కరోనా కష్టకాలంలో ప్రజల్ని రక్షించేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు పోలీసులు. వీళ్ల విధి నిర్వహణకు కొంతమంది సహకరిస్తుంటే మరికొందరు ఎదురుతిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల ఔన్నత్యాన్ని పాట రూపంలో తెలియజేసే ప్రయత్నం చేశారు సినీ గేయ రచయిత చంద్రబోస్. ఇటీవలే పోలీసులపై పలుచోట్ల జరిగిన దాడులు ఉదహరిస్తూ రాసిన ఈ గీతం ప్రతి ఒక్కరిని ఆలోచింజేస్తుంది. ‘‘లాక్డౌన్ సమయంలో పోలీసుల విధి నిర్వహణ చాలా గొప్పగా ఉంది. పోలీసులకు కొందరు సహకరిస్తున్నారు, కొందరు అడ్డుతగులుతున్నారు. ఈ అంశంపై పాట రాయమని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ గారు నన్ను అడిగారు. బాధ్యతతో రాశాన’ని తెలిపారు చంద్రబోస్.
ఆలోచించండి అన్నలారా
ఆవేశం మానుకోండి తమ్ముళ్లారా
రక్షించే పోలీసుని రాళ్లతో కొడతారా
ప్రాణాలర్పించే పోలీసుని పగవాడిగ చూస్తారా..
మంచి చేయబోతే ఆ చెయ్యిని నరికేస్తారా
అమ్మలాగ ఆదరిస్తే మొహాన ఉమ్మేస్తారా
ఆలోచించండి అన్నలారా
ఆవేశం మానుకోండి తమ్ముళ్లారా
నిద్రాహారాలు మాని మీ భద్రత చూశాడు
జబ్బు తనకు అంటునని తెలిసి అడుగులేశాడు
కన్నబిడ్డలను వదిలి కంచె మీకు కట్టాడు
కసిరి మీరు తిడుతున్నా కవచమల్లె నిలిచాడు
త్యాగానికి మెచ్చి మెడలో హారమేయమనలేదు
తను చేసే పనిలో మీ సహకారం కోరాడు
ఆలోచించండి అన్నలారా
ఆవేశం మానుకోండి తమ్ముళ్లారా