తాళిబొట్టు తలుసుకోని.. తరలి రార పెనిమిటీ¨!
సరైన సందర్భం కుదిరినప్పుడు..! సన్నివేశానికి అక్షరాభిషేకం జరిగి తీరాల్సిందే అనిపించినప్పుడు. అలాంటప్పుడే ‘పెనిమిటీ’ లాంటి పాటలు పుడుతుంటాయి.


ప్రతీసారీ మంచి పాట రాయాలనే తపిస్తుంటుంది రచయిత కలం. కానీ ఆ సిరాకి సరైన ఆసరా దొరకాలి. అది కథ అందివ్వాలి. కథలోంచి, సన్నివేశంలోంచి పుట్టే పాటలే దానికి వేదిక. త్రివిక్రమ్‌ చిత్రాల్లో అలాంటి పాటలకే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ‘కట్‌ చేస్తే..పాట’ అనే ఫార్ములా ఆయన సినిమాల్లోనూ వుంటుంది. అలాంటి పాటల్లో ‘కత్తిరించలేని’ భావాలెన్నో పరుగెడుతుంటాయి. త్రివిక్రమ్‌ స్వతహాగా రచయిత కాబట్టి, సాటి రచయితల కలానికి ఎలాంటి ఆహారం వేయాలో బాగా తెలుసు. అందుకే ఆయన సినిమాల్లో పాటలు ఎక్కువ కాలం నిలబడిపోతాయి. ‘అరవింద సమేత వీర రాఘవ’లో ప్రతీ పాటా సందర్భం నుంచి పుట్టిందే అనిపిస్తుంది. అందులో ‘పెనిమిటీ’ పాట గుండెని మీటి, తీయగా మెలితిప్పి, హాయి గొలిపే అనుభూతుల్ని అందిస్తోంది. రామజోగయ్యశాస్త్రి రచించిన ఈ గీతానికి మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా పెనిమిటీ గీతం గురించి ఆయనేమన్నారంటే...

‘‘పెనిమిటీ పాట విడుదలైన కాసేపటికే అనూహ్యమైన స్పందన వచ్చింది. అది చూస్తే నాకే మాటలు రావడం లేదు. పాట రాసిన నేనే ఇప్పుడు మళ్లీ వింటుంటే కళ్లు చెమరుస్తున్నాయి. ఆనందంతో వెక్కి వెక్కి ఏడ్చేశాను కూడా. అదో అద్భుతమైన అనుభూతి. తెలియని మ్యాజిక్‌ ఉంది ఈపాటలో. ఇలాంటి పాట ఇచ్చినందుకు దర్శకుడు త్రివిక్రమ్‌కి జీవితాంతం రుణపడి ఉంటా. మంచి సందర్భం వస్తేనే ఏ రచయిత అయినా గొప్పగా రాయగలడు. సందర్భం అనేది పాటకు చాలా కీలకం. సరైన కథలు, సరైన సందర్భాలు వచ్చినప్పుడు దాన్నో సవాలుగా తీసుకుని మంచి పాట రాయడాన్ని నేనెప్పుడూ ఇష్టపడుతుంటా. త్రివిక్రమ్‌గారు పాట సందర్భం చెప్పారు. ఆయన మాటల్లోనే నాకో దారి దొరికింది. షూటింగ్‌ జరుగుతున్న ప్రదేశంలోనే అటూ ఇటూ తిరుగుతూ... ఈ పాట రాసేశా. నా కెరీర్‌లోనే వేగంగా రాసిన గీతమిది.
ఇంత పెద్ద పాటని, సినిమాలో చాలా ముఖ్యమైన సన్నివేశంలో వచ్చే కీలకమైన పాటని రాస్తున్నప్పుడు నేనూ, ఇలాంటి పాటని నాకు ఇస్తున్నప్పుడు దర్శకుడు చాలా బరువుని మోస్తుంటాం. ఎంత రాసినా ‘ఇంకా ఏదో రాయాలి.. ఇంకా ఏదో కావాలి’ అనిపించడం సహజం. కానీ నేను పాట రాసిన వెంటనే.. ‘మనకు కావల్సింది వచ్చేసింది..’ అంటూ దాన్ని ఓకే చేసేశారు త్రివిక్రమ్‌. దాంతో నేను ఎక్కువ శ్రమ కూడా పడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇది నాపై త్రివిక్రమ్‌గారికి ఉన్న అపారమైన నమ్మకం.

