సతీ అనసూయలో నౌషాద్‌ మూస పాట
చిత్రం: శ్రీకాంత్‌ అండ్‌ శ్రీకాంత్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వారి ‘సతీ అనసూయ’ (10-06-1971)

గీత రచన: డా।। సి.నారాయణరెడ్డి

గానం: ఎస్‌ .జానకి బృందం

సంగీతం: పి.ఆదినారాయణరావు

అభినయం: జమున బృందం

చెలీ! అందాల వేళలో ఆనంద డోలలో

అలవోలె తేలగా రావే...ఓ చెలీ ।।అందాల।।

మందారం మాకందం మరుమల్లి మాలతి

మనసారా పిలిచెను లేవే ।।ఓ చెలీ అందాల।।


ఓ... అటో సుమబాల ఘుమ ఘుమలాడింది

ఇటో భ్రమరంబు ఝుమ్మని పాడింది ।।అటో సుమబాల।।


ఇదే రాసానందమౌనేమో...వసంతానుభమేమో

వనమంతా నవ్వెనే.. పరువం పరవశించెనే ।।ఓ చెలి అందాల।।


ఓ...మరులూరించే మలయసమీరం...

కెరటాల ఉయ్యాలలూగెనే చిలిపిగా సాగెనే...

జిలుగుపైట లాగెనే ।।మరులూరించే।।


నీల గగనమ్ము మిలమిలామెరిసింది

నేడు జగమంతా మయూరమై కులికింది ।।నీలి గగనమ్ము।।


ఈ తెలియరాని అనుభూతి... తేనెలొలుకు నవగీతి

ఏనాడూ ఎరుగనే ।।చెలీ అందాల।।


తెలుగు సంగీత దర్శకులకు హిందీ సినిమా పాటలు మీద మక్కువ ఎక్కువ. మ్యూజిక్‌ సిట్టింగులలో బాణీలు స్ఫురించకుంటే వెంటనే వారి దృష్టి అంతకముందు విడుదలైన హిందీ సినిమాల సూపర్‌ హిట్‌ పాటల మీదకు మరలడం కద్దు. ఇక సుందర్లాల్‌ నహతా వంటి నిర్మాతలు హిందీ పాటల వరసలని అనుకరించి తమ సినిమాలోని పాటలకు మట్లు కట్టమని సంగీత దర్శకులను ప్రోత్సహించడమే కాకుండా ఒత్తిడి కూడా తీసుకొని వచ్చేవారు. ఇప్పుడు చెప్పబోయే ఉదంతం కూడా అలాంటిదే. కాకుంటే అద్భుతమైన పాటలకు ప్రాణం పోసిన అంజలీ పిక్చర్స్‌ అధినేత, గొప్ప సంగీత దర్శకుడు ఆదినారాయణరావు కూడా హిందీ పాటను కాపీ చేయడమే విచిత్రం. అసలు విషయానికొస్తే ట్రాజెడీ కీంగ్‌గా కీర్తించబడే దిలీప్‌ కుమార్‌ 1961లో సిటిజన్‌ ఫిలిమ్స్‌ సంస్థ పేరుతో సొంతంగా బందిపోటు నేరస్తుల కథా నేపథ్యంలో ‘గంగా జమునా’ చిత్రం నిర్మించారు. దిలీప్‌ కుమార్‌ నిర్మించిన ఒకే ఒక చిత్రం ‘గంగా జమునా’. ఈ సినిమాకు కథను సమకూర్చింది కూడా దిలీప్‌కుమారే. సత్యన్‌ బోస్‌ దర్శకత్వంలో నిర్మించిన ‘గంగా జమునా’ దిలీప్‌ కుమార్‌తోబాటు వైజయంతిమాల, నాసిర్‌ ఖాన్, అన్వర్‌ హుస్సేన్, హెలెన్, లీలా చట్నీస్‌ నటించారు. షకీల్‌ బదాయూని తొమ్మిది పాటలు రాయగా, వాటికి తెనేలూరించే బాణీలు సమకూర్చి ఈ సినిమాను మ్యూజికల్‌ హిట్‌గా మలచిన ఘనత నౌషాద్‌కి దక్కుతుంది. ఆ రోజుల్లోనే ఈ సినిమాను టెక్నికలర్‌లో నిర్మించిన మరో ఘనత దిలీప్‌ కుమార్‌కి కూడా దక్కుతుంది. 1957లో మెహబూబ్‌ ఖాన్‌ నిర్మించిన ‘మదర్‌ ఇండియా’ సినిమా ఈ చిత్ర నిర్మాణానికి స్ఫూర్తి అని దిలీప్‌ కుమార్‌ చెప్పేవారు. అనివార్య కారణాల వలన సినిమా విడుదల ఆరు మాసాలు వాయిదా పడినా ‘గంగా జమునా’ చిత్రం బ్లాక్‌ బస్టర్‌గా నిలిచి గోల్డెన్‌ జూబిలీ జరుపుకోవడమే కాకుండా అత్యధిక వసూళ్లు రాబట్టింది. సోవియట్‌ రష్యాలో కూడా ప్రదర్శనకు నోచుకుంది. మూడు ఫిలింఫేర్‌ బహుమతులు, పది బెంగాలీ ఫిలిం జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ వారి బహుమతులు, రెండవ ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతి పొంది నూరు అత్యుత్తమ హిందీ సినిమాల్లో స్థానం సంపాదించింది. తమిళ చిత్ర నిర్మాత ఈ చిత్రాన్ని ‘ఇరు తిరువమ్‌’ పేరుతో పునర్నిర్మించారు. అందులో శివాజీ గణేశన్, పద్మిని, ముత్తురామన్, రాజశ్రీ ముఖ్యపాత్రలు పోషించారు.ఇందులో ‘డూండ్‌ డూండ్‌ రే సాజనా, ఝణన ఘుంఘురూ బాజే’, ‘దో పన్సోం కా జోడా బిచడ్‌ గయోరే’, ‘నా మాను నా మాను దగబాజ్‌ తోరి బతియా’ పాటలు నేటికి నిత్యనూతనమే. ముఖ్యంగా దిలీప్‌ కుమార్‌ వైజయంతిమాల మీద చిత్రీకరించిన ‘డూండ్‌ డూండో రే సాజనా, డూండో రే సాజనా మోరే కాన్‌ కా బాలా, మోరా బాలా చందా కా జైసే హాలా రే’ పాటను లతా మంగేష్కర్‌ ఆలపించారు. ఈ పాటలో నౌషాద్‌ ఉపయోగించిన సితార్, బాన్సురి (ఫ్లూట్‌), తబలా చరుపులు వీనులవిందు చేశాయి. వింత ఏమిటంటే, ఈ పాట బాణీని సంగీత దర్శకుడు, పి.ఆదినారాయణరావు ‘సతీ అనసూయ’ సినిమాలో ‘చెలీ అందాల వేళలో ఆనంద డోలలో అలవోలే తేలగా రావే’ అనే పాట కోసం వాడుకోవడం. అసలు విషయంలోకి వెళితే నిర్మాత సుందర్లాల్‌ నహతా విజయవాడ రామా టాకీస్‌ అధినేత టి.అశ్వత్థనారాయణతో రాజశ్రీ ప్రొడక్షన్‌ బ్యానర్‌ మీద 1957లో కె.బి.నాగభూషణం దర్శకత్వంలో ‘సతీ అనసూయ’ సినిమా నిర్మించాడు. అందులో అమర్‌నాథ్, రేలంగి, గుమ్మడి, అంజలీదేవి, జమున ముఖ్య తారాగణం. సముద్రాల (జూనియర్‌) మాటలు, పాటలు సమకూర్చగా ఘంటసాల సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు కూడా మాటలు రాసింది సముద్రాల (జూనియర్‌) కావడం విశేషం. సుందర్లాల్‌ నహతా కుమారుడు శ్రీకాంత్‌ నహతా (నటి జయప్రద భర్త) మధుభాయ్‌ పటేల్‌ కుమారుడు శ్రీకాంత్‌ పటేల్‌ నిర్మాతలుగా వ్యవహరించగా, శ్రీకాంత్‌ అండ్‌ శ్రీకాంత్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అనే నూతన బ్యానర్‌ మీద ‘సతీ అనసూయ’ చిత్రం నిర్మితమైంది. బి.ఎ సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కె.ఎస్‌.ప్రకాశరావు సహకార దర్శకునిగా వ్యవహరించడం ఒక విశేషం. హిందీ మాతృకను పూర్తిగా అనుకరిస్తూ ‘చెలీ అందాల వేళలో ఆనంద డోలలో అలవోలే తేలగా రావే’ పాటను ఆదినారాయణరావు రూపొందించడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసే విషయం. ఈ పాట అనుకరణకు సుందర్లాల్‌ నహతాతో బాటు ఈ సినిమాకు సహాయ సంగీత దర్శకునిగా వ్యవహరించిన యం.రంగారావు గాని, ఆదినారాయణరావుకు అత్యంత ప్రీతిపాత్రుడైన సత్యం ప్రమేయంగాని తప్పక వుండి తీరుతుంది. హిందీ మాతృక సోలో పాట కాగా, తెలుగు పాటను బృంద గీతంగా తీర్చిదిద్దారు. పల్లవి, చరణాలు, కూడా యథాతధంగా అనుకరించడం ఒక వింతనే చెప్