రోణ, పరుగు, కంత్రి, ఆకాశ రామన్న, ఇంకోసారి, కుర్రాడు, శశిరేఖ పరిణయం, సత్యమేవ జయతే, అరుంధతి, డార్లింగ్, శుభప్రదం, మిరపకాయ్, బృందావనం, ఊసరవెల్లి, మిస్టర్ పర్ఫెక్ట్, ప్రేమ కావాలి, అలా మొదలైనది, దడ, నాన్న నుంచి తాజాగా గీత గోవిందం, అర్జున్ రెడ్డి, సాహసమే శ్వాసగా సాగిపో...ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పాటలు రాశారు. ఆయన రాసిన ప్రతి పాట ప్రేక్షకుల గుండెని హత్తుకుంటుంది. పరుగు చిత్రంలో ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి... నిన్నే ఊరించాలని అన్నాయి, నమ్మవేమో కానీ, అందాల యువరాణి అంటూ ఆయన కలం జాలువార్చిన ప్రేమానుభూతులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. బాహుబలిలో ఆయన రాసిన పాత పచ్చబొట్టేసిన పిల్లగాడా...నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా! అన్న పాట చిత్రీకరణ కూడా పాటకు తగ్గట్టే ఎంతో అందంగా ఉంది.

* పాటలతో సామాజిక సందేశాలు
అనంత శ్రీరామ్ పాటలతో సామజిక సందేశాలు కూడా ఇస్తూ వచ్చారు. ఓటు విలువ చెప్పడంతో పాటు జన అవగాహన కోసం తనకు తోచిన అనేక అంశాల్ని ముందుకు తెస్తున్నారు. రాశితో పాటు వాసి కూడా అందివ్వాలని తాపత్రయపడే ఆయన తనదాకా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటూ ముందుకు సాగుతున్నారు.

* వ్యక్తిగతం
అనంత శ్రీరామ్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని దొడ్డిపట్ల అనే గ్రామంలో 1984 ఏప్రిల్ 8న పుట్టారు. ఆయన తల్లి ఉమారాణి, తండ్రి సీవీవీ సత్యనారాయణ.

* పురస్కారాలు
అనంత శ్రీరామ్ పాటలకు జనామోదం లభించడమే కాకుండా వివిధ సాంస్కృతిక సంస్థల నుంచి అవార్డులు, పురస్కారాలు లెక్కకు మిక్కిలి లభించాయి. 2012లో ఏటో వెళ్ళిపోయింది మనసు చిత్రానికి రాసిన పాటలకు ఉత్తమ గీత రచయిత గా నంది అవార్డుతో పాటు ఫిలిం ఫేర్ అవార్డు కూడా దక్కింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకి రాసిన పాటలకు గాను 2014లో సైమా ద్వారా ఉత్తమ గీత రచయిత పురస్కారాన్ని అందుకున్నారు.

-పి.వి.డి.ఎస్ . ప్రకాష్Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.