శివకాశీ సరుకీ పిల్లా..
తెలుగు చిత్రసీమలో యువ రచయితల జోరు కనిపిస్తోంది. కొత్త కలాలు సరికొత్త భావాల్ని, భావుకతని ఆవిష్కరించేందుకు పోటీ పడుతున్నాయి. నవతరం గీత రచయితలంటే ఎక్కువగా ప్రేమపాటలే రాస్తుంటారు. రాంబాబు గోసాల ప్రయాణం కూడా అలాగే మొదలైంది. ‘ఉయ్యాలా జంపాలా’, ‘మజ్ను’, ‘అర్జున్‌రెడ్డి’, ‘మజిలీ’ తదితర చిత్రాల్లో ఆయన రాసిన ప్రణయ గీతాలు శ్రోతల్ని అలరించాయి. ప్రేమ పాటలే కాదు అన్ని రకాల పాటలు రాయగలనని నిరూపించుకొనే ప్రయత్నంలో ఉన్నారాయన. ఇటీవల ‘కౌసల్య కృష్ణమూర్తి’లో పల్లెటూరు, తండ్రి, తన ముద్దుల కూతురు నేపథ్యంలో సాగే ఆ పాట ప్రయాణం ఎలా సాగిందో రాంబాబు గోసాల ‘ఈనాడు సినిమా’తో చెప్పుకొచ్చారు. ఆ    విషయాలివీ...

చిత్రం: కౌసల్య కృష్ణమూర్తి
రచన: రాంబాబు గోసాల
గానం: భీమనేని రోషితా సాయి, అనన్య నాయర్‌,
రాహుల్‌ సిప్లిగంజ్‌
సంగీతం: దిబు నినన్‌ థామస్‌పల్లవి: రాకాసి గడుసు పిల్లా
శివకాశీ సరుకీ పిల్లా
ఎవరిదీ ఎవరిదీ
అల్లరి చేష్టల అమ్మాడీ
ఆటల్లో గెలిచే కిల్లాడీ
జింకలా చంగున చిందాడి
జోరుగా వచ్చేస్తోంది
ఎవరిదీ ఎవరిదీ

మా ఇంటి దేవతా
మందార పూలతా
ఊరంతా నీ జత
రెండు జళ్ల చిన్ని సీత
బంగారు పిచ్చుక
చిన్నారి చంద్రిక
మా బుజ్జి గోపిక
సక్కంగున్న చిట్టి చిలకా

పెంకి పిల్లవే కొంటె పిల్లవే
అమ్మ పోలికే వచ్చినాదిలే
పొట్టి పిల్లవే గట్టి పిల్లవే
నాన్న కూచిలా పుట్టినావులే

చరణం: 1
నాన్న కన్న కల నిజమయ్యేలా
నీకున్న ఇష్టమే తీరేలా
కన్నమ్మా కలబడీ
ఈ ఆట నేర్చేయ్‌ వా
వెనకడుగు వేయని వ్యూహంలా
బరిలోకి నువ్వే దూకాలా
చిన్నమ్మా నిలబడీ
నీ చురుకు చూపెయ్‌ వా
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట పసి పాలపిట్ట
చిరునవ్వులిట్ట కురిసే
పూలబుట్ట పైడిగుట్ట పుట్ట తేనెపట్టా
వెండివెన్నెలింట మేఘమల్లె
నువ్వు మెరిసే ।। మా ఇంటి దేవతా।।
చరణం: 2
అల్లి బిల్లి జాబిలి నువ్వమ్మా
జాజిమల్లి కొమ్మకు చెల్లెమ్మా
చుర చురా చూడగా
సూర్యుడే పరుగమ్మా
కొండపల్లి బొమ్మే కౌసిమ్మా
పల్లె గుండె సవ్వడి నువ్వమ్మా
పుడమికే రంగులే నీ లేత నవ్వులమ్మా
బుల్లి బుగ్గలున్న తల్లి చిన్న పాలవెల్లి
ఇంద్రధనుస్సుమల్లె విరిసే
పల్లె పైరగాళి కేళి చందనాల హోళి
చల్లగుండమంటు నిండు దీవెనల్లో ముంచే
।। రాకాసి గడుసు పిల్లా।।
।। మా ఇంటి దేవత ।।


‘‘ఇప్పటిదాకా 30 సినిమాలకి పాటలు రాసుంటాను. నా వయసుని చూసో లేదంటే, ప్రేమ పాటలే బాగా రాస్తాననో తెలియదు కానీ ఎక్కువగా అలాంటి అవకాశాలే లభించాయి. తొలిసారి ‘కౌసల్య కృష్ణమూర్తి’తో భిన్నమైన నేపథ్యానికీ, సందర్భానికి పాట రాసే అవకాశాన్నిచ్చారు దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు. తమిళంలో విజయవంతమైన ‘కణా’కి రీమేక్‌గా రూపొందిన చిత్రమిది. మాతృకలో శివకార్తికేయన్‌, ఆయన కూతురు కలిసి ఒక పాట పాడారు. ఆ పాటనే ఇక్కడ నన్ను రాయమని చెప్పారు. అక్కడ 125 మిలియన్ల వ్యూస్‌ సంపాదించిన పాట అది. అలాంటి పాటని రాయడమంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నాలాంటి రచయితకి పెద్ద సవాల్‌. పైగా ఇది భీమనేని శ్రీనివాసరావు సినిమా. ఆయన సినిమాల్లో పాటలు ప్రత్యేకంగా ఉంటాయి. నేను పల్లెటూరు నుంచి రావడం, అన్ని రకాల నేపథ్యం, భావాలతో కూడిన పాటలు రాయాలనే ఆసక్తి ఉండటంతో వెంటనే ఒప్పుకున్నా. తమిళంలో ఏం రాశారో పట్టించుకోకుండా పాట సందర్భాన్ని, పాత్రల్ని గుర్తు చేసుకొని కలం పట్టా. ఒక రైతు కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయి, ఆమె అల్లరి, కలల్ని జోడించి రాయాల్సిన పాట ఇది. ఆ పాప తండ్రి ఒక రైతు అయినా క్రికెట్‌ అంటే ఎంతో ఇష్టం. నాన్న అభిరుచిని తెలుసుకొని తాను క్రికెటర్‌ కావాలనుకుంటుంది. అందుకోసం అబ్బాయిలు ఆడుతుంటే చూసి నేర్చుకుంటుంది. ఆమె అల్లరితో పాటు తపనని, తండ్రి ముచ్చట పాటలో వినిపించేలా ‘రాకాసి గడుసు పిల్లా... శివకాశీ సరుకీ పిల్లా’ అంటూ మొదలుపెట్టా. శివకాశీ అంటే శక్తిమంతమైన బాణాసంచానే గుర్తుకొస్తుంది. అమ్మాయిలో చురుకుదనం అంతలా ఉంటుందని చెప్పేందుకే ఆ పదం వాడా. ‘మా ఇంటి దేవతా.. మందార పూలతా... ఊరంతా నీ జత..’ అంటూ చిన్న చిన్న పదాలతో శబ్ధానికి తగ్గట్టుగా పాట రాశా. ‘నాన్న కన్న కల నిజమయ్యేలా... నీకున్న ఇష్టమే తీరేలా... కన్నమ్మా కలబడీ... ఈ ఆట నేర్చేయ్‌ వా...’ అనే పంక్తులు అమ్మాయికి ఆటపై మక్కువని చాటుతాయి. రెండో చరణంలో ‘పల్లె గుండె సవ్వడి నువ్వమ్మా... పుడమికే రంగులే నీ లేత నవ్వులమ్మా’ అనే వాక్యాలు ఎంతో ఇష్టం. పల్లెటూరి నేపథ్యం నుంచి వచ్చినవాణ్ని కావడంతో ఈ పాట రాయడం సులభమైంది. భీమనేని శ్రీనివాసరావు అమ్మాయి భీమనేని రోషితాసాయితోపాటు అనన్య నాయర్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఈ పాటని బాగా పాడారు. దిబు నినన్‌ థామస్‌ బాణీ తమిళంలో ఎంతగా అలరించిందో, తెలుగులోనూ అదే స్థాయిలో శ్రోతల మనసుల్ని తాకింది. పాట విడుదలైన వెంటనే చాలా మంచి స్పందన లభించింది. ఇప్పటిదాకా రాసిన పాటలు ఒకెత్తైతే, ఈ పాట మరో ఎత్తు. ‘తేజ్‌ ఐ లవ్‌ యు’ నుంచి నిర్మాత కె.ఎస్‌.రామారావు నన్నెంతగానో ప్రోత్సహిస్తున్నారు. ఆయన ఈ పాటకి లభించిన స్పందనపై చాలా సంతోషం వ్యక్తం చేశారు. నా కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాట ఇది’’.

Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.