ఫిలాసఫీ చెప్పిన ‘మిరపకాయ్‌’ పాట
చిత్రం: మిరపకాయ్‌

సంగీతం
: తమన్‌

రచన: భాస్కరభట్ల రవికుమార్‌

గానం: తమన్‌

అభినయం: రవితేజ, దీక్షాసేథ్‌.

ఏయ్‌ సుడొద్దె... సూడొద్దె... సుడొద్దె... కోపంగ సూడొద్దె..

అరె సంపొద్దె... సంపొద్దె... సంపొద్దె.. సంపొద్దె.. నన్నిట్ట సంపొద్దే...

అరె పట్‌కోన.. పట్‌కోన... నీ కాళ్లే పట్‌కోనా...

వచ్చి పడిపోన... పడిపోన...పడిపోన.. పడిపోన... నీమీద పడిపోనా.


ఒసేయ్‌

వైశాలీ.. ఐయామ్‌ సారీ

అంటున్నా ఇంకోసారి...ఐయామ్‌ సారీ...

అరె పట్‌కోన.. పట్‌కోన... నీ కాళ్లే పట్‌కోనా...

వచ్చి పడిపోన... పడిపోన...పడిపోన.. పడిపోన... నీమీద పడిపోనా.


వైశాలీ ఐయామ్‌ వెరీ వెరీ.. సారీ..

మిస్టేకే జరిగుంటే మళ్ళోసారి..ఐయామ్‌ సారీ...

సరదాగా నవ్వేస్తే ఏం పొద్దే పిసినారీ...

నీ కోసం తగలెట్టా శాంతించే సుకుమారీ..

నీ ఫేసుకదీ సూటవ్వదూ...

అంతలేదూ అంతలేదూ అంతలేదూ..

అంతాలేదూ.. అంతాలేదూ...


నీ అంతలేసీ కళ్లలోనా ఇంతకోపం బాగోలేదూ...బాగాలేదూ...

అరె పట్‌కోన.. పట్‌కోన... నీ కాళ్లే పట్‌కోనా...

వచ్చి పడిపోన... పడిపోన...పడిపోన.. పడిపోన... నీమీద పడిపోనా.

చరణం:1
ఏయ్‌.. తగువెపుడూ..తెగేదాకా లాగావంటే లాసైపోతావే

అప్పుడప్పుడూ.. సరేనంటూ సర్దుకుపోతూ ఐసై పోవాలే

సిన్న సిన్న వాటికే శివాలెత్తేస్తే..

సుఖపడు యోగం లేనే లేనట్టే..

కోపంలో అమ్మాయే అందంగా వుంటుందని

అని ఎవడో నీ చెవిలో క్యాబేజీ పెట్టాడే

ఆ మాట పట్టుక్కూర్చోవద్దూ...

అంతలేదూ అంతలేదూ అంతలేదూ..

అంతాలేదూ... అంతాలేదూ..


నీ..ఏయ్‌... గంతులేసే వయసులోనా పంతమేంటి..

వద్దే వద్దూ.. రానివ్వద్దూ...

హే వైశు వైశు వైశు వైశు ।।2।।చరణం:2


ఏయ్‌... అరె అరెరే.. తిట్టీ తిట్టీ పెదాలెలా కందాయొ చూడె

వినువినవే... సున్నా లాగా మూతెపెట్టీ సతాయించొద్దే

వున్న దొకటే కదా ఎదవ జిందగీ...

దాని ఏడిపించకే మాటిమాటికీ...


నలుగుర్లో కలవందే బరువేగా బతుకంతా

గిరిగీసి కూచుంటే వదిలెయ్‌గా అంతలేదూ..

నువ్వ గింజుకున్న లాభం లేదు


అంతాలేదూ... అంతాలేదూ..

కళ్ళగ్గంతలేసీ లోకమంతా చీకటంతే...

ఎలాలెద్దూ... ఒసేయ్‌ మొద్దూ...

మాటలతో మ్యాజిక్‌ చేస్తుంటారు భాస్కరభట్ల రవికుమార్‌. మనం మాట్లాడుకొనే మాటలే ఆయన పాటల్లో వినిపిస్తాయి. తిట్లు, శాపనార్థాలూ, ఫితుర్లు, ఛలోక్తులు, హితోక్తులు, ఫిలా సఫీ, ప్రేమ, పైత్యం, పొగరు - ఒక్కపాటలో ఇన్ని చెప్పొచ్చా..? అనిపిస్తుంటుంది. పదాల అర్థాలు వెతుక్కొనేందుకు డిక్షనరీలు తిరగేసి శ్రమ ఉండదు. లైన్‌ లైన్‌కీ కిక్‌ అస్వాదించడమే. ఆ మ్యాజిక్‌కి పడిపోని వాడ్వెడు..? శ్రోత సెవెన్‌ సీటర్‌ ఆటోవాలా అయినా, మల్లీప్లెక్స్‌లో ఇస్త్ర్రీ మడత నలక్కుండా దర్జాగా కూర్చున్నవాడైనా ఆ పాటకు పట్టదు. ఇద్దర్నీ మడతెట్టేసే మజా మాత్రం అందులోనే ఉంటుంది. ఇలాంటి పాట ‘మిరపకాయ్‌’లోనూ ఉంది. సరదాగా సాగి పోయే టీజింగ్‌ పాటలోనే తన మార్క్‌ వినిపించారు భాస్కరభట్ల, కాస్త ఫిలాసఫీ జోడించి ‘మీరూ మారండెహె...’ అంటూ సుతిమెత్తని చురకేశారు. ఆ పాట ప్రమాణాన్ని సితారతో పంచుకొన్నారాయన.

‘‘దర్శకుడు హరీష్‌ శంకర్‌తో నాకు ముదు నుంచీ పరిచయం ఉంది. ‘జల్సా’లోని ‘గాల్లో తేలినట్టుందే’ పాటంటే ఆయనకు చాలా ఇష్టం. ఎప్పుడు కనిపించినా - ‘ఈసారి మనం కలిసి పనిచేద్దాం.’ అంటుండేవారు. ఆ అవకాశం ‘మిరపకాయ్‌’తో వచ్చింది. అందులో రెండు పాటల్ని రాశా. ‘చిలాకా.. రాయే చిలకా...’ పాటకు ఇరవై రోజులు పట్టింది. ఈ ట్రావెలింగ్‌లో హరీష్‌ శంకర్‌ అభిరుచులు తెలిశాయి. తనకి ఎలాంటి పాటలు నచ్చుతాయో అర్థమైంది. ఈ పాటని కేవలం రెండే రెండు రోజుల్లో రాసేశా. శంకర్‌కి మ్యూజిక్‌లో మంచి టేస్ట్‌ ఉంది. సాహిత్యంపై అవగాహన ఉంది. సరదా మాటలతో పాట రాస్తే... బాగుంటుంది అన్నది మా ఇద్దరి అభిప్రాయం కూడా. ‘మిరపకాయ్‌’లో టీజింగ్‌ పాట ఆ అవకాశం ఇచ్చింది.

టీజింగ్‌ పాటలు అమ్మాయిల్ని ఏడిపిస్తూనో, వాళ్లను కాకా పడుతూనో, లేదంటే కీర్తిస్తూనో సాగుతాయి. అది అమ్మాయి, అబ్బాయి మధ్య వ్యవహారం అనుకొంటే - పాట హిట్‌ అవ్వడానికి ఛాన్స్‌లు తక్కువగా ఉంటాయి. ఆ సిట్యువేషన్‌ని జనరలైజ్‌ చేయాలి. ‘ఈ పాటలో మనకూ ఏదో చెప్పబోతున్నార’న్న ఫీలింగ్‌ పాట వింటున్న శ్రోతకి రావాలి. అప్పుడే ఎలాంటి పాటైనా హిట్‌ అవుతుంది. ‘ఈ టీజింగ్‌ పాటలో అందరికీ అవసరమైన ఫిలాసఫీ చెబుదాం..’ అని శంకర్‌ సలహా ఇచ్చారు. నేను దాన్ని ఫాలో అయిపోయా.


ఈ పాటలోని ప్రతీ పదం... నాలో ఉన్న భావమే. నేను ఏదైతే ఫీలౌతునో అదే పాటగా రాసేశా. రవితేజ అంటేనే ఎనర్జీ. దానికి తోడు ఇలాంటి పాటల్లో మరింత ఎనర్జీ ఉండాలనుకొంటారు. ఆ విషయాన్ని లైను లైనుకీ గుర్తుపెట్టుకొంటూ రాసిన పాట ఇది. కథ ప్రకారం... హీరో ఓ పోలీస్‌ అధికారి. కానీ లెక్చలర్‌గా పనిచేస్తుంటాడు. కాలేజీలో అమ్మాయిని బుట్టలో వేసుకొని... తద్వారా డాన్‌ని పట్టుకోవాలని ప్లాన్‌ వేస్తాడు. కాలేజీలో జరిగిన చిన్న గోడవ వల్ల హీరోహీరోయిన్ల మధ్య గోడవ మొదలవుతుంది. హీరో సారీ చెబుతూ అమ్మాయి వెంట పడాలి. అదీ సందర్భం. కథానాయకుడిది అందితే జుత్తు లేదంటే కాళ్లు అనుకొనే మనస్తత్వం.. హీరోయిన్‌కి బలువు. మూతి ముడుచుకొని కూర్చుని ఉంటుంది. పాత్రల తాలుకూ లక్షణాలు ఫాలో అవుతూ పాట మొదలెట్టా.

‘సరదాగా నవ్వేస్తే ఏంపోద్దే పిసినారీ... నీ కోసం తగలెట్ట శాంతించే సుకుమారీ.

అంటూ రోటీన్‌ క్వాయినింగ్‌తో పాట మొదలెట్టినా - నవ్వు తాలుకూ ప్రభావం చెప్పే ప్రయత్నం చేశా. ఈ సృష్టిలో నవ్వితే బాగోని జీవంటూ లేదు. అలానే కోప్పడితే అందంగా ఉన్న మోమూ లేదు. ఇది నా పర్సనల్‌ ఫీలింగ్‌. అందుకే నవ్వుతూ ఉండాలి. ‘ముక్కుమీద కోపం నీ మొఖానికే అందం...’ అంటూ పాడు కొంటుంటాం కోపంలో అమ్మాయిలు మరింత అందంగా ఉండారన్నది ఓ జనరల్‌ స్టేట్‌మెంట్‌. దాన్ని పక్కన పెట్టి ‘కోపంలో అమ్మాయే అందంగా ఉంటుందే.. అని ఎవడో మీ చెవిలో క్యాబేజీ పెట్టాడే. ఆ మాటపట్టుకు కూర్చోవద్దు..’’ అని రాశా.


పాటలో అన్నీ చిన్న చిన్న పదాలే. జన బహుళ్యంలో ఉన్న మాటల్నే పాటగా రాస్తే మరింత క్యాచీగా ఉంటుంది. దానికి మైలేజీ ఎక్కువగా వస్తుంది. పైగా సరదాగా సాగిపోయే పాట ఇది. ఈ విషయాన్నీ చాలా సీరియస్‌గా చెప్పొచ్చు. కానీ రవితేజ బాడీ లాంగ్వేజ్‌కీ, ఈ సినిమాలో అతని పాత్ర తీరుకీ అది నప్పదు. సీరియస్‌గా రాస్తే... అసలు ఈ పాట ఇంత పాపులర్‌ య్యేది కాదేమో...? శివాలెత్తేయడం, సతాయించడం ఇవన్నీ ఉత్తరాంధ్రలో ఎక్కువగా వాడే పదాలు. ఎదవ జిందగీ అని కూడా రాశా. నైజాంలో ఎక్కువగా ఈ పదం వినిపిస్తుంటుంది.

ఊరందరిదీ ఒకదారి, తనదో దారి అనుకొనే రకం.. ఆ అమ్మాయి. అలాంటి వాళ్లను సమాజం కూడా జనాభా లెక్కల్లోంచి తీసేస్తుంది. ఉన్నదొక్కటే ఎదవ జిందగీ - దాన్ని సతాయిస్తూ కూర్చోవద్దు. హాయిగా బతికేద్దాం... అంటూ ఫిలాసఫీ జోడించాం. ‘నలుగురిలో కలవందే బరువేగా బతుకంతా... గిరిగీసి కూర్చుంటే వదిలేరా జనమంతా... నువు గింజుకున్నా లాభం లేదు.. అంటూ హితబోధ చేశాం.

సాధారణంగా ఇన్ని విషయాలు ఒక పాటలో జోడించడం కుదరదు. ఎప్పుడోగానీ ఇలాంటి అవకాశం దక్కదు. దర్శకుడు స్వరకర్త. వీళ్ల అభిరుచులకు దగ్గరగా వెళ్తే తప్ప.. అది సాధ్యం కాదు. ‘మనకెందుకండీ... ఫిలాసఫీ’ అంటూ ఏ ఒక్కరు అన్నా ఈ పాట బయటకు వచ్చేది కాదు. ‘నాకు ఇలాంటి పాటే కావాలి’ అని హరాష్‌ - ‘మరేం ఫర్లేదు మీరు కావల్సినంత స్పేస్‌ తీసుకోండి. ట్యూన్‌ని పట్టించుకోవద్దు’ అని తమన్‌ చెప్పినందువల్లే ఈ పాట రాశా. పూరి జగన్నాథ్‌కి ఈ పాటంటే చాలా ఇష్టం. అందుకే ‘మిరపకాయ్‌’ ఆడియో సీడీపైన ఈ పాట దగ్గర ‘పూరికి ఇష్టమైన ట్రాక్‌’ అని ప్రింట్‌ చేశారు. ‘సున్నాలాగ మూతేపెట్టి సతాయించొద్దే..’ అన్న లైన్‌ హరీష్‌కి ఫేవరెట్‌. ఎన్టీఆర్‌కి చాలా బాగా నచ్చిన పాట ఇది. తనకీ పాట కంఠతా వచ్చు ‘రామయ్యా వస్తావయ్యా’ మ్యూజిక్‌ సిట్టింగ్‌లో ఈ పాటని ఎన్టీఆర్‌ గుర్తుచేశాడు. ‘ఇలాంటి పాట కావాలి..’ అన్నాడు.

‘ఇప్పటికింకా నా వయసు’ పాట తరువాత ఐటెమ్‌ గీతాలు చాలా రాశా. ‘ఐటెమ్‌ పాట’ అంటేనే విసుగొచ్చేసే స్థాయిలో పాటలు రాయాల్సివచ్చింది. ‘మిరపకాయ్‌’ తరవాత టీజింగ్‌ పాటలన్నీ నా దగ్గరకే వస్తున్నాయి. అయినా.. ఒక్కసారి కూడా విసుగురాలేదు. ప్రతీసారీ కొత్తగా చుప్పే ప్రయత్నం చేయడంతో అస్వాదిస్తున్నా. ‘బలుపు’లో ఇలాంటి టీజింగ్‌ గీతమే ఉంది. ఇప్పుడు ‘పవర్‌’లోనూ ఈ తరహా పాట రాశా. ఇలాంటి పాటలన్నీ అందరికీ నచ్చుతాయని నా నమ్మకం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.