నవరస భరితం.. వేటూరి సాహిత్యం
ఆయన సాహిత్య ప్రవాహంలో కొట్టుకు వెళ్లాలనిపిస్తుంది...

ఆయన సాహిత్య వినీలాకాశంలో ఎగరాలనిపిస్తుంది...

-వేటూరి సుందర్రామ్మూర్తి పాటలు విన్న ప్రతి ఒక్కరూ అనుకునే మాటలివి. సంగీత అభిమానులకు ఆయన పాట వినందే గడవదు ఏ పూట.

ఆయన పాట...

అమావాస్యని పోగొట్టి పౌర్ణమి తీసుకొస్తుంది...


మోడుబారిన మనసును చిగురింపచేస్తుంది...

అన్యానాన్ని ఎదురించే స్ఫూర్తిన్నిస్తుంది...

సంతోషం పంచుతుంది, ఆనందం అందిస్తుంది...

నవ్విస్తుంది, ఏడిపిస్తుంది...

ఆలోచింపజేస్తుంది!

వేటూరి వందల సంఖ్యలో పాటలకు సాహిత్యం అందించారు. పద ప్రయోగంలో దిట్ట అనిపించుకున్నారు.

నేడు (జనవరి 29) వేటూరి జయంతి సందర్భంగా ఆయన సాహిత్య ప్రపంచంలో విహరిద్దాం...తొలి పాట:
కళాతపస్వి కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘ఓ సీతకథ’ చిత్రం వేటూరికి సినీ స్వాగతం పలికింది. ఇందులోని ‘భారతనారీ చరితం’ ఆయన రాసిన మొదటి గీతం.

ఆఖరి పాట:
అల్లు అర్జున్‌ కథానాయకుడుగా వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన ‘బద్రినాథ్‌’ చిత్రంలోని ‘ఓంకారేశ్వరి’.
ఈ రెండింటి నడుమ సాగిన బాట:
తొలి గీతం నుంచి తుది గేయం వరకు నడుమ ఎన్నో పాటలు రచించారు వేటూరి. ‘ఝుమ్మంది నాదం’, ‘శంకరా నాదశరీరాపరా’, ‘దొరకునా ఇటువంటి సేవా’, ‘సామజవరగమన’, ‘నెమలికి నేర్పిన నడకలివే’, ‘గోవులు తెల్లన గోపయ్య నల్లన’, ‘ఏ కులము నీదంటలే గోకులము’.. వంటి ఆరాధన, భక్తి సంబంధిత రాస్తూనే మరోవైపు ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’, ‘నా కోక బాగుందా’, ‘మంచమేసి దుప్పటేసి’, ‘అ అంటే అమలాపురం’ లాంటి కుర్రకారును ఊపేసే గీతాలు రచించారాయన. ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ అంటూ హృదయాన్ని హత్తుకున్నా.. ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’ అని సరసమాడినా ఆయనకే చెల్లింది. ఇలా కె.వి.మహదేవన్, చక్రవర్తి, ఇళయరాజా నుంచి దేవీశ్రీ ప్రసాద్, మిక్కీ జె.మేయర్‌ వరకు అందరి సంగీత దర్శకుల బాణీలకు పదాలు సమకూర్చారాయన.


కొన్ని మధురగీతాలు:

* ఔనన్నా కాదన్నా (లీడర్‌)


* ఉప్పొంగెలే గోదావరి, అందంగా లేనా (గోదావరి)


* యమునా తీరం సంధ్యారాగం (ఆనంద్‌)


* నాలోనే పొంగెను నర్మదా (సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌)


* ముకుందా ముకుందా (దశావతారం)


* నువ్వంటే నాకిష్టం (నువ్వులేక నేను లేను)


* అబ్బబా ముద్దు (చూడాలని ఉంది)


* మాఘమాసం ఎప్పుడొస్తుందో (ఎగిరే పావురమా)


* కన్నానులే కలయికలు (బొంబాయి)


* ఓ వానా పడితే ఆ కొండాకోన హాయి (మెరుపుకలలు)


* మన్మథరాజా (దొంగదొంగది)


* అ అంటే అమలాపురం (ఆర్య)


* కైకలూరి కన్నెపిల్లా (స్నేహంకోసం)


* నడక కలిసిన నవరాత్రి (హిట్లర్‌)


* అత్తో అత్తమ కూతురో (అల్లుడా మజాకా)


* అందం హిందోళం (యముడికి మొగుడు)


*గానం కోరుకునే గీతం వేటూరి.. గాయకుడు కోరుకునే కవి వేటూరి
- మంగళంపల్లి బాలమురళీ కృష్ణ
* పయనీర్‌ అన్నా.. ట్రెండ్‌ సెటర్‌ అన్నా.. వేటూరినే. నేను ఆయన కొనసాగింపు మాత్రమే.
-సిరివెన్నెల సీతారామశాస్త్రి
* ‘మా ఊపిరి నిప్పుల ఉప్పెన.. మా ఊహలు కత్తుల వంతెన.. జగడ జగడం’.. వేటూరి రాసిన ఈ పాట నాలో ఎంతో ధైర్యాన్నిచ్చింది. బాధలో ఉన్నప్పుడు, అధైర్యంలో ఉన్నప్పుడు, ఆనందంలో ఉన్నప్పుడు.. ఎప్పుడూ వేటూరి గారిని తలచుకుంటూనే ఉంటాను.
-హరీష్‌ శంకర్, దర్శకుడు.
* అలవోకగా పాటలు రాయగలిగిన మీకు ఏ పాట రాయడం కష్టంగా అనిపించిందని అడగ్గా.. ‘ప్రతిఘటన’ చిత్రంలోని ‘ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో’ పాట రాయడానికి ఎక్కువగా శ్రమించానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు వేటూరి.
సంబంధిత వ్యాసాలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.