ఒరిజినల్‌ ‘మసక్కలి’ పాటను గుర్తుచేసిన రెహమాన్‌

‘మసక్కలి మసక్కలి’.. ‘దిల్లీ 6’లోని ఈ పాట సంగీత ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. 2009లో విడుదలైన ఈ గీతం ఇప్పటికీ ప్రత్యేకమే. ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీత సారథ్యంలో మోహిత్‌ చౌహాన్‌ ఆలపించారు. పర్సూని జోషి సాహిత్యం అందించారు. ఇటీవలే సిద్ధార్థ మల్హోత్రా, తారా సుతారియా జంటగా ఈ గీతాన్ని ‘మసక్కలి 2.ఓ’ పేరిట రీమిక్స్‌ చేసి తెరకెక్కించారు. తనీష్క్‌ బాగ్చి రీ క్రియేట్‌ చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా దీనిపై స్పందించారు రెహమాన్‌. క్లాసిక్స్‌ని రీమిక్స్‌ చేయడంపై ట్వీట్‌ చేశారు. ‘‘ఓ పాట రూపొందించాలంటే నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తుంది. పలు వెర్షన్లు మార్చాల్సి ఉంటుంది. మసక్కలి పాట కోసం 200 సంగీత కారులు పనిచేశారు. ఒరిజినల్‌ మసక్కలి పాటను విని ఆనందించండి’’ అని పేర్కొన్నారు. దీంతోపాటు ఈ పాట లింక్‌ను అభిమానులతో పంచుకున్నారు. అభిషేక్‌ బచ్చన్, సోనమ్‌ కపూర్‌ జంటగా రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ మెహ్రా తెరకెక్కించిన చిత్రమే ‘డిల్లీ 6’.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.