వెయ్యి పాటలకి చేరువలో.. వనమాలి

‘ప్రేమేనంటావా...’ (టైమ్‌), ‘చిరుగాలి వీచెనే... చిగురాశ రేపెనే’ (శివపుత్రుడు)... ఇలా ఆరంభంలోనే సంగీతాభిమానుల్ని అలరించాయి ఆయన గీతాలు. ‘అరెరె.. అరెరె.. మనసే జారే’ (హ్యాపీడేస్‌) అంటూ యువ హృదయాల్ని తన కలంతో మరింతగా గిలిగింతలు పెట్టారు. ఆ చిత్రంలోనే ‘ఓ మై ఫ్రెండ్‌..’ అంటూ ఎప్పుడూ పాడుకునేలా ఓ మంచి స్నేహగీతం రాశారు. ‘నన్నొదిలి నీడ వెళ్లిపోతోందా..’ (ఓయ్‌), ‘అమ్మా అని కొత్తగా...’ (లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌), ‘ఎందుకో ఏమో..’ (రంగం), ‘నేనూ నువ్వంటూ వేరై ఉన్నా..’, ‘రూబా... రూబా...’, ‘చిలిపిగ చూస్తావలా...’ (ఆరెంజ్‌) - ఇలా గుర్తుండిపోయేలా ఎన్నో గీతాలు ఆయన కలం నుంచి జాలువారాయి. ఆ రచయిత పేరే... వనమాలి. పాత్రికేయుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన, ఆ తర్వాత గీత రచయితగా మారారు. ప్రస్తుతం మాటల రచయితగా కూడా పలు చిత్రాలకి పనిచేస్తున్నారు. ‘నే పడిపోయా పడిపోయా... అంటూ ‘బోస్‌’లోనూ, కనులను తాకే ఓ కల.. అంటూ ‘మనం లోనూ, కరిగేలోగా ఈ క్షణం... అంటూ ‘ఆర్య2’లోనూ ఆయన రాసిన మెలోడీ గీతాలు ఎదలోతుల్లోకి చొచ్చుకెళ్లాయి. హేయ్‌ పిల్లగాడా... అంటూ ఆయన పాటతో శ్రోతల్ని ‘ఫిదా’ చేసేశారు, ఏ మనిషికే మజిలియో... అంటూ ‘మజిలి’ చిత్రంతో ఫిలాసఫీ కూడా చెప్పారు. ఇవన్నీ మచ్చుకు కొన్ని మాత్రమే... ఇంకా తవ్వే కొద్దీ మంచి పాటలెన్నో కనిపిస్తాయి. ఈ రోజు వనమాలి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన జీవితం, పాటల ప్రయాణం గురించి విశేషాలు ‘సితార.నెట్‌’ పాఠకులకి ప్రత్యేకం.


అసలు పేరు ఇదీ

వనమాలి అనే కలం పేరుతోనే ప్రాచుర్యం పొందిన ఆయన అసలు పేరు... మణి గోపాలకృష్ణ అవల్దార్‌. చిత్తూరు సమీపంలోని మురుకంబట్టు గ్రామం ఈయన స్వస్థలం. అమ్మమ్మ ఊరైన రైల్వేకోడూరులో 1968 మే 19వ తేదీన పుట్టారు. కడప, కదిరి పట్టణాల్లో హైస్కూలు చదువు సాగింది. చిత్తూరు పట్టణంలో ఇంటర్, డిగ్రీ పూర్తయ్యాయి. చెన్నైలోని మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ తెలుగు సాహిత్యం చదివారు. ఎం.ఏలో యూనివర్సిటీ ర్యాంకుతో పాటు గోల్డ్‌ మెడల్‌ కూడా సాధించారు. తదనంతరం ప్రముఖ రచయిత నూతలపాటి గంగాధరం సాహిత్యం మీద మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ తెలుగు శాఖలో పరిశోధన చేశారు. ఈ పరిశోధనకు గాను మద్రాసు విశ్వవిద్యాలయం పి.హెచ్‌.డి. పట్టా ప్రదానం చేసింది.

* ‘హ్యాపీడేస్‌’తో...