ప్రతీపాటకీ నేను ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతా. నాకు తెలియకుండానే ఈ పాటలో మరింతగా లీనమయ్యా. కొన్ని పాటలు తెలియని స్ఫూర్తినిఇస్తుంటాయి. తమన్‌ బాణీలో త్రివిక్రమ్‌ అందించిన సందర్భంలో నాకు ఆ స్ఫూర్తి స్పష్టంగా కనిపించింది. తమన్‌ ఎంత గొప్ప సంగీతకారుడో ఈ పాట వింటే అర్థమవుతుంది. పాట చాలా భావోద్వేగభరితంగా సాగుతుంది. ఆ ఛాయలు తగ్గకుండా రిథమ్‌ వినిపించాలి. శరీరంలో ఓ కదలిక రావాలి. అలాగని డాన్స్‌ చేసేలా ఉండకూడదు. ఇవన్నీ గుర్తు పెట్టుకుని ఈ పాటని కంపోజ్‌ చేశాడు తమన్‌. మొదటి చరణం తరవాత వచ్చే బీజియమ్స్‌, రిథమ్స్‌ చాలా బాగుంటాయి. దాన్ని పట్టుకోవడం సామాన్యమైన విషయం కాదు. ఈ పాటని కాలభైరవ చేత పాడించడం మరో మంచి ఆలోచన. కాలభైరవ గొంతు వింటుంటే లేతవయసులోని కీరవాణిగారు పాడుతున్నట్టే అనిపించింది.


కొత్తపాట గురూ!


చిత్రం: అరవింద సమేత వీర రాఘవ

సంగీతం
: తమన్‌

గానం
: కాలభైరవ

రచన
: రామజోగయ్య శాస్త్రి

సాకీ
: నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిశాను
నువ్వొచ్చే దారుల్లో చూపుల్ని పరిశాను
ఒంటెద్దు బండెక్కి రారా
సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
నలిగేటి నా మనసు గుర్తొచ్చి రారా
గలబోటి కూరొండి పిలిసినా రారా
పెనిమిటి... ఎన్ని నాల్లయినాదో నినుజూసి కల్లారా

పల్లవి
:
చిమ్మటి సీకటి కమ్మటి సంగటి
ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి
కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి
కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి
గుండెనే గొంతు సేసి పాడతాంది రార పెనిమిటీ

చరణం
:
పొలిమేర దాటిపోయావని
పొలమారిపోయే నీదానిని
కొడవలి లాంటి నిన్ను సంటివాడని
కొంగున దాసుకునే ఆలి మనసుని
సూసీ సూడక సులకన సేయకు
నా తలరాతలో కలతలు రాయకు
తాళిబొట్టు తలసుకోని తరలి తరలి రార పెనిమిటీ

చరణం
:
నరగోస తాకే కామందువే
నలపూసవై నా కంటికందవే
కటికి ఎండలలో కందిపోతివో
రగతపు సిందులలో తడిసిపోతివో
ఏలకు తింటివో ఎట్ట నువ్వుంటివో
ఏట కత్తి తలగడై ఏడ పండుకుంటివో
నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటీ

కొన్నిసార్లు కొన్నికొన్ని లాజిక్కులు మనకు అర్థం కావు. మన ఆలోచనలు కూడా ఓ చోట ఆగిపోతాయి. అలాంటప్పుడు దేవుడే కొన్ని పాటల్ని నడిపిస్తుంటాడు. ఈ ట్యూను పుట్టినప్పటి నుంచి, ప్రతి పదం బయటకు వచ్చేంత వరకూ.. జనంలోకి వెళ్లేంత వరకూ ఈ పాట వెనుక దేవుడు ఉన్నాడనిపిస్తోంది. అందుకే ఈ పాట ఇంత మంది హృదయాల్లోకి చొచ్చుకుని వెళ్లిపోతోంది. ‘పెనిమిటీ’ పాటకు మా గురువు సీతారామశాస్త్రి గారి అభినందన మర్చిపోలేను. క్రిష్‌, కొరటాల శివ.. ఇలా చాలామంది మెచ్చుకున్నారు. ఈ పాటకు రావాల్సిన అవార్డులూ, రివార్డులూ ఇప్పటికే వచ్చేశాయన్నంత సంతోషం కలిగింది. కొన్ని పాటలు అలా కుదురుతాయంతే. అలాంటి పాట పక్కన నా పేరు ఉండడం నా అదృష్టం. ఈ పాటని తెరపై చూస్తే.. ఇంకా బాగుంటుంది. విజువల్స్‌ ఈపాటకు మరింత గౌరవాన్ని తెచ్చిపెడతాయన్న నమ్మకం ఉంది’’.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.