తొలిరేయి జంట నోట... అమెరికా పాట!
మురుగన్‌ బ్రదర్స్‌ వారి చిట్టి చెల్లెలు (29-07-1970)

చిత్రం: ఏ.వి.యం.ప్రొడక్షన్స్‌ సమర్పించిన

గీత రచన: డాక్టర్‌ సి.నారాయణరెడ్డి,

గానం: బాలసుబ్రహ్మణ్యం, సుశీల

సంగీతం: సాలూరు రాజేశ్వరరావు

అభినయం: హరనాథ్, వాణిశ్రీ


ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది

ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది

ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి

ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి


పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ల కలలే పండగా


చిన్నారి చెలియ అపరంజి కలువ


చేరాలి కౌగిట జిలిబిలి నగవుల ।।ఈ రేయి।।


పరువాలు పల్లవి పాడగా నయనాలు సయ్యాటలాడగా


నిను చేరుకోగా నునుమేని తీగ


పులకించి పోయెను తొలకరి వలపుల ।।ఈ రేయి।।


ఎన్నెన్ని జన్మల బంధమో... ఏ పూల నోముల పుణ్యమో


నిను నన్ను కలిపె... నీ నీడ నిలిపె


అనురాగ సీమల అంచులు దొరికే ।।ఈ రేయి।।


ప్రపంచంలో తల్లి ప్రేమను మించిన ప్రేమ లేదంటారు. కానీ, ఆ తల్లిప్రేమకంటే అన్న ప్రేమ తక్కువ కాదని, అన్నాచెల్లెళ్ల అనురాగానికి అపూర్వ రూపకల్పన చేస్తూ ఏ.వి.యం సంస్థ యం.కృష్ణన్‌ దర్శకత్వంలో నిర్మించిన అపురూప చిత్రం ‘చిట్టిచెల్లెలు’. ఈ సినిమాకు సంగీత సామ్రాట్‌ సాలూరు రాజేశ్వరరావు సమకూర్చిన పాటల బాణీలు సంగీతాభిమానులను ఎంతగానో అలరించాయి. హరనాథ్, వాణిశ్రీ తొలి రేయి పాటగా రాజేశ్వరరావు ముందుగా ఇచ్చిన బాణీకి సి.నారాయణరెడ్డి ‘ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది’ అంటూ అద్భుతంగా పాట రాశారు. ఇదే సినిమాలో దాశరథి రాసిన ‘అందాలా పపిపాప అన్నయ్యకు కనుపాప’ పాటతో సమానంగా జనరంజకమైనదిగా ‘ఈ రేయి తీయనిది’ పాట పేరు తెచ్చుకుంది. అయితే ఈ పాటకు ‘లవ్‌ ఈజ్‌ బ్లూ’ అనే ఒక ఇంగ్లీషు ఆల్బంలోని వాద్య సంగీతపు పాట అనుకరణ అంటే ఆశ్చర్యం కలుగుతుంది. 1968లో అమెరికాలో మిలియన్‌కు పైగా రికార్డులు అమ్ముడై అమెరికా చార్టులో ఐదు వారాలు ప్రధమ స్థానాన్ని నిలుపుకున్న ‘లవ్‌ ఈజ్‌ బ్లూ’ అనే ఆల్బం వాద్య సంగీతంలోని బాణీని రాజేశ్వరరావు ఈ పాట కోసం యధాతధంగా వాడుకున్నారు. ఈ ఆల్బం సృష్టికర్త ఫ్రెంచి దేశపు ఆర్కెస్ట్రా సారథి పాల్‌ మారియట్‌. జాబ్‌ సంగీతంలో ప్రావీణ్యత సంపాదించిన మారియట్, ‘లీ గ్రాండ్‌ ఆర్కెస్ట్రా డీ పాల్‌ మారియట్‌’ పేరిట సొంత మ్యూజికల్‌ బ్యాండ్‌ను తయారు చేసి