ఓడిపోవడం అంటే.. ఆగిపోవడం కాదే..
చిత్రం: చిత్రలహరి
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
గానం: కైలాస్‌ ఖేర్‌
రచన: చంద్రబోస్‌


ఓడిపోవడం అంటే.. ఆగిపోవడం కాదే
మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే

అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షం అందేనా
పడుతూ పడుతూ లేవనిదే.. పసి పాదం పరుగులు తీసేనా
మునిగి మునిగి తేలనిదే... కొవ్వొత్తి చీకటిని తరిమేనా
ముగింపే ఏమైనా... మధ్యలో వదలొద్దురా నీ సాధనా

ప్రయత్నమే మొదటి విజయం
ప్రయత్నమే మన ఆయుధం ।। ఓడిపోవడం అంటే ...।।

వెళ్లే దారుల్లోనా.. రాళ్లే అడ్డొస్తున్నా...
అడ్డును కాస్త మెట్టుగా... మలిచి ఎత్తుకు ఎదగాలి
చేసే పోరాటంలో... రక్తం చిందేస్తున్నా
అది ఎర్ర సిరాగా.. నీ చరితను రాస్తుందనుకోవాలి
అడుగంటూ వేశాక.. ఆగకుండా సాగాలిరా నీ సాధన
ప్రయత్నమే మొదటి విజయం
ప్రయత్నమే మన ఆయుధం ।। ఓడిపోవడం అంటే...।।


స్ఫూ
ర్తిదాయకమైన గీతాలకి చిరునామా చంద్రబోస్‌. ఆయన పాటలు నిరాశ నిస్పృహల్ని పారదోలుతుంటాయి. చైతన్యం రగిలించి లక్ష్యం వైపు కదిలేలా చేస్తుంటాయి. ‘మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది...’, ‘చీకటితో వెలుగే చెప్పెను నేనున్నాననీ...’, ‘ఆరాటం ముందు ఆటంకం ఎంత... సంకల్పం ముందు వైకల్యం ఎంత...’. - ఇలా ఎప్పటికీ గుర్తుండిపోయే గీతాలు ఆయన కలం నుంచి జాలు వారాయి. ఈసారి ‘ప్రయత్నమే మొదటి విజయం..’ అంటూ మరో స్ఫూర్తిదాయక గీతం రాశారు. సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన ‘చిత్రలహరి’ కోసమే ఈ పాటని రాశారు చంద్రబోస్‌. చిత్రం 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఈ పాట ప్రయాణం గురించి చంద్రబోస్‌ చెప్పిన విషయాలివీ...


‘‘సినిమా పాటంటే కాలక్షేపం కోసం మాత్రమే కాదు, కార్యదీక్షని పెంపొందించేందుకు... కర్తవ్యాన్ని బోధించేందుకు అని నిరూపిస్తూ అనుక్షణం మనకు తోడుగా నిలుస్తున్న పాటలు ఎన్నో ఉన్నాయి. నేను కూడా అలాంటి గీతాలు దాదాపు 35 రాశాను. వాటి సరసన నిలుస్తూనే, వాటికి భిన్నంగా మరోసారి అందరిలోనూ స్ఫూర్తిని రగిలించాలనే దీక్షతో ఈ పాట రాశా. ‘చూడాలని ఉంది’లో ‘ఓమారియా...’ పాట నుంచి, సాయితేజ్‌ ‘చిత్రలహరి’ వరకు స్ఫూర్తిదాయక గీతం ఎప్పుడు రాసినా మంచి స్పందన లభించింది. ప్రతి పాటకి ప్రత్యేకమైన కోణం, ప్రత్యేకమైన ఒక పార్శ్వం ఉంటుంది. ఒకొక్క పాటని ఒక్కో దృక్కోణంలో రాయడం వల్ల అవి నిలిచిపోతాయి. ప్రతి సినిమాలోనూ ప్రేమ గీతం ఉంటుంది. కానీ ఆ ప్రేమని దర్శించే కోణం, ప్రకటించే కోణం కొత్తగా ఉంటుంది. స్ఫూర్తి గీతాల్లో కూడా కొత్త భావాలు, కొత్త ఆలోచనలు, సరికొత్త అభివ్యక్తీకరణలు ఉంటేనే అవి చిరకాలం నిలిచిపోతాయి. ఈ పాట ఒక మంచి సందర్భంలో వస్తుంది. జీవితంలో విజయం రుచి ఎలా ఉంటుందో చూడాలని తపన పడే ఒక యువకుడికి, మరొకసారి అపజయమే ఎదురైనప్పుడు తన మానసిక వేదన, స్థితి ఎలా ఉంటుందో అద్దం పడుతూనే... వాళ్ల నాన్న చెప్పిన మాటలతో విజయం కోసం పోరాటం చేస్తూనే ఉంటాడు. ఆ క్రమంలో ఈ పాట వస్తుంది. దర్శకుడు కిషోర్‌ తిరుమల, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ ఈ సందర్భం చెప్పినప్పుడు ‘ప్రయత్నమే మొదటి విజయం...’ అనే మాట చెప్పాను. అది నచ్చి దీన్ని ఆధారంగా చేసుకొనే పాట రాయమన్నారు. ఈ పాటలోని కొత్త కోణం ఏమిటంటే... విజయం అనేది వందతో సమానం అనుకుంటే, ముందు పని ప్రారంభించడంతోనే పదో వంతు సాధించామని అర్థం. దాంతో లభించిన ఆత్మవిశ్వాసమే ముందున్న లక్ష్యాన్ని పూర్తి చేసేలా చేస్తుందని చెబుతందీ పాట. ఇందులో నాకు నచ్చిన అభివ్యక్తి ‘చేసే పోరాటంలో రక్తం చిందేస్తున్నా... అది ఎర్ర సిరాగా నీ చరితని రాస్తుందనుకోవాలి’ అనే వాక్యం. ఒక సాధకుడిని పతాక స్థాయికి తీసుకెళ్లి అతనిలో ఆవేశాన్ని, చైతన్యాన్ని రగిలించే అభివ్యక్తిగా భావిస్తాను. పాట పూర్తయ్యాక దేవిశ్రీప్రసాద్‌ దీనికి ముందు ఒక సాకీ ఉంటే బాగుంటుందని బాణీ ఇచ్చారు. దానికి ‘ఓడిపోవడం అంటే.. ఆగిపోవడం కాదే... మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే’ అని రాశా. దేవిశ్రీ ఈ పాటని పాడించిన విధానం చాలా బాగుంది. స్ఫూర్తిదాయక గీతాలు రాయడం రచయితగా నాకు ఎప్పుడూ సవాల్‌గానే ఉంటుంది, అదే స్థాయిలో సంతృప్తినీ ఇస్తుంటుంది’’.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.