వాగ్దేవి వర పారిజాతాలు...వేటూరి గీతాలు

పాట... ఆడపిల్లల భుజాలపై అందంగా జాలువారే అల్లరి పైట. ఓ పాట... కొత్తగా మీసమొచ్చిన కుర్రకారు గుండె గొంతుకలో కొట్టుమిట్టాడే కూనిరాగం. ఓ పాట ... కొండాకోనల్లో ఒక్కసారిగా దుమికే ప్రేమ జలపాత ప్రవాహం. ఇంకో పాట... గుండెల్ని పిండేసే విరహ గీతి. రక్తి, భక్తి, విరక్తి... ఇలా పాట పాటకో నేపథ్యం. ఆశలు, ఆశయాల సాధన కోసం ప్రజలందరినీ సామూహికంగా కట్టి పడేసే ఉద్యమ గీతాలు కొన్ని. శిశుర్వేత్తి, పశుర్వేత్తి గాన రస:పణి అన్నట్లు... ప్రతి ఒక్కరిని అలరించే పాటలు జీవితాల్ని ప్రభావితం చేసేవే. కవులంతమందీ అన్ని రకాల పాటలూ రాయలేరు. కొన్ని పాటలు మాత్రమే రాయడంలో లబ్ధప్రతిష్టులవుతారు. ప్రముఖ సినీ కవి శ్రీ వేటూరిలాంటి వారు మాత్రమే... తమ కలంతో ఎలాంటి సన్నివేశాన్ని అయినా సునాయాసంగా రక్తి కట్టించగలరు. అక్షర సరస్వతి పారాణి పాదాలని పాటల సిరిసిరి మువ్వలతో అలంకరించగలరు. ఔను... ఆయన అలనాటి శ్రీనాధుడికి అచ్చమైన, స్వచ్ఛమైన వారసుడు. ఈ యుగం నాదే అని సగర్వంగా ప్రకటించిన మనతరం మహాకవి శ్రీశ్రీని సందర్భానుసారం ఆవహించుకోగల సర్వ సమర్ధుడు. ఆయనే... వేటూరి. తొలుత పాత్రికేయుడిగా పనిచేసి... తరువాత తెలుగు సినిమా తల్లి అర్చనలో అనేకానేక అనర్ఘ గీత రత్నాలను అందంగా పొదిగి... సినీ గేయరచయితగా జీవితాన్ని సాఫల్యం చేసుకున్న మహా మనిషి. ఆయనే ఓ గీతంలో ప్రస్తావించినట్లు... కృషి ఉంటే మసుషులు ఋషులవుతారు...మహా పురుషులవుతారు... అన్నట్లే తన జీవితాన్ని సుసంపన్నం చేసుకున్నారు. నానృషి కురుతే కావ్యం... అన్నది ఆర్యోక్తి. ఆ రకంగా చూస్తే... మనమధ్య మనతోనే కదలాడిన ఋషితుల్యుడు వేటూరి సుందరరామ్మూర్తి.  ఈరోజు అయన వర్థంతి. ఈ సందర్భంగా వేటూరి గురించి కొన్ని విషయాలు...


