సిరివెన్నెలకు ‘పద్మా’లంకారం
క్షరాన్ని అందలం ఎక్కించిన నేర్పరి, పాటని గంగా ప్రవాహంగా మార్చి పరవళ్లు తొక్కించిన కూర్పరి, తెలుగు సినీ వనంలో పద కుసుమాలను పూయించి, సిరివెన్నెలను చిలికించిన గీతకారుడు సీతారామశాస్త్రిని ‘పద్మశ్రీ’ వరించింది. సరసం, శృంగారం, వేదన, ఆర్ద్రత, ఆలోచన... ఇలా కవిత్వానికి ఎన్ని ఒంపులు ఉన్నాయో, అక్షరంలో ఎన్ని అందాలు ఉన్నాయో తెలిసిన చిత్రకారుడు.. సిరివెన్నెల. ‘విధాత తలపున ప్రభవించినదీ’ అంటూ ఏ క్షణాన ఆయన తెలుగు సినిమా పాట కోసం కలం పట్టుకున్నారో, అప్పుడే ఆయన తెలుగు పాటకు ముద్దు బిడ్డ అయిపోయారు. అప్పటి సినీ సంగీత ప్రయాణం నిర్విరామంగా సాగుతూనే ఉంది. ‘సరస స్వర సుర ఝరీ గమనమైన’ ప్రయాణం ఆయనది. ‘అమృతగానమది అధరముదా, అమితానందపు యదసడిదా’ అని ఆశ్చర్యపరిచిన గీత రచన ఆయనది. ఆయన పాటలతో ప్రశ్నించారు, జోల పాడారు, మేల్కొలిపారు. సంక్లిష్టమైన సన్నివేశానికి సైతం... అందమైన, అర్థవంతమైన పదాలతో, సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా సాహిత్యాన్ని అందించారు.


చేంబోలు వేంకటయోగి, సుబ్బలక్ష్మి దంపతులకి ప్రథమ సంతానంగా 1955 మే 20న మధ్యప్రదేశ్‌లోని శివినిలో జన్మించారు సీతారామశాస్త్రి. అనకాపల్లిలో హైస్కూలు విద్యాభ్యాసం, కాకినాడ ఆదర్శ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్యకళాశాలలో చేరి ఒక యేడాది ఎమ్‌.బి.బి.ఎస్‌ చదివాక టెలిఫోన్స్‌ శాఖలో అసిస్టెంటుగా ఉద్యోగంలో చేరారు. కాకినాడలో ఉద్యోగం చేస్తున్నప్పుడే ఆంధ్రా విశ్వవిద్యాలయం లో ఎమ్‌.ఎ చేశారు. అక్కడే పలువురు సాహితీవేత్తలతో ఆయనకి స్నేహం బలపడింది. భరణి అనే కలం పేరుతో పలు పత్రికల్లో కథలు, కవితలు రాశారు. 1985లో కె.విశ్వనాథ్‌ ‘సిరివెన్నెల’ చిత్రంతో సీతారామశాస్త్రి గీత రచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు. అలా తొలి చిత్రం పేరే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది.

''సినిమా గేయ రచనే నాకు ఊపిరి. తెలుగు సినీ పరిశ్రమ మరో జన్మనిచ్చింది. పద్మ పురస్కారం నా బాధ్యతను మరింత పెంచింది. ఇది తెలుగు సినీరంగానికి లభించిన అరుదైన గౌరవంగా భావిస్తున్నా. హృదయం స్పందించేలా రాస్తే పసిపాప మొదలు పండు ముదుసలి వరకు అందరూ ఆస్వాదిస్తారు''.

-‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి.


('సిరివెన్నెల‌'తో ముఖాముఖి)Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.