పన్నీటి జయగీతాలు... కన్నీటి జలపాతాలు
సిరివెన్నెల ఓ సాహితీ సముద్రం.

ఇప్పటి వరకూ ఇచ్చిన పాటలు అందులో దొరికిన గవ్వలూ, ఆణిముత్యాలు, కొన్ని అలలు.. ఇంకొన్ని కెరటాలు. ‘జగమంత కుటుంబం నాది’ మాత్రం ఓ సునామీ!


సిరివెన్నెల... ఓసినీ వెన్నెల


ఆ వెన్నెల వాకిట్లో ఆడుకొన్న అందమైన ‘భావ’ కన్య... ‘జగమంత కుటుంబం నాది’!

సిరివెన్నెల.. ఓ అగ్నిగోళం... అందులో భగభగమండే భావం... ‘జగమంత కుటుంబం నాది’!


కథ కోసమో, కథానాయకుడి కోసమో, సన్నివేశానికీ సన్నివేశానికి మధ్య ఖాళీ పూరించడం కోసమో పాటలు పుడతాయి. కానీ ఈ పాట కోసమే కథ పుట్టింది. ఈ పాట కోసమే ‘చక్రం’ అనే సినిమా పుట్టింది. కొన్ని పాటలకు మాత్రమే దొరికే అదృష్టం ఇది. ఈ పాటకు అంతటి సముచిత స్థానం దక్కింది. ఇంతకీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుంచి ఈ పాట ఎప్పుడు, ఎలా, ఎందుకు ఉద్భవించింది? ఈ పాటలోని పదాల వెనుక ఉన్న నిగూడార్ధం ఏమిటి? తెలుసుకొనేందుకు సితార చిన్న ప్రయత్నం ఇదీ.

‘చక్రం పాటల సీడీ ముందర పెట్టుకొంటే.. ‘జగమంత కుటుంబం నాది - ఏకాకి జీవితం నాది’ పాట దగ్గర మనసు ఆగిపోతుంది. ఓసారి వింటాం. మళ్లీ మళ్లీ వింటాం. అర్థమవుతున్నట్టే ఉంటుంది. కానీ కాదు. ప్రతి పదంలో ఓ అగ్నిపర్వతం బద్దలవుతున్న భావన. లావా ఎగజిమ్ముతున్న స్పందన. కానీ ఏమిటది? ఆ పదం అక్కడ ఎందుకు వాడాల్సివచ్చింది. పాట ఆశాంతం విన్న తరువాత ఈ పాట సామాన్య జనాలకు అర్థం కాదు... అంటారాయన. నిజమే.. ‘శంకరాభరణం సినిమాలో పాటలు అర్థమయ్యే విన్నామా?’ అంతెందుకు... సిరివెన్నెలలో ఆయన రాసిన తొలిపాట.. ‘విరించినై.. విరచించితిని’ నిజంగానే మనకు అర్థమైందా? ఆ పాట పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంటే - మనం కూడా దానితో పాటే పరుగెడుతుంటాం. ఆ పాట గొప్పదనం ఇది. ‘జగమంత కుటుంబం’ కూడా అందుకు ఏ మాత్రం తీసిపోదు.

ఈ పాట 1977లోనే పుట్టింది. అప్పటికి సీతారామశాస్త్రి... సిరివెన్నెల సీతారామాశాస్త్రిగా మారలేదు. అంటే.. గీత రచయిత కాలేదన్నమాట. అయితే తన మనసులోని భావాల పరంపరకు అక్షర రూపం ఇచ్చే పనిలో ఎప్పుడూ తలమునకలై ఉండేవారు. రవిగాంచని చోట కవిగాంచును. అన్నారు కదా? అందుకే రవికీ, కవికీ ముడి వేస్తూ కొన్ని పాటలు రాసుకొన్నారు. అందులో ఓపాట ‘జగమంత కుటుంబం నాది - ఏకాకి జీవితం నాది’.

ఈ పాటలోని ప్రతివాక్యం నిశితంగా గమనిస్తే సూర్యుడికీ, కవికీ ఉమ్మడిగా వర్తించే విషయాలు ఈ పాటల కన్పిస్తాయి. ఇద్దరూ సమూహంలో ఉంటూనే ఒంటరితనం అనుభవిస్తుంటారు. సూర్యుడు ఈ భూగోళాన్ని చూస్తూనే ఉంటాడు కానీ... ఒంటరిగా దూరంగా. కవి కూడా అంతే సమాజంలోనే ఉంటాడు కానీ - ఒంటరిగా, ఏకాంతంగా. అలా ఉన్నప్పుడే భావాలు వరుసకడతాయి. అందుకే...

‘జగమంత కుటుంబం నాది - ఏకాకి జీవితం నాది’ అని రాయగలిగారు
‘సన్యాసం శూన్యం’ అనే మాటకు వాడుకలో ఉన్న అర్థాలు వేరు. సీతారామశాస్త్రి ఆలోచించిన విధానం వేరు. ‘‘సన్యాసం అంటే పోగొట్టుకోవడం కాదు. విడిచిపెట్టడం, త్యజించడం, త్యాగం చేయడం. శూన్యం అంటే ఏమిలేనట్టు కాదు. అనంతం, సంపూర్ణమై, విశాలమైన అనే అర్థాలు ఉన్నాయి’’ అంటారు సీతారామశాస్త్రి.