జీవన నేపథ్యం

1936 జనవరి 29న కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెద్ద కళ్లేపల్లిలో వేటూరి సుందరరామ్మూర్తి జన్మించారు. మద్రాస్‌ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియేట్, విజయవాడలో డిగ్రీ పూర్తి చేసిన వేటూరి పండిత వంశానికి చెందినవారు. సుప్రసిద్ధ కవి వేటూరి ప్రభాకరశాస్త్రి కుటుంబానికి చెందినవారు. అప్పట్లో దైతా గోపాలం నటన, కధ, కవిత, గాన, దర్శకత్వ శాఖల్లో ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చేవారు. వేటూరి కూడా ఆయన దగ్గర తొలి పాఠాలు నేర్చుకున్నారు. తరువాత మల్లాది దగ్గర కూడా శిష్యరికం చేశారు. ఆపై... ఆంధ్రప్రభ దినపత్రికలో పాత్రికేయుడిగా 1956 నుంచి సుమారు 16 సంవత్సరాలు పనిచేశారు. సాహిత్యాభిలాషతో వేటూరి ఆకాశవాణి కోసం కొన్ని గేయ నాటికలు రాసారు. అందులో ఆయనకీ బాగా పేరు తెచ్చినది... సిరికాకుళం చిన్నది.... అన్న గేయ నాటిక. శ్రీ కృష్ణ దేవరాయలనాటి తెలుగు సంస్కృతిని, అప్పటి జీవన శైలిని అక్షరీకరించిన ఈ నాటిక పండిత పామరులను ఎంతగానో మెప్పించింది. ప్రబంధ కవుల పదబంధ విన్యాసాలు, ఆధునిక కవుల లలిత కవనాలు పుక్కిట పట్టిన వేటూరి మొదటినుంచి సినిమా అవకాశాల కోసం తహతహలాడలేదు. ఎన్టీఆర్‌తో ఎంతో సాన్నిహిత్యం ఉన్నా... ఆయనే స్వయంగా కొంతమంది సినీ ప్రముఖుల దగ్గరకు వెళ్లమని బలవంతపెట్టినా... తప్పించుకు తిరిగేవారు తప్ప... అవకాశాల్ని అంది పుచ్చుకోవాలన్న తాపత్రయం చూపించలేదు. కారణం... సినిమా సంస్కృతి తనకు సరిపడదనే భావనే. అదే ఆయన్ని తొలినాళ్లలో సినీ రంగానికి ఆయన్ని దూరంగా ఉంచింది. అయితే... 1974 దశకంలో వేటూరి సినీ ప్రస్థానం అనివార్యమైనది. కళాతపస్వి కె.విశ్వనాధ్‌ దర్శకత్వం వహించిన ‘ఓ సీత కథ’ చిత్రం వేటూరికి సినీ స్వాగతం పలికింది. ఆ చిత్రంలో ‘భారత నారి చరితం...’ అనే హరికథ వేటూరిగారిలోని పండితీ ప్రకర్షకు నిదర్శనం. ఆ హరికథ అప్పట్లో ఎంత ప్రాచుర్యం పొందిందో చెప్పనలవి కాదు. తొలి చిత్రంతోనే... యావత్‌ సినీ సాహితీ లోకాన్ని మంత్రముగ్దుల్ని చేసిన వేటూరి... ఆపై తన కలం బలంతో విజృంభించిన తీరు అనితర సాధ్యం. పురాణేతిహాసాలనుంచి, ప్రబంధ కావ్యాల వరకూ పుష్కలంగా అనుభవం ఉన్న ఆయన, పండితులని మెప్పించే పాటల్ని అలవోకగా రాయడమే కాదు... సినిమా కధకు అవసరమైన విధంగా అల్లరి పాటల్ని సైతం రాసి ఔరా? అనిపించారు. ‘శంకరాభరణం’లాంటి సినిమాల్లో సాహితీ విశ్వరూపాన్ని చూపిస్తూనే... మరోపక్క ‘అడవిరాముడు’లాంటి పక్కా కమర్షియల్‌ చిత్రాలకు కూడా పనిచేసి ‘ఆరేసుకోబోయి పారేసుకున్నా...’ తరహాలో ఊర మాస్‌ పాటలు కూడా ఆయన కలం రాసింది. అందుకే... వేటూరి కలానికి రెండువైపులా పదును ఉందని... ఆయన అభిమానులు పరవశించిపోతుంటారు. అలా అలా అలవోకగా సరస్వతి దేవి వేలు పట్టుకుని నడిపిస్తే... వేటూరి వేలకొద్దీ పాటలు రాసి పునీతులయ్యారు.


తీయ తేనియ ఊటలు

ఎన్ని పాటలు... ఎన్నెన్ని పాటలు. ఇదీ వేటూరి పాట అని ఏ ఒక్కటిని ప్రస్తావించగలం? ఒక్కో గీతం అమృత జలపాతం. సాహితీ వనంలో విరిసిన నవనవోన్మేష అక్షర పారిజాతం. ఉదహరించాలంటే... హృదయం చాలదు. ‘అడవిరామూడు’ చిత్రంలో ‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు...’ అన్న పాట స్ఫూర్తివంతమైన గీతం. అదే సినిమాలో ‘అమ్మ తోడు, అబ్బ తోడు’, ‘ఎన్నాళ్లకెన్నాళ్లకు...ఎన్నెల్లు తిరిగొచ్చే మా కళ్ళకు...’ అంటూ ఆయన కలం వీర విహారం చేసింది. 1977లో వచ్చిన ‘పంతులమ్మ’ చిత్రంలోని పాటలు కూడా వేటూరికి ఎంతో పేరు తెచ్చాయి. అవార్డులు, పురస్కారాలను అందించాయి. ఆ చిత్రంలో ‘మానసవీణ మధు గీతం’ సంగీత సాహిత్యాల అత్యద్భుత కలయికగా పేర్కొనవచ్చు. ‘సిరిసిరి మువ్వ’ చిత్రం కూడా వేటూరి ప్రతిభకు అద్దం పట్టింది. ‘జుమ్మంది నాదం...’, ‘గజ్జె ఘల్లు మంటుంటే...’, ‘అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ...’, ‘రా దిగిరా.. దివి నుంచి భువికి దిగిరా..’ అనే పాటలు ఇప్పటికీ శ్రోతల్ని అలరిస్తూనే ఉన్నాయి. ‘గోరింటాకు’లో ‘కొమ్మ కొమ్మకు సన్నాయి...’ ఇప్పటికీ మరిచిపోలేని వేటూరి గీతం. ‘శంకరాభరణం’ చిత్రంలో పాటలు సాహితీ అభిమానుల ప్రాత:స్మరణీయాలు. ‘ఓంకారనాదాను...’ పాట ఆయనకు ఎంత పేరు తెచ్చిందో చెప్పనవసరం లేదు. ‘మంచు పల్లకి’లో ‘మేఘమా.. దేహమా’, ‘మేఘ సందేశం’లో ‘ఆషాడ మాసాన’, ‘పాడనా వాని కల్యాణిగా’, ‘సితారా’లో ‘కిన్నెర సాని వచ్చిందమ్మ’, ‘జిలిబిలి పలుకులు చిలిపిగా పలికిన’, ‘అగ్ని పర్వతం’లో ‘ఈ గాలిలో’...ఇలా చెప్పుకుంటూ పోతే సంవత్సరాల తరబడి ఆయన చేసిన కృషికి శిరసొంచి నమస్కరించాల్సిందే. మరీ ప్రత్యేకించి, ‘ప్రతిఘటన’ చిత్రం కోసం వేటూరి రాసిన ‘ఈ దుర్యోధన, దుశ్శాసన, దుర్వినీతి లోకంలో..’ పాట గుండెల్ని కుదిపేస్తుంది. ‘అన్వేషణ’లో ‘ఎదలో లయ’, ‘ఏకాంత వేళ’, ‘కీరవాణి’ పాటలు మధుర తరంగాలు.

