
సినిమాలు తీయాలనేది చాలామంది యువకుల కల. ఆ కల నిజరూపం దాల్చాలంటే ఎంతో శ్రమించాలి. ఎన్నింటినో త్యాగం చేయాలి. ఎన్నో సమస్యలు ఉంటాయని తెలిసినా వాళ్లకు కావాల్సింది సినిమా.. సినిమా... సినిమా. ఆ సినిమా కష్టాలు ఎలా ఉంటాయో పాట రూపంలో తెలియజేసే ప్రయత్నం చేశారు ర్యాప్ గాయకుడు రోల్ రైడా, దర్శకుడు తరుణ్ భాస్కర్. ‘సినిమా తీసినం’ పాట ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వరుణ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘మనిషి బ్రతుకు ఇంతే’ సినిమా ప్రొమోషన్ కోసం ఆలపించిన గీతమిది. ఇద్దరి మధ్య సాగే సంభాషణలను పాటగా మలిచి ఆకట్టుకుంటున్నారు. ‘ఏంటండీ రావు గారు అంటూ పలకరిస్తాడు రోల్. కులాసేనా వర్మగారు? అంటూ బదులిస్తాడు తరుణ్. ఎక్కడండి నా చావుకు వచ్చాడు మావాడు అని రైడా అనగా ఏంటీ మీ వాడు కూడానా అని ఆశ్యర్యపడతాడు తరుణ్. సినిమా పిచ్చి పట్టింది మావాడికి’ అంటూ బాధపడుతుంటాడు రైడా. ఈ సంభాషణలతో సాగుతూ మేం సినిమా తీసినం అని చరణం మొదలవుతుంది. ర్యాప్ నేపథ్యంలో సాగే ఈ పాట ఆద్యంతం అలరిస్తుంది. అంతేకాదు ఈ పాటను స్ఫూర్తిగా తీసుకుని ఇబ్బందలు పడితే బాధ్యత మాది కాదు అని ఇచ్చిన గమనిక కొత్తగా ఉండటంతో ఆకట్టుకుంటుంది. వరుణ్ రెడ్డి, వేదం వంశీ సాహిత్యం అందించారు.