సినీ పాత్రికేయుడిగా పనిచేసిన వనమాలి ‘టైమ్‌’ చిత్రంతో గీత రచయితగా మారారు. ‘శివపుతుడ్రు’లోని చిరుగాలి వీచెనే... పాటతో ఆయనకి మరింత పేరొచ్చింది. అవకాశాలు వెల్లువెత్తింది మాత్రం... ‘హ్యాపీడేస్‌’ విజయంతోనే! ‘‘నిజానికి ‘హ్యాపీడేస్‌’కి ముందే వంద పాటలకు పైగా రాసిన అనుభవం నాది. అయితే అంతవరకూ నేనే వనమాలి అని బయటి ప్రపంచానికి తెలియదు. ‘హ్యాపీడేస్‌’ తర్వాత పాటల రచనే ప్రధాన వృత్తయ్యింది. ‘హ్యాపీడేస్‌’ విజయం తర్వాత ఎప్పట్లాగే అనువాద చిత్రాలతో పాటూ, స్ట్రెయిట్‌ చిత్రాల పాటలతో కూడా బిజీ అయ్యాను. ఏ.ఆర్‌.రెహ్మాన్‌ నుంచి ఇళయరాజా, హ్యారిస్‌ జయరాజ్, దేవిశ్రీ ప్రసాద్, మణిశర్మ, తమన్, కె.ఎమ్‌.రాధాకృష్ణన్, అనూప్‌ రూబెన్స్, విద్యాసాగర్, యువన్‌ శంకర్‌ రాజా, గోపీ సుందర్‌.. ఇలా ప్రతి ఒక్కరితోనూ పనిచేసే అవకాశం కలిగింది. అలాగే మంగళంపల్లి బాలమురళీకృష్ణ, బాలు, కె.జె.యేసుదాస్‌ వంటి గొప్ప గొప్ప నాయకుల గొంతుల్లో నా పాటలు పల్లవించడం నాకు దక్కిన అరుదైన గౌరవం! తెలుగులో అగ్ర దర్శకులతో పాటూ తమిళంలో మణిరత్నం, శంకర్‌ వంటి వారితోనూ, అలాగే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన అత్యధిక చిత్రాలకు పాటలు రాయడం కూడా గీతరచయితగా నాకు దొరికిన అదృష్టం! ఒకప్పుడు కేవలం ఒకే ఒక్క పాట బాలు పాడితే చాలు, అదే వెయ్యి పాటల పెట్టుగా భావించిన నేను, ఇవాళ నిజంగా వేయి పాటలకు చేరువలో ఉండడం ఊహించని పరిణామం’’ అంటారు వనమాలి.

* పురస్కారాలెన్నో...

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ గేయ రచయితగా రెండు నంది అవార్డులు. బెస్ట్‌ లిరిసిస్ట్‌గా ఫిలిం ఫేర్‌ అవార్డు. మరో మూడుసార్లు ఫిలిం ఫేర్‌ అవార్డ్‌ నామినీగా ఎంపికయ్యారు! సినీ గోయర్స్‌ అవార్డుతోపాటు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రసార భారతి ద్వారా ఉత్తమ జాతీయ కవిగా పురస్కారం అందుకున్నారు.

* కొత్త అవతారాలు...

రానా దగ్గుబాటి నటిస్తున్న ‘అరణ్య’ చిత్రానికి మొట్ట మొదటి సారిగా మాటల రచయితగా మారారు వనమాలి. సంభాషణలతో పాటూ ఈ చిత్రంలో అన్ని పాటలూ ఆయనే రాశారు. ఈ చిత్రం తెలుగుతో పాటూ ‘కాడన్‌’ పేరుతో తమిళంలోనూ రూపొందుతోంది. ‘కాడన్‌’ చిత్రం కోసం తొలిసారి తమిళంలోనూ పాటలు అందించారు. అలాగే ఆది పినిశెట్టి నటిస్తున్న ‘క్లాప్‌’ చిత్రానికి కూడా మాటలు రాస్తున్నారు. అయితే ఎప్పటికయినా రచయితగా నా మొదటి ప్రాధాన్యత పాటలకే అంటారు వనమాలి.

* ఇష్టమైన కవులు...

నా కలాన్ని కవిత్వం వైపు మళ్లించింది సినారె గారే అంటారు వనమాలి. ‘‘ఆయన కవిత్వం నాకిష్టం! ఆయన ‘ప్రపంచ పదులు’ అన్నా అభి మానమే! ఇక చిన్నప్పట్నించీ విన్న పాటల్లో అత్యధిక భాగం వేటూరి గారివే, పాట బొమ్మని ఆయన పదాలతో చెక్కే తీరు నిరుపమానం! వర్ణమాలని స్వర్ణమాలగా మార్చి పాటలమ్మ మెడలో అలంకరించిన ఆ పుంభావ సరస్వతిని తలుచుకోని రోజుండదు! వీరి తర్వాత అలతి పదాలతో జీవితాన్ని పాటల్లో పొదిగిన ఆత్రేయన్నా ఇష్టమే! ఈ తరంలో సత్తువ తగ్గిన సినీ సాహిత్యానికి దివిటీలెత్తిన సిరివెన్నెల కలమన్నా శిరోధార్యమే’’ అంటూ తన అభిమాన కవుల గురించి చెబుతారు వనమాలి. కొత్తగా రాస్తున్న యువ రచయితలు చేయాల్సిందల్లా తెలుగు సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదవాలని సూచిస్తారు. ‘‘పఠనాసక్తి లేకుంటే భాష ఒంటపట్టదు! అది రాకుంటే పద సంపద పెరగదు! పాత కవుల పాటలు వినాలి. వారి ప్రయోగాలు పరిశీలించాలి. సందర్భాన్ని ఎంత సరళమైన పాటగా మలిచారో అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా సంగీతం మీద కనీస అవగాహన పెంచుకోవాలి. స్వర జ్ఞానం లేనిదే బాణీకి తగిన మాటలు పడవు. అలాగే వ్యాకరణం తెలియాలి. పాట వినడానికి ఎంత హాయిగా, సులభంగా అనిపిస్తుందో, రాయడానికి కూర్చుంటే అంత ఆషామాషీగా కలం ముందుకు వెళ్లదు. అది కత్తి మీద సాము వంటిది. పాత వాళ్ల పద ప్రయోగాలు, కొత్త వారి పోకడలూ తెలుసుకుని, ఈతరం శ్రోతల్ని ఆకట్టుకునేలా రాయగలిగినప్పుడే ఇక్కడ గేయ రచయితలుగా రాణించగలం’’ అంటారు వనమాలి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.