‘వన్‌ బాయ్‌ వన్‌ గాళ్‌ లుక్కింగు’..అంటూ కలం కదిలింది
నచ్చిన అమ్మాయి దొరకనప్పుడు...
దొరికిన అమ్మాయి నచ్చనప్పుడు...
ప్రతి కుర్రాడి హృదయం భగ్గుమంటుంది.
వెన్నెల వర్షంలో నిలబడినా... చిక్కటి చీకటి దుప్పటిలా కప్పేసినట్టుంటుంది.
గోదారి గట్టునున్నా.. థార్‌ ఎడారిలో నిలుచున్నట్టు దాహం వేస్తుంటుంది.
ఆ బాధని బ్రాందీ సీసాతోనో, బాల్యస్నేహితుడితోనో చెప్పుకోపోతే ఎలా..?
ఆ మాటల్ని పాటగా కూర్చకపోతే ఎలా..?
‘వేర్‌ ఈజ్‌ వేర్‌ ఈజ్‌ లవ్వింగూ వేర్‌ ఈజ్‌ వేర్‌ ఈజ్‌ ఫీలింగూ.. ఇన్‌సైడ్‌ హార్టూ బ్రేకింగూ.. హౌ ఐ లివ్వింగూ’ అంటూ పగిలిన మనసుని పాటతో అతికే ప్రయత్నం చేయాల్సిందే. ‘మజిలీ’లోనూ అలాంటి భగ్న ప్రేమికుడున్నాడు. తను వలచిన అమ్మాయికి దూరమై, మరో అమ్మాయి మెడలో మూడు ముళ్లూ వేశాడు. ఆ భామని మర్చిపోలేక, భార్యని ఏలుకోలేక కల్లుముంత అందుకుని ఓ పాట పాడుకున్నాడు. ఆ సందర్భాన్ని భాస్కరభట్ల ఒడిసిపట్టుకుని చమత్కారాన్ని, కన్నీళ్లనీ, కవిత్వాన్నీ ఇంకుగా చేసుకుని.. ‘వన్‌ బాయ్‌ వన్‌ గాళ్‌ లుక్కింగూ’ అంటూ కలాన్ని కదిలించారు. ఆ సంగతులు ఇవీ...


ర్శకుడు శివ నిర్వాణకి బ్రేకప్‌ పాటలు బాగా కలిసొచ్చినట్టున్నాయి. తన తొలి సినిమా ‘నిన్ను కోరి’లో బ్రేకప్‌ పాట ఒకటుంది. ‘సోల్మేటే దొరికిందనుకున్నా ఇంతలో.. సోలోగా వదిలేసెలిపోయే సంతలో’ అనే ఆ పాటను రాసింది భాస్కరభట్ల రవికుమార్‌. పాట హిట్టు.. సినిమా సూపర్‌ హిట్టు.

 శివ రెండో సినిమా ‘మజిలీ’లోనూ హీరోకి హీరోయిన్‌ హ్యాండిచ్చింది. ‘సోలో లైఫే సో బెటరూ’ అని పాడుకుందామనుకుంటే ఆ ఛాన్సు లేకుండా ఇంట్లోవాళ్లు మ్యాచు ఫిక్సింగు చేసేశారు. నచ్చిన అమ్మాయిని మర్చిపోలేడు. తాళి కట్టిన అమ్మాయిని భార్యగా చూడలేడు. ఇప్పుడు ఈ బాధలోంచి ఓ పాట పుట్టాలి. అప్పుడే శివ నిర్వాణకి విషాదాన్ని కూడా చమత్కారంతో మిక్సింగు చేసి, కవిత్వంతో కవరింగు ఇచ్చే భాస్కరభట్ల గుర్తొచ్చాడు.