                                 

అవార్డులు...పురస్కారాలు

కొన్ని వేల పాటలు రాసిన వేటూరికి ఎన్నో అవార్డులు, పురస్కారాలు లభించాయి. ఎనిమిది నందులు ఆయన ఇంటికి నడిచొచ్చాయి. ‘పంతులమ్మ’ చిత్రంలో ఆయన రాసిన ‘మానసవీణ మధు గీతం’ పాటకి నంది పురస్కారం లభించింది. ‘శంకరాభరణం’ చిత్రంలో ‘శంకరా నాద శరీర పరా’ పాటకి, ‘కాంచన గంగ’లో ‘బృందావని ఉంది’ పాటకి, ‘ప్రతిఘటన’లో ‘ఈ దుర్యోధన, దుశ్శాసన, దుర్వినీతి లోకంలో’...పాటకి, ‘చంటి’ చిత్రంలో ‘పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడులోకం’, ‘సుందరకాండ’లో ‘ఆకాశాన సూర్యుడుండడు సంధ్యవేళకి’ పాటలకు నందులు నడిచొచ్చాయి. అలాగే, ‘రాజేశ్వరి కళ్యాణం’ చిత్రం కోసం ‘ఓడను నడిపే’, ‘గోదావరి’ చిత్రం కోసం ‘ఉప్పొంగెలే గోదావరి’ పాటలకి కూడా నందులు నడిచొచ్చాయి. ఇదే పాటకి ఫిలింఫేర్‌ అవార్డు కూడా వచ్చింది.


జాతీయ పురస్కారం

‘మాతృదేవో భవ’ చిత్రం కోసం వేటూరి రాసిన ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే?’ జాతీయ పురస్కారం లభించింది. అదే సినిమాలోని ‘వేణువై వచ్చాను భువనానికి...గాలినై పోతాను గగనానికి’ పాటకి మనస్విని అవార్డు వరించి వచ్చింది.

 


వేటూరిపై ప్రముఖుల అభిప్రాయాలు:

* వేటూరివారి పాటకి

సాటి ఏదని సరస్వతిని

చేరికోర పాటేశ్వరునికి వుజ్జీ

వేటూరేనంది నవ్వి వెంకటరమణ.

- ముళ్ళపూడి వెంకటరమణ ప్రశంస

* గానం కోరుకునే గీతం వేటూరి... గాయకుడు కోరుకునే కవి వేటూరి.

- మంగళంపల్లి బాలమురళి కృష్ణ

* పయనీర్‌ అన్నా... ట్రెండ్‌ సెట్టర్‌ అన్నా వేటూరియే... నేను ఆయన కొనసాగింపు మాత్రమే.

- సిరివెన్నెల సీతారామశాస్త్రి

ఇలా ఎంతోమంది మహానుభావులు వేటూరి పాండితీ ప్రకర్షను మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు. అవిశ్రాంతంగా చివరి క్షణం వరకూ గీత రచనలో తరించిన వేటూరి 2010 మే 22న తనువు చాలించారు. ఆయన లేకున్నా... ఆయన రాసిన వేలాది పాటలు ఇప్పటికీ సాహితీ బంధువులను అలరిస్తూనే ఉన్నాయి. తెలుగు అక్షరం ఉన్నంతవరకూ వేటూరి పాట చిరంజీవి.

- పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.