హిందీ ‘చందా! ఓ చందా!’... తెలుగులో ‘పిల్లా! ఓ పిల్లా!’
చిత్రం: సాంధ్యశ్రీ ప్రొడక్షన్స్‌ వారి ‘మనువు మనసు’
గీతరచన: ఉషశ్రీ (పి.మర్రెడ్డి),
గానం: ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం,
సంగీతం: అశ్వద్థామ,

అభినయం
: ప్రకాష్, చంద్రకళ, చంద్రమోహన్, అనిత.

పిల్లా! ఓ పిల్లా! పిల్లా! ఓ పిల్లా!
పిలుపు వినవేలా
పిలిచి పిలిచి నేను అలసిపోవాలా ।।పిల్లా।।

పిల్లనగ్రోవి పిలుపు వినగానే,
అల్లన భామ ఉల్లము పొంగ
గోపాలుని చేరి మురిసిపోలేదా! చెలి రాధా!
నీవు రావేలా! మనసు మురిసేలా ।।పిల్లా।।

నింగిలో మబ్బు తొంగి చూడగానే,
పొంగిన నెమలి నాట్యమాడు కాదా
నేను కోరేది నిన్నే కాదా! జాలి లేదా!
నీవు రావేలా! మనసు మురిసేలా ।।పిల్లా।।

పున్నమి వెన్నెల జాలువారగానే,
కలువ కన్నె పులకరించిపోదా
వలపు నెరుగ లేవా!
మనసు నీరా చేర రావా!
నీవు రావేలా! మనసు మురిసేలా! ।।పిల్లా।।


దర్శకుడు బాలచందర్‌ ప్రతిష్టాత్మక తమిళ రంగస్థల నాటకం ‘ఎదిర్‌ నీచల్‌’ను 1968లో అదే పేరుతో చలనచిత్రంగా మలిచారు. అందులో నాగేష్, ముత్తురామన్, జానకి, జయంతి, మేజర్‌ సుందర్‌రాజన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. ఎం.ఎస్‌.విశ్వనాథన్, వి.కుమార్‌ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రాన్ని శ్రీరమణ చిత్ర సంస్థ నిర్మాత టి.మోహనరావు 1970లో తెలుగులో ‘సంబరాల రాంబాబు’ పేరుతో పునర్నిర్మించారు. ఇందులో చలం, చంద్రమోహన్, ఎస్‌.వి.రంగారావు, శారద, గీతాంజలి నటించారు. తమిళంలో సంగీతం సమకూర్చిన వి.కుమార్‌ ‘సంబరాల రాంబాబు’ సినిమా సంగీతం దర్శకత్వం నిర్వహించగా జి.వి.ఆర్‌.శేషగిరిరావు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. ఈ సినిమా రెండు భాషల్లోనూ విజయవంతమయింది. ఈ విజయంతో జెమిని సంస్థ ‘ఎదిర్‌ నీచల్‌’ చిత్రాన్ని 1971లో హిందీలో ‘లాఖోమే ఏక్‌’గా పునర్నిర్మించింది. నాగేష్‌ పాత్రను మెహమూద్‌ పోషించగా, ఎస్‌.ఎస్‌.బాలన్‌ హిందీ చిత్రానికి దర్శకత్వం నిర్వహించారు. ఆ రోజుల్లో మెహమూద్‌ ఒక సూపర్‌స్టార్‌. అతడికున్న మార్కెట్‌ డిమాండ్‌ను బట్టి హీరోగా లేకపోయినా మెహమూద్‌ నటించే చిత్రాల్లో ఒకటి రెండు పాటలు తప్పకుండా పెట్టేవారు. తమిళంలో నాగేష్‌తో సమానంగా పోటీపడగల ప్రజ్ఞ ఉన్న మెహమూద్‌ ‘లాఖోమే ఏక్‌’ కామెడీ చిత్రంలో హీరో కావడం నిర్మాతలకు లాభించింది. అందులో రాహుల్‌ దేవ్‌ బర్మన్‌ సంగీత దర్శకుడు. ఇంకేముంది? పాటలన్నీ హిట్లే. ముఖ్యంగా లతా మంగేష్కర్, కిశోర్‌ కుమార్‌ ఆలపించిన ఆనంద్‌ బక్షి గీతం ‘చందా! ఓ చందా! చందా! ఓ చందా’ కిస్‌ నే చురాయీ తేరి మేరి నిందియా.... జాగే సారి రైనా తేరే మేరె నైనా’ అనే పాట సూపర్‌హిట్‌. సినిమాలో ఈ పాటను మెహమూద్, రాధా సలూజాల మీద చిత్రీకరించారు. ఇదే పాట లతామంగేష్కర్‌ సోలో గీతంగా కూడా వస్తుంది. ఈ అద్భుతమైన పాటను సి.వి.త్రినాథరావు సాంధ్యశ్రీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ మీద నిర్మించిన ‘మనువు మనసు’ సినిమాలో వాడుకున్నారు. అశ్వథ్ధామ సంగీతం సమకూర్చిన ఈ పాటను ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం పాడగా చిత్ర కథనాయకుడు ప్రకాష్, చంద్రకళ, చంద్రమోహన్, అనిత జంటల మీద చిత్రీకరించారు. నేపథ్య సంగీతంతో బాటు ఈ హిందీ పాట బాణీని మక్కికి మక్కి కాపీ చేశారు. అయినా హిందీ పాటలో ఉన్న మాధుర్యం తెలుగు పాటకు రాలేదు. పాట వినగానే అది కాపీ పాట అనే విషయం శ్రోతలకు వెంటనే తెలిసిపోతుంది. గతంలో ఎందరో సంగీత దర్శకులు హిందీ పాటల బాణీలను అనుకరించినా ఆ పాటలకు తెలుగుదనాన్ని, స్థానికతను జతచేశారు. అందుచేత ఆ పాటలు తెలుగు సంప్రదాయ పాటల్లాగే ఉండేవి. కానీ ‘పిల్లా ఓ పిల్లా’ పాట అందుకు మినహాయింపు. ఈ చిత్ర హీరో ఉషశ్రీ ప్రొడక్షన్స్‌ నిర్మాతలు పి.చిన్నపరెడ్డి, మర్రెడ్డిల సోదరుడు. వీరి పతాకంపై తొలిసారి 1970లో ‘పసిడి మనసులు’ చిత్రాన్ని నిర్మించి విజయం సాధించారు. తరువాత వరుసగా ‘విచిత్ర దాంపత్యం’, ‘మానవుడు దానవుడు’ చిత్రాలు నిర్మించారు. ఇవి కూడా శతదినోత్సవాలు జరుపుకున్నాయి. తరువాత చిన్నపరెడ్డి దర్శకుడుగా మారి తమ్ముడు ప్రకాష్‌ను కథానాయకుడుగా చేసి ‘మనువు మనసు’, ‘పద్మవ్యూహం’ సినిమాలు నిర్మించి అపజయాలు చవిచూశాడు. హిందీలో ‘చందా! ఓ చందా!’ చాలా పెద్ద హిట్టయిన పాట. మరి ఆ పాటను ఎందుకు అనుకరించారో బోధపడదు. గతంలో అశ్వథ్ధామ ఉషశ్రీ సంస్థకు ఆస్థాన సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తూ, ఆ సంస్థ నిర్మించిన సినిమాలలో పాటలను అద్భుతంగా మలిచారు. మరి ‘పిల్లా! ఓ పిల్లా!’ పాటకు ఎందుకు గ్రహణం పట్టిందో తెలియదు. సినిమాలో ఈ పాట చిత్రీకరణ కూడా పేలవమే!


- షణ్ముఖ


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.