సంగీత దర్శకుడు గోపీ సుందర్‌ ఓ క్యాచీ ట్యూను సిద్ధం చేశాడు. ‘పాటని ఇంగ్లీషు పదాలతో మొదలెడితే ఎలా ఉంటుంది భయ్యా..’ అంటూ భాస్కర భట్ల, గోపీ సుందర్‌ ముందే ఫిక్సింగు అయిపోయారు. అంతే.. భాస్కరభట్ల కలం కాలం కంటే వేగంగా రన్నింగు చేసేసింది.
‘వన్‌ బాయ్‌ వన్‌ గాళ్‌ లుకింగూ
హైటూ వెయిటూ చెకింగూ
పేరెంట్స్‌ మ్యాచూ ఫిక్సింగూ డౌరీ గివింగూ’ అంటూ పల్లవి మొదలెట్టాడు. ఇవి వినగానే శివకీ, సుందర్‌కీ బాగా నచ్చేసింది. ‘ఈపాట తప్పకుండా హిట్టు’ అనే భరోసా కలిగింది. ఇంగ్లిషు పదాలతో క్యాచీగా మొదలెడితే పనైపోదు. ప్రేమికుడిలోని బాధని, ఆ బాధలోని ప్రేమనీ అక్షరాల్లోకి మార్చాలి. తొలి చరణం నుంచే ఆ పని మొదలెట్టారు భాస్కరభట్ల. పెద్దలు కుదిర్చిన పెళ్లికి తలొంచే అబ్బాయిలంతా అమ్మా నాన్నల గురించే ఆలోచిస్తారు. నాన్న మాట ఇచ్చాడనో, పెళ్లికి ఒప్పుకోకపోతే అమ్మ అలుగుతుందనో వాళ్ల నిర్ణయానికి కట్టుబడతారు. అందుకే ‘నాన్నకే మాటిచ్చావనీ, అమ్మ అలిగిందనీ.. మనసుకే ఉరితాడేసి ముడివేస్తావా తాళిని’ అంటూ నవతరాన్ని ప్రశించాడు.

‘‘నూటికి తొంభైమందికి ప్రేమించిన అమ్మాయి దొరకదు. చాలా కారణాల వల్ల మరో అమ్మాయితో జీవితాన్ని పంచుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనసు మన మాట వినదు. లోపల ఏదో ఓ బాధ ఉంటుంది. ఆ సందర్భంలో వచ్చే పాట ఇది. తనలాంటి వాళ్లందరి తరపున వకాల్తా పుచ్చుకుంటూ పాడే పాటలా ఉండానుకున్నా’’ అని ఈ పాట గురించి చెప్పుకొచ్చారు భాస్కరభట్ల.

పాటంటే మనసులోని భావమే కాదు. చుట్టు పక్కల ఉన్న ప్రపంచం కూడా. ఈ పాట ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో పాడుతున్నాడనేదీ కవి గుర్తించగలగాలి. వీలైతే.. పాటలో ప్రదేశానికీ చోటివ్వాలి. అలాంటి ప్రయత్నం ఈ పాటలో కనిపిస్తుంది.
అదో రైల్వే క్వాటర్స్‌. సాయంత్రం అయితే హీరో తన స్నేహితులతో మర్రి చెట్టుకింద ఖాళీగా కూర్చుని మీటింగులు పెడుతుంటాడు. వాళ్ల గోలకి అక్కడి గాంధీ విగ్రహమే సాక్ష్యం. ఈ పాటకూ అడ్డా అదే. అందుకే.. ‘నీకు తోడు మర్రి చెట్టు.. స్కూలు గ్రౌండు.. గాంధీ బొమ్మా.. గుండెలోనా చెరిగిపోనీ నీ ప్రేమ బొమ్మా’ అని అక్షరీకరించాడు.
ఇష్టం లేని పెళ్లి, కాపురం చావుతో సమానం. ఆ బాధని, వేదనని వర్ణించలేం. కానీ దాన్ని కూడా ‘జంటకానీ పిల్లతో ఏడు అడుగులు వేయడం.. ఆరు అడుగుల గొయ్యినీ నీకు నువ్వే తవ్వడం’ అంటూ ఆవిష్కరించగలిగాడు.