అంతా నాదే అనుకోవడం వేరు.. నేనే అనుకోవడం వేరు. ఒక్క సూర్యుడు మాత్రమే అలా అనుకొంటాడన్నది కవి భావన. నాలో నేనే రమిస్తూ అనే పదానికీ సీతారామాశాస్త్రీ విస్తృతమైన అర్ధాన్నిచ్చారు. ‘‘రమించడం అంటే శృంగారం కాదు, ఆనందించడం, ఆనందింపజేయడం. సూర్యుడి జ్వలనలో ఓ ఆనందం ఉంది. తాను మండుతున్నా, ఇతరులకు వెలుగు పంచుతున్నానన్న తృప్తిదాగుంది’’ అని విశ్లేషించారాయన.

‘‘మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల’’ ఈ ప్రయాణంలో వసంతం ఎదురవుతుంది. శిశిరం పలకరిస్తుంది. ఇవన్నీ నేను అనుభవిస్తున్నా.. ఇవన్ని నేను గమనిస్తున్నా.. అని సూర్యుడి దృష్టి కోణంలోంచి చెప్పుకొచ్చారు రచయిత. కవీ అంతేకదా..?ప్రతీ అనుభవం తనకి కావాలి. ప్రతీ రుతువూ పరిపూర్ణంగా ఆస్వాదించాలి. అప్పుడే కావ్య కన్యల్ని సృష్టించగలడు.

‘‘మంటల మాటున వెన్నెల నేనై.. వెన్నె కూతల మంటను నేనై’’
ఈ ప్రపంచానికి వెలుగునిచ్చేది సూర్యుడు. ఎప్పుడూ భగభగమండుతుంటాడు. ఆ మంటల మాటున భావమెంత ప్రాధాన్యతను సంతరించుకొందో, అభివ్యక్తీ అంతే ముఖ్య పాత్ర పోషించింది. సిరివెన్నెల ఎంచుకొన్న నేపథ్యం ‘వసుదైక కుంటుంబం’ అన్న భావన. ఈ ప్రపంచంలో ఒంటరిగా పుట్టి, ఒంటరిగా ప్రయాణం సాగించే మనిషి. ఈ ప్రపంచం అంతా ఒకే కుటుంబం. అందులో నేనూ ఒకడిని అనుకొనేంతలా పరిణతి సాధించడం, ఆ దిశగా ఆలోచించడం సామాన్యమైన విషయం కాదు. అందుకు ఏం చేయాలి? మన మూలాల్ని ఎలా గుర్తించాలి? మన ప్రయాణం ఎటువైపుకు సాగాలి? అనే విషయాలను స్పృశిస్తూ సాగిన గీతమిది.
‘‘సినిమా పాటకు కావల్సిన లక్షణాలేం లేని పాట ఇది. చాలా లోతైన, విస్తృతమైన భావాలున్నాయి. సినిమా మాధ్యమం ద్వారా వాటిని చూపించడం కష్టమన్నది నాభావన. అందుకే సినిమాల్లో వాడుకోవడానికి ఇష్టపడలేదు. కానీ కృష్ణవంశీ పట్టుపట్టాడు. అసలు ఈ పాటని ఎలా చూపిస్తావ్‌..? అని అడిగాను. ఈ పాట కోసమే కథ రాసుకొన్నాడు. తెరపై తీర్చిద్దిన విధానం చూసి చాలా ఆశ్చర్యమేసింది. దీన్నో పాటగా ఒప్పించడం కష్టం. కానీ.. దాన్ని కృష్ణవంశీ సాధించాడు’’ అని సిరివెన్నెల అంటుంటారు. ‘‘అందంగా చెప్పు.. మంచి విషయం చెప్పు’’ అన్నది సినిమాలకు సంబంధించినంత వరకూ సీతారామశాస్త్రి సూత్రం. ‘‘కషాయంలాంటి గుళికను... తేనె పూసి ఇవ్వాలి. సినిమా కూడా అదే చేయాలి’’ అంటుంటారాయన. ఈ పాటలో అది నెరవేరింది. తాత్వికత, మానవధర్మం, వసుదైక కుటుంబం, వైరాగ్యం.. ఇలా ఎన్నో కోణాలు, లక్షణాలు పెనవేసుకొని - పాటల తోటలో సుమగంధాలు విరబూసిన పుష్పగుచ్ఛం.. ఈ గీతం. అందుకే ఇప్పటికీ ఆ పరిమళాలు మనసును తాకుతున్నాయి.


చిత్రం: చక్రం

సాహిత్యం: సిరివెన్నెల

సంగీతం
: చక్రి

గానం: శ్రీ

‘జగమంత కుటుంబం నాది - ఏకాకి జీవితం నాది ।।2।।

సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నావే ।।జగమంత।।

కవినై కవితనై భార్యనై భర్తనై ।।2।।

మల్లెల దారిలో మంచు ఎడారిలో ।।2।।

పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల

నాతో నేను అనుగమిస్తు నాతో నేను రమిస్తూ

ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం

కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని

రంగుల్ని రంగవల్లుల్ని

కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని ।।జగమంత।।

మింటిని కంటిని నేనై

కంటను మంటను నేనై ।।2।।

మంటల మాటున వెన్నెలనేనై

వెన్నెల పూతల మంటను నేనై

రవినై శశినై దివమై నిశినై

నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ

ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం

కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరినాల చరణాల్ని చరణాల

చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని ।।జగమంత।।

గాలి పల్లకిలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె

గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె

నా హృదయమే నా లోగిలి

నా హృదయమే నా పాటకు తల్లి

నా హృదయమే నాకు ఆలి

నా హృదయములో ఇది సినీవాలి ।।జగమంత।।


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.