పదహారేళ్ల సంగీత ప్రయాణం..

‘దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జండా మనదే’ అని తొలి చిత్రంతోనే దేశభక్తిని చాటాడు. ‘సూర్యుడు ఎవరయ్యా మన అందరి బంధువయ.. చంద్రుడు ఎవరయ్యా మన అందరి బంధువయ’ అంటూ ఆలోచింపజేశాడు. ‘కోడి పాయె లచ్చమ్మది కోడిపుంజు పాయె లచ్చమ్మది’ పాటతో యువతను ఉర్రూతలూగించాడు. ‘చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే’ గీతంతో ప్రేమను పంచాడు. ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా’ సాంగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇవన్నీ చేసింది ఎవరో ఇప్పటికే తెలిసి ఉంటుంది కదా! ఆయనే సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌. నేటితో అనూప్‌ 16 సంగీత ప్రయాణం పూర్తి చేసుకున్నాడు. తేజ దర్శకత్వంలో వచ్చిన ‘జై’ చిత్రంతో అనూప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. 2004 మార్చి 25న విడుదలైందా సినిమా. ఈ సందర్భంగా...

తొలి సినిమాతోనే శ్రోతలకు చేరువయ్యాడు అనూప్‌. కథకు తగ్గ పాటలు అందించి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ‘సంబరం’, ‘గౌతమ్‌ ఎస్‌.ఎస్‌.సి’, ‘వీధి’, ‘వేడుక’, ‘ద్రోణ’, అందరి బంధువయ’, ‘సీతారాముల కల్యాణం’ చిత్రాలకు సంగీతం ఇచ్చాడు. అయితే క్లాసికల్‌ హిట్‌గా నిలిచాయి. ఆది సాయి కుమార్‌ హీరోగా వచ్చిన ‘ప్రేమ కావాలి’ చిత్రంతో క్లాస్‌, మాస్‌ హిట్‌ అందుకున్నాడు అనూప్. ఈ సినిమా సంగీతపరంగా ఆయనకు ఎంతో పేరు తీసుకొచ్చింది. వరుస అవకాశాలు కల్పించింది. నితిన్‌ హీరోగా వచ్చిన ‘ఇష్క్‌’ సినిమాలోని అన్ని పాటలు శ్రోతల్ని విపరీతంగా అలరించాయి. ‘లవ్లీ’, ‘గుండెజారి గల్లంతయిందే’, ‘మనం’, ‘హార్ట్‌ ఎటాక్‌’, ‘ఒక లైలా కోసం’, ‘లౌక్యం’ ఇదే వరసలో నిలుస్తాయి. ఆ తర్వాత ఎన్టీఆర్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్‌’తో మాస్‌ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు అనూప్‌. ఈ చిత్రంలోని సంగీతం ఆయన్ను మరోస్థాయికి తీసుకెళ్లింది. ఇదే తరహాలో ఆయన విజయం అందుకున్న చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’. ప్రస్తుతం అనూప్‌ మ్యూజిక్‌ ఇచ్చిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’, ‘ఒరేయ్‌ బుజ్జిగా’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే వీటిలోని పాటలు అలరించాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.