‘‘దర్శకుడు శివ మంచి రచయిత. పాటకు ఏం కావాలో తనకు తెలుసు. రచయితలకు గౌరవం ఇస్తాడు. తను ఇచ్చిన స్వేచ్ఛతోనే ఈ పాట రాశాను. ఇంగ్లిషు పదాలతో పల్లవి మొదలెట్టడం క్యాచీగా ఉంటుందనే. ఆ స్థానంలో తెలుగు పల్లవులూ రాశా. కానీ మా అందరికీ ఇంగ్లిషువే నచ్చాయి. చరణాలు నాలుగు రాశా. నాలుగూ గోపీకి బాగా నచ్చాయి. కానీ లెంగ్త్‌ సరిపోదు కదా? అందుకే ‘వేలి కొసలే తాకినా వేల మైళ్ల దూరమా.. నవ్వుతూ ఎదురైనా నవ్వగలదా ప్రాణమా’ అంటూ కొన్ని మంచి లైన్లు రాసినా పాటలో చోటివ్వలేకపోయాం. ‘భూమధ్య రేఖ’లాంటి పదాల్ని పాటలో వాడుకోవడం చాలా కష్టం. ‘కళ్లలోకి చూడలేక.. మాట కూడా కలపలేక.. జీవితాంతం జంట మధ్య భూమధ్య రేఖ’ అనే లైన్‌ రాయడం చాలా సంతృప్తినిచ్చింది. జీవితాన్ని రైలు ప్రయాణంతో పోలుస్తుంటారు. కానీ పెళ్లి మాత్రం అలా కాదు. ఎవరొచ్చినా పక్కసీటు ఇచ్చేయలేం. ‘రైలు జర్నీ కాదురా.. లైఫు జర్నీ ప్రేమరా.. ఎవరైతే ఏంటనీ సర్దుకోలేం సోదరా’ అంటూ రాశా. పాట బయటకు రాగానే యువ తరానికి బాగా నచ్చేసింది. వాళ్ల పాటగా భావించి.. గుండెల్లో చోటిచ్చార’’ని ఆనందం వ్యక్తం చేశారు భాస్కరభట్ల.


చిత్రం: మజిలీ
గానం: రేవంత్‌
సంగీతం: గోపీ సుందర్‌
రచన: భాస్కరభట్ల రవికుమార్‌

పల్లవి: వన్‌ బాయ్‌ వన్‌ గాళ్‌ లుకింగూ
హైటూ వెయిటూ చెకింగూ
పేరెంట్స్‌ ఫిక్సింగ్‌ మ్యాచింగూ
డౌరీ గివింగూ
మారేజ్‌ బెల్సూ రింగింగూ
సింగిల్‌ బెడ్డూ షేరింగూ
ఇన్‌సైడ్‌ ఫస్ట్‌ లవ్‌ కిల్లింగూ
యూ ఆర్‌ డైయింగూ

చరణం1:
నాన్నకే మాటిచ్చావనీ..
నాన్నకే మాటిచ్చావనీ.. అమ్మ అలిగిందనీ
మనసుకే ఉరితాడేసి, ముడివేస్తావా తాళినీ
జంటకానీ పిల్లతో ఏడు అడుగులు వేయడం
ఆరడుగుల గొయ్యిని నీకు నువ్వే తవ్వడం
నీకుతోడూ మర్రిచెట్టు
స్కూలు గ్రౌండు గాంధీ బొమ్మ
గుండెలోనా చెరిగిపోనీ నీ ప్రేమబొమ్మా
వేర్‌ ఈజ్‌ ద.. వేర్‌ ఈజ్‌ ద
వేర్‌ ఈజ్‌ ద లవ్వింగూ
వేర్‌ ఈజ్‌ ద ఫీలింగూ
ఐ యామ్‌ ఫీలింగ్‌ క్రయింగూ... డయింగూ

చరణం 2:
కళ్లముందుండే రూపం
కళ్లముందుండే రూపం.. మనసునే తాకదే
మనసులో నిండిన ప్రాణం ఎదురుగవచ్చీ వాలదే
రైలు జర్నీ కాదురా.. లైఫు జర్నీ పెళ్లిరా
ఎవ్వరైతే ఏంటనీ.. సర్దుకోలేం సోదరా
కళ్లలోకి చూడలేకా.. మాటకూడా కలపలేకా
జీవితాంతం జంట మధ్య భూమధ్యరేఖా
వేర్‌ ఈజ్‌ ద.. వేర్‌ ఈజ్‌ ద
వేర్‌ ఈజ్‌ ద లవ్వింగూ
వేర్‌ ఈజ్‌ ద ఫీలింగూ
ఐ యామ్‌ ఫీలింగ్‌ క్రయింగూ... డయింగూ


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.