యూరప్, అమెరికా దేశాలు పర్యటించి తను సృష్టించిన ‘లవ్‌ ఈజ్‌ బ్లూ’తో పాటు ‘స్లో రాక్‌ అండ్‌ ట్విస్ట్‌’, ‘ఎ మేలీపెన్స్‌’, ‘లెస్‌ శాటలైట్స్‌ ఛాంటెంట్‌ నోయల్‌’ వంటి అనేక ఆల్బంలకు అసాధారణ ప్రచారం కల్పించాడు. ‘ఆన్‌ టాక్సి పోర్‌ టో బ్రౌక్, ‘హొరేస్, ‘ఫైటేస్‌ సాటర్‌ లా బాన్కవే’ వంటి ప్రఖ్యాత ఫ్రెంచ్‌ సినిమాలకు సౌండ్‌ ట్రాక్‌లు కూడా అందించాడు. ‘లవ్‌ ఈజ్‌ బ్లూ’ పాటను తొలుత ఫ్రెంచ్‌లో ‘లామౌర్‌ ఎస్ట్‌ బ్లూ’ అంటూ వినిపించే ప్రారంభ సాహిత్యంతో మొదలెట్టి దానిని ఇంగ్లీషులో ‘బ్లూ, బ్లూ, మై వరల్డ్‌ ఈజ్‌ బ్లూ...బ్లూ ఈజ్‌ మై వరల్డ్‌ నౌ.... అయామ్‌ వితవుట్‌ యూ’ గీతంగా రూపొందించి బహుళ జనాదరణ పొందాడు. మారియట్‌ ఎంతటి జనాదరణ పొందిన సంగీతకారుడంటే, జపాన్‌ దేశపు కాఫీ, వైన్‌ ఉత్పత్తుల ప్రచార చిత్రాల్లో ఆయన నటించగా ఆ ఉత్పత్తుల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. సంగీత సామ్రాట్‌ సాలూరు రాజేశ్వరరావుకు ప్రయోగాలు చేయడమంటే ఎంతో ఇష్టం. అర్థ రాత్రుళ్లు మేలుకొని రేడియోలో ప్రసారమయ్యే రష్యా, అమెరికా, జర్మనీ, చైనా వంటి వివిధ దేశాల సంగీతాన్ని వింటూ, అందులో ఏ పాటైనా నచ్చితే ఆ బాణీని గ్రంధస్థం చేసి సినిమాల అవసరానికి అనుగుణంగా ఆయా ట్యూనులతో పాటలు రూపొందించేవారు. చిత్రంలో వైవిధ్యం కోసమని అందుబాటులో ఉన్న వాద్యాలను పాశ్చాత్య బాణీలకు అనుసంధానించి పాటలకు రూపమిచ్చేవారు. అలా రూపుదిద్దుకున్నదే ‘చిట్టిచెల్లెలు’లో ‘ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది’ పాట. రాజేశ్వరరావు దాదాపు ఐదు దశాబ్దాలపాటు మధురమైన పాటలను మనకు అందించి వెండితెర వెలుగులకు సంగీత మధురిమలు అందించారు. ఎవరైనా ఒక మంచి బాణీ వినిపిస్తే ఆ బాణీని స్ఫూర్తిగా తీసుకోవడంలో తప్పు లేదంటారు రాజేశ్వరరావు. హిందీ చిత్ర సీమలో సంగీత దర్శకులు కూడా ఇలాంటి స్ఫూర్తి పొందినవారే. రాజేశ్వరరావు ప్రతిభ 1948లో వచ్చిన జెమిని వారి ‘చంద్రలేఖ’లో కనపడుతుంది. కర్ణాటక, హిందుస్థానీ, లాటిన్‌ అమెరికన్, పోర్చుగీస్, స్పానిష్‌ జానపద సంగీత పోకడలను సమ్మిళితం చేసి అద్భుతమైన సంగీతం అందించిన విషయాన్ని మరువరాదు. అందుకే అన్నారు సంగీతానికి ఎల్లలే లేవని! ఈ పాట కోసం సెల్లోలు, హేమండ్‌ ఆర్గాన్, ఆకార్డియన్, ఎలెక్ట్రిక్‌ గిటార్, శాక్సాఫోన్‌ ట్రంపెట్, సింథసైజర్‌ వంటి పాశ్చాత్య వాయిద్యాలను రాజేశ్వరరావు వాడారు.


- ఆచారం షణ్ముఖాచారి


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.