పల్లవి:
కరోనా కరోనా కరోనా
కన్నతల్లి కడుపుకోత కరోనా
కరోనా కరోనా కరోనా
చిట్టి చెల్లి నుదుటిరాత
కరోనా
మానవజాతి మనుగడ
కబళించే కరోనా
।। కరోనా ।।
చరణం: 1
నిలువెత్తు సూరీడై ఎదిగినట్టి కన్నబిడ్డ
కరోనా రక్కసి కోరల్లో చిక్కుకొని
క్వారంటైన్ ఐసోలేషన్ శిబిరాల్లో చనిపోతే
శవాల దిబ్బల్లోన ఆ బిడ్డను పారేస్తే
కడచూపు అయిన లేక తల్లడిల్లె ఆ తల్లి
గుండెలనే బాదుకుంటు సొమ్మసిల్లె ఆ తండ్రి
మరణమా... చచ్చిపో
జననమై... బ్రతికిపో
।। కరోనా ।।
చరణం: 2
చక్కని ఆ చుక్కలాంటి చెల్లి పెళ్ళి కోసమని
అమెరికా దేశానికి పనికెళ్ళిన అన్నయ్య
పగలు రేయి కష్టపడి లక్షలనే కూడబెట్టి
ఎన్నెన్నో ఆశలతో సొంత ఊరు వస్తుంటే
దారిలోనే దారికాచి అంటుకుంది కరోనా
పెళ్ళి మేళమాగిపోయి చావు మ్రోగెనా
కాలమా... న్యాయమా
మనిషిపై... కోపమా
।। కరోనా ।।
చరణం: 3
గడపదాటి పోరు చేస్తే స్వాతంత్య్రం ఆనాడు
నీ ఇంట్లో నువ్వుంటే దేశభక్తి ఈనాడు
ఇల్లు దాటి బయటికొస్తే కాటేసే విష పురుగిది
ఒకరి నుంచి ఇంకొకరికి అంటుకునే వైరస్ ఇది
మాస్కేరా కరోనాకు మందు పాతర
శుభ్రత పరిశుభ్రతలే ఆయుధాలురా
శాస్త్రమై... తెలుసుకో
శస్త్రమై.. సాగిపో
।। కరోనా ।।
చరణం: 4
కనిపించని శత్రువుది జాగ్రత్తర నేస్తమా
మందులేని మరణమిది తెలుసుకో మిత్రమా
మనిషి ఉనికి ఈనాడు ప్రశ్నార్థకమవుతుంది
నిర్లక్ష్యం వీడకుంటె బ్రతకడమే కష్టమంది
భయానికే భయం పెట్టి ధైర్యాన్ని గురిపెట్టు
నీకు నీవే సైన్యమయ్యి యుద్ధాన్ని మొదలెట్టు
సమరమే... జరపరా
అమరమై... నిలవరా
।। కరోనా ।।
- బాబ్జి, సినీ దర్శకుడు