హృదయాన్ని హత్తుకునే ప్రేమ పాట
నాకు ఇళయ రాజా సంగీతం చాలా ఇష్టం. ఆయన సంగీత దర్శకత్వంలో వచ్చిన ఏ పాటనూ వినకుండా వదలను. ఆయన అందించిన అన్ని పాటల్లో ‘గీతాంజలి’ సినిమాలోని ‘ఓ పాప లాలి’ చాలా ఇష్టం. రోజులో ఓ సారైనా ఈ పాట వింటాను. అంతగా నన్ను ఆకట్టుకున్న ఈ పాట గురించి కొన్ని విశేషాలు..


ప్రేమ అనే పదం పాతదే. ప్రేమికులు మాత్రం కొత్తగా పుడుతుంటారు. అందుకే బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకూ బోర్‌ కొట్టనిదంటూ ఏదైనా ఉందంటే అది ప్రేమకథ మాత్రమే. అయితే ప్రేమకథ హృదయాలని హత్తుకునేలా ఉండాలి. అందులోని ఆనందాన్ని, బాధని అన్నిటినీ నటులు నాది అని ఫీల్‌ అవ్వాలి. అప్పుడే ఆ ప్రేమకథ విజయవంతమవుతుంది. ప్రేమకథకు ముఖ్యంగా చూడచక్కని జంట, కథను అందంగా చూపించే దర్శకుడు, ఛాయాగ్రాహకుడు, మంచి పాటలు, సాహిత్యం తోడయితే.. ఆ సినిమా కాలంతో పనిలేకుండా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంది. అలాంటి సినిమానే గీతాంజలి. ఇందులో చాలా పాటలున్నాయి. సినిమా చివర్లో వచ్చే ‘‘ఓ పాపా లాలీ’’ పాట మాత్రం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎందుకంటే మరణిస్తామనే విషయం ముందుగానే తెలిస్తే ఎలా ఉంటుంది? ఈ సినిమాలో నాయికానాయకులు క్యాన్సర్‌ వల్ల చనిపోతారని వాళ్లకి తెలిసిన సందర్భంలో వచ్చే పాట ఇది.

మామూలుగా లాలి పాట అంటే పసిపాప నిద్దురపోవటానికి తల్లి పాడుతుంది. అచ్చం అలానే ఇక్కడ ఒక ప్రేమికుడు తన ప్రేయసి కోసం ఆలపిస్తాడు. ఎలా అంటే? పంచభూతాలను బతిమలాడుతూ వాటికి మనవి చేసుకుంటాడు. తనను మెల్లగా తాకాలంటూ గాలిని కోరతాడు. మనకి కావాల్సిన వాళ్ళకి ఏదైనా జరిగిందని తెలిస్తే గుండె వేగంగా కొట్టుకుంటుంది. అలాంటిది తను ప్రేమించిన అమ్మాయి చనిపోతుందని తెలిస్తే ఇంకేలా ఉంటుంది? ఆ విషాదాన్ని దిగమింగి పాట రూపంలో చెప్తాడు. తను అందరిలాంటి పసిపాప కాదు, కలలు ఆరని పసిపాప అని చెప్పడం కథానాయకుడికి ఆమెపై ఉన్న ప్రేమను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. కథానాయిక కథానాయకుడి ఒడిలో తలపెట్టి పడుకున్నప్పుడు.. నా దేవత కన్నుల్లోంచి తడి నీడలు పడనీయకండి అని ప్రార్థిస్తాడు.


మరో చరణంలో.. మేఘమా వెళ్ళిపో ఈ పూటకు ఉరమొద్దు, కురవొద్దు. కోయిలా నా పాటను నువ్వు మళ్లీ తిరిగి పాడు. ఎందుకంటే? నా గొంతులో, గుండెలో చెప్పలేనంత విషాదం ఉంది. నువ్వు ఇదే పాటని కాస్త మధురంగా తేనె చల్లినట్టుగా పాడి నా చెలిని కాస్త నిద్దురపుచ్చు. హుషారుకు మారుపేరు అయిన పరవళ్లు తొక్కే సెలయేటి లాంటి పాటలు (ఆనందాలు) వినిపించని గదిలో (నా గుండెలో) ఇరుసంధ్యలు (ఉదయాస్తమాలు) కదలాడుతున్నాయి ఊయలలా (ఆసిలేషన్స్‌). ఎంత బాధయినా, ఎంత కష్టముయినా..ఆమె బ్రతకడం అసాధ్యమే అయినా.. ఇప్పటికీ ఒక ఆశ అయితే ఉంది గుండెలో అస్తమించని ఒక ఉదయంలా.. కానీ.. ఆ ఉదయాన్ని చేరుకునే ప్రయత్నం మాత్రం ఊయల ప్రయాణంలా ఉన్న చోటే బ్రతుక్కి (ఉదయానికి), చావుకు (అస్తమయానికి) మధ్యలో ఉంది. రేపటి ఆ (మా) ఉదయానికి దారి ఇవ్వండి. చలి ఎండకు, సిరివెన్నెలకు ఇది నా మనవి అంటూ ఒక ప్రియుడు తన ప్రేయసిని నిద్దురపుచ్చే ఈ పాట ఎప్పటికీ మధురానుభవమే.


ఇలాంటి పాటలు చాలా అరుదుగా వస్తుంటాయి. వీటిని మనసు పెట్టి వింటే చాలు వాటి గొప్పతనం అర్థమవుతుంది. వేటూరి సుందరరామూర్తి సాహిత్యం, ఇళయరాజా సంగీతంలో వచ్చిన ఈ పాట కలకాలం వర్థిల్లుతుంది. బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన తీరు అద్భుతం. నిజంగా ప్రేమిస్తే ప్రేయసి ప్రేమికుడు పడే వేదనకు ప్రతిబింబమే ఈ పాట. ప్రేమంటే ఏంటో కూడా తెలియని వయసులో ప్రేమ పాటలు పాడుకునే వాళ్లకు ఈ పాట కనివిప్పు కావాలని కోరుకుంటూ....

vరు,హైదరాబాద్‌


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.