నువ్వే వదిలేటి శ్వాసకే గాలులు బ్రతికాయి చూడవే

మనసుకు నచ్చిన అమ్మాయి అడగాలి కానీ... ఏం చేయడానికైనా సిద్ధపడతారు అబ్బాయిలు. నీకోసం సప్త సముద్రాలైనా దాటి అడిగింది తీసుకొస్తా అని చెప్పే ప్రేమికులు చాలామందే. ఇక్కడ కూడా ఒక అమ్మాయి ఏం ఇస్తావని అడిగింది. కానీ ఆమె అందం ముందు.. తన స్వచ్ఛమైన మనసు ముందు అన్నీ చిన్నవిగానే కనిపించాయి. ఆ సందర్భంలో ఆ ప్రేమికుడిలో కలిగిన భావాలకి అంతే స్వచ్ఛంగా అక్షరరూపం ఇచ్చారు గీత రచయిత చంద్రబోస్‌. ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ చిత్రం కోసం ఆయన రాసిన ‘నీలి నీలి ఆకాశం...’ పాట శ్రోతల మనసుల్ని దోచింది. కుర్రకారుని మరింతగా ఆకట్టుకుంది. సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఆ పాటదే సందడి. ప్రదీప్‌ మాచిరాజు, అమృత అయ్యర్‌ జంటగా నటించిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘నీలి నీలి ఆకాశం...’ పాట ప్రయాణం గురించి ‘ఈనాడు సినిమా’తో చంద్రబోస్‌ చెప్పిన విషయాలివీ...

‘‘అగ్ర తారల సినిమాల్లోని పాటలపై అందరి దృష్టి ఉంటుంది. అవి వేగంగా శ్రోతలకి చేరువవుతాయి కాబట్టి విజయవంతం కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ కొత్తతరం సినిమాల్లో పాటలకి అన్ని వెసులుబాట్లు ఉండవు. అయినా సరే.. ఒక మంచి బాణీకి మంచి సాహిత్యం, గాత్రం తోడైతే ఆ పాట ఎంత దూరమైనా వెళుతుందని ఈ పాట రుజువు చేసింది. ఆ విషయంలో మరింత సంతోషంగా ఉంది. రచయితలో గాంభీర్యంతోపాటు కుర్రతనం, చలాకీతనం, ప్రేమని ఆస్వాదించే గుణం కూడా ఉండాలి. ఆ గుణమే నాతో ఇలాంటి పాటలు రాయిస్తోంది. ముందు ఈసినిమాలో ఒక పాట రాయండని చెప్పాడు దర్శకుడు మున్నా. కానీ మా ఇద్దరి ఆలోచనలు కలవడంతో నాలుగు పాటలు రాశా. ప్రేమ గొప్పతనాన్ని, ప్రేమ లోతుని, నిజాయతీని చెప్పే కథ ఇది. నా సాహిత్యానికి మున్నా పెద్ద అభిమాని. రెండు దశల్లో సాగే ఈ సినిమాలో మొదటి దశలో ఓ సందర్భం గురించి చెప్పి ఈ పాట రాయమన్నారు దర్శకుడు. నిజానికి ఈ పాటని నేను రాయలేదు, చెబుతూ వెళ్లానంతే. ‘ఉప్పెన’లోని ‘ధక్‌ ధక్‌ ధక్‌’ గీతానికి కూడా అలాగే చేశా. మొదట ‘నీలి నీలి ఆకాశం నీకే ఇస్తాలే...’ అని పాట ఆరంభిద్దామన్నారు సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌. నేను దాన్ని మార్చా. ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా...మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా’ అని చెప్పా. ఆ ప్రయత్నం అందిరికీ నచ్చడంతో ఈ పాట దశలు దశలుగా కొత్తగా ముస్తాబైంది. ‘ఆ తళుకు తళుకుమని తారలు మెరిసే... నీలాకాశము నాదేలే, ఎల్లరి వనముల కలవరపరిచే జిలిబిలి జాబిలి నాదేలే.., కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే’ అంటూ ‘మిస్సమ్మ’లో పింగళిగారు పాట రాశారు. ఇన్ని తరాలు మారాక ఆ ఆలోచన ఇంకో రకంగా మారాల్సిందే కదా. అందుకే ఇద్దామనుకున్నా కానీ ఇవ్వలేకపోతున్నా అంటూ నేను రాశా. అందుకే ‘నీలి నీలి ఆకాశం..’ ఇప్పుడొక నవీన గీతమైంది. పది గంటల ప్రయాణం ఈ పాట. ఇందులో ప్రేమలోని నిజాయతీ కనిపిస్తుంది. కవిత్వం ధ్వనిస్తుంది. దాంతో పాటకి కొత్త అందం చేకూరింది. నా దృష్టిలో పాట ఎత్తుగడ నుంచి చివరి వరకు ప్రతివాక్యం అర్థవంతంగా పల్లవికి కట్టుబడి ఉండాలి. పల్లవిలోని మొదటి వాక్యం నీటి బిందువైతే, ఆ నీటి బిందువులోనే సముద్రంలోని రహస్యాలన్నీ నిక్షిప్తమై ఉన్నట్టుగా పాట వైశాల్యం, విస్తీర్ణం కుదించుకుపోయి కనిపించాలి. పల్లవేదో రాసి, చరణం ఇంకేదో రాసి రెంటికీ సంబంధం లేకుండా ఇంకేదో కలిపితే అది పాట అవ్వదు నాదృష్టిలో. ఆ భావం పాటంతా విస్తరించాలి. ‘నువ్వే నడిచేటి తీరుకే...తారలు మొలిచాయి నేలకే నువ్వే వదిలేటి శ్వాసకే గాలులు బ్రతికాయి చూడవే... వాన విల్లులో ఉండని రంగు నువ్వులే ఏ రంగుల చీరను నీకు నెయ్యాలే...’ ఇలా పాటలో శుద్ధమైన కవిత్వం వినిపిస్తుంది. పెద్ద, చిన్న అనే తేడా లేకుండా అన్నిచిత్రాలకీ ఒకేలా పాట రాస్తుంటారని ఒక మిత్రుడు పంపిన సందేశం తృప్తినిచ్చింది. సినిమా ఏదైనా మనదైన సంతకం కనిపించాలి. అలాగని పాటల్లో నా పాండిత్యం ప్రదర్శించకూడదు. ప్రతి పాటతోనూ... తనని తాను విభిన్న రూపాలలో ఆవిష్కరించుకోవడం సినిమా కవికి దక్కిన అదృష్టం’’.


చిత్రం
: 30 రోజుల్లో ప్రేమించటం ఎలా?
రచన: చంద్రబోస్‌

గానం: సిద్‌ శ్రీరామ్‌ - సునీత

సంగీతం: అనూప్‌ రూబెన్స్‌

పల్లవి:

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా...

మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా

నెలవంకను ఇద్దామనుకున్నా

నీ నవ్వుకు సరిపోదంటున్నా...

నువ్వే నడిచేటి తీరుకే...

తారలు మొలిచాయి నేలకే

నువ్వే వదిలేటి శ్వాసకే

గాలులు బ్రతికాయి చూడవే....

ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వనే...

।। నీలి నీలి ఆకాశం ।।

చరణం: 1

వాన విల్లులో ఉండని రంగు నువ్వులే

ఏ రంగుల చీరను నీకు నెయ్యాలే...

నల్లమబ్బులా మెరిసే కళ్లు నీవిలే

ఆ కళ్లకు కాటుక ఎందుకెట్టాలే

చెక్కిలిపై చుక్కగా దిష్టే పెడతారులే

నీకైతే తనువంతా ఆ చుక్కను పెట్టాలే

ఏదో ఇవ్వాలి కానుక

ఎంతో వెతికాను ఆశగా

ఏదీ నీ సాటి రాదిక

అంటూ ఓడాను పూర్తిగా

కనుకే ప్రాణమంతా తాళి చేసి నీకు కట్టనా

పల్లవి 2:

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా

నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా

చరణం: 2

అమ్మ చూపులో ఒలికే జాలి నువ్వులే

ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలే

నాన్న వేలితో నడిపే ధైర్యమే నీదే

నే పాపనై పసిపాపనై ఏమి ఇవ్వాలే

దయగలిగిన దేవుడే - మనలను కలిపాడులే

వరమొసగే దేవుడికే నేనేం తిరిగివ్వాలే...

ఏదో ఇవ్వాలి కానుక - ఎంతో వెతికాను ఆశగా

ఏదీ నీ సాటి రాదిక అంటూ అలిసాను పూర్తిగా

కనుకే మళ్లి మళ్లి జన్మనెత్తి నిన్ను చేరనా...

।। నీలి నీలి ఆకాశం... ।।Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.