సలీల్ దా సితార వినిపించిన వసంత శోభ
                                                                                 లతా మంగేష్కర్‌ - సలీల్ చౌదరి
                                      

సలీల్ దా సితార వినిపించిన వసంత శోభ పాట: 

‘‘ఓ సజనా బరఖా బహార్ ఆయీ రస్ కి పుహార్ లాయి ఆంఖియో మే ప్యార్ లాయీ ఓ సజనా’’

చిత్రం: పరాఖ్ (1960)

దర్శక నిర్మాత బిమల్ రాయ్
గానం: లతా మంగేష్కర్
గేయరచన: శైలేంద్ర
సంగీతం: సలీల్ చౌదరి
అభినయం: సాధనా, వసంత్ చౌదరి

ఇది ఒక తొలకరి చినుకుల పాట. నమ్రమైన, దివ్యమైన, అందమైన సాధనా ఈ తొలకరి చినుకులను ఆస్వాదిస్తూ, తన ప్రియుణ్ణి తలచుకుంటూ పాడిన పాటగా బిమల్ రాయ్ ఈ పాటను అద్భుతంగా చిత్రీకరించారు. ఈ పాటను మొదట బెంగాలీ భాషలో స్వయంగా రచించి, ఒక లలిత గీతంగా సలీల్ చౌదరి స్వరపరచి, లతా మంగేష్కర్ చేత పాడించి రికార్డు చేశారు. ఒకసారి సలీల్ చౌదరి తన అంబాసడర్ కారులో ప్రయాణం చేస్తుండగా, అనుకోకుండా కుండపోతగా వర్షం మొదలైంది. డ్రైవర్ వైపర్లు వేసి దారిని చూసుకుంటూ కారు నడుపుతున్నప్పుడు ఆ వైపర్ల రిధం సలీల్ దా కు ఈ బెంగాలీ పాట స్వరపరచేందుకు ప్రేరణ కల్పించింది. ఆ పాట ‘నా జియో నా, రజనీ ఎఖోనో బాకి, ఆరో కిచ్చు దీతే బాకీ బోలె రాత్ జాగ్గా పాఖి, నా జియో నా’ అంటూ సాగుతుంది. తరవాత ‘పరాఖ్’ చిత్రంలో ఈ పాట ట్యూనునే సలీల్ చౌదరి ఇమిడ్చారు. ‘ఓ నా ప్రియతమా... వసంత ఋతువు అడుగుపెడుతూ వానల్ని తీసుకొచ్చింది. ఆ వానచినుకులు తేనెతుంపరలను తలపిస్తున్నాయి. అవి నా కనులకు ప్రేమను గుర్తుచేస్తున్నాయి. సన్నగా మంజుల శబ్దంతో వానచినుకులు పడుతూ వుంటే, గోగుపూల ఆకులు లయబద్ధంగా కదులుతూ వుంటే, చూరు నుంచి జాలువారుతున్న ఆ వానచినుకులను తన ముకుళిత హస్తాలతో ఒడిసిపట్టుతూ పాడుతుంటే, లతాజీ గళం నుంచి మృధువుగా వెలువడే ఈ పాట కళ్లుమూసుకొని వింటుంటే, మనసు ఊహాలోకంలో తేలిపోవడం తధ్యం. జలతరంగ్, వేణువు, వయొలిన్, తబలా వంటి అతి తక్కువ వాద్య పరికరాలను మాత్రమే ఉపయోగిస్తూ సలీల్ దా స్వరపరచిన పాట ఇది. ముఖ్యంగా సితార్ వాద్యపరికరాన్ని సలీల్ చౌదరి స్వయంగా సుతారంగా పలికించిన తీరు ఓ అద్భుతం. అందులో శైలేంద్ర ఈ గీతాన్ని రచించిన తీరు మరో అద్భుతం. ఆ వసంత శోభను శైలేంద్ర ఎంత చక్కగా రచించారో చూడండి.
‘తుమ్ కో పుకారా మేరే మన్ కా పపీహరా, మీఠి మీఠి అగ్ని మే జలే మోరా జియరా’.... అంటే, నా హృదయంలో నీ తీయని తలపుల కోయిల గానం వినిపిస్తూ వున్నది.

‘ఐసీ రింజిమ్ మే ఓ సజన్, ప్యాసే ప్యాసే మేరే నయన్ తేరీ హి ఖ్వాబ్ మే ఖో గయే’... అంటే, ఈ చల్లని వాన తుంపరలో నా కళ్ళు నీకోసం వెదకుతున్నాయి. నీ తలపుల కలలో అవి చెమర్చుతున్నాయి.

‘సాన్ వాలి సలోని ఘటా జబ్ జబ్ ఛాయీ, ఆంఖియో మే రైనా గయీ నిందియా న ఆయీ’ ...అంటే, నీలి మేఘాలు కమ్ముతుంటే నీ తలపులతో నాకు నిద్ర రావడంలేదు. వసంత ఋతువు వచ్చింది. వానాకాలాన్ని తెచ్చింది.

శైలేంద్ర లిఖించిన ఇంతమంచి ప్రకృతి వర్ణనతో కూడిన ప్రేమ గీతానికి సలీల్ చౌదరి కమాజ్ రాగంలో అల్లిన స్వరసంపద వర్ణనాతీతం. సాయం సంధ్యలో వినిపించే కమాజ్ రాగాన్ని ఒక రొమాంటిక్ షేడ్ లో సలీల్ దా స్వరపరచడమే గొప్ప విశేషం. సలీల్ చౌదరి కేవలం సంగీత దర్శకుడు మాత్రమే కాదు... ఆయన ఒక గొప్ప గేయ రచయిత, కథా రచయిత కూడా. ఆయనకు కలకత్తాలో సొంత రికార్డింగ్ స్టూడియో వుండేది. సాంప్రదాయ వాద్యాలనే కాకుండా నలభైకి పైగా వాద్యాలను పలికించగల సింథసైజర్ వంటి ఎలక్ట్రానిక్ వాద్యాలను కూడా వుపయోగించడంలో సలీల్ దా ధిట్ట. దాదాపు పన్నెండు ట్రాకులు ద్వారా పాటల్ని రికార్డు చేయగలిగిన సత్తా సలీల్ చౌదరికి వుంది. 1953లో సలీల్ దా బొంబాయికి వెళ్లారు. బిమల్ రాయ్ నిర్మించిన ‘దో భిగా జమీన్’ చిత్రానికి కథ, మాటలు సమకూర్చింది ఆయనే.

ఈ హిందీ పాట వెనక వున్న ఒక సంఘటనను మీకు గుర్తు చేయాలి. 1958లో జరిగిన సంఘటన ఇది. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో ఒక ప్రసిద్ధిచెందిన భారతీయ సంగీత వాద్యాల దుకాణం వుండేది. ఈ దుకాణంలో భారతీయ సంప్రదాయ వాద్యపరికరాలన్నీ దొరికేవి. ఆ దుకాణ యజమాని పేరు డేవిడ్ బర్నార్డ్. ఒకసారి ఆ దుకాణంలోకి ఒక భారతీయ యువకుడు కాలుపెట్టాడు. అక్కడి సేల్స్ గాళ్ క్రిష్టినా అతనికి యేమి కావాలని మర్యాదగా అడిగింది. ‘’నేను ఒక సితార వాద్యపరికరాన్ని కొనాలనుకుంటున్నాను. దయచేసి చూపగలరా?’’ అంటూ ఆ యువకుడు అడిగాడు. ఆమె షాపులో వున్న సితార్ వాద్య పరికరాలన్నిటినీ చూపించింది. అయితే ఆ యువకుడికి షోకేసు లో వున్న పరికరం నచ్చింది. దానిని కొనేందుకు ఆ యువకుడు సిద్ధపడ్డాడు. అయితే ఆ దుకాణ యజమాని డేవిడ్ ఒకసారి సితార ఎలా పలుకుతుందో పరీక్ష చేసుకోమన్నాడు. అంతే...ఆ యువకుడు సితారను మీటనారంభించాడు. ఆ దుకాణానికి వచ్చిన కస్టమర్లందరూ ఆ యువకుని చుట్టూ చేరి ఆ సితార వాదనను ఆసక్తిగా ఆలకిస్తూ వుండడం డేవిడ్ కు ఆశ్చర్యమనిపించింది. అతడు ‘’నాకు పండిత్ రవిశంకర్ సితారను అద్భుతంగా వాయించడం తెలుసు. మీరు ఆ పండితునికి సరితూగేలా ఈ సితారను మీటుతున్నారు. మీరెవరో నాకు తెలియదు. ఈ సితారను నేను మీకు ఉచితంగా బహూకరిస్తున్నాను. నేడు నా దుకాణం ఎంతో అదృష్టం చేసుకుంది’’ అంటూ క్రిస్టినాతో ఆ సితారను ప్యాక్ చేయమన్నాడు. ఆ వాద్యనాదం విన్న క్రిస్టినా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఆ యువకుడి వద్దకు వచ్చి ‘’సార్ మీరెవరో నాకు తెలియదు. మిమ్మల్ని మరలా ఇక్కడ చూస్తానో లేదో కూడా తెలియదు. మీ గుర్తుగా ఈ డాలర్ నోటుమీద మీ సంతకం చేసి తేదీ రాయండి’’ అని అర్ధించింది. ఆ యువకుడు నవ్వుతూ ఆ డాలర్ నోటుమీద ‘సలీల్ చౌదరి’ అని సంతకం చేస్తూ, కలకత్తా అని రాసి తారీఖు వేశాడు. ఇండియాకు చేరుకోగానే బిమల్ రాయ్ నిర్మించిన ‘పరాఖ్’ చిత్రంలో ‘ఓ సజనా’ పాటను స్వరపరుస్తూ ఆ సితార్ ను స్వయంగా మీటుతూ లతాజీతో పాడించి రికార్డు చేశారు. ఇదీ ‘ ఓ సజనా’ పాట పుట్టుకకు నేపథ్యం.

- ఆచారం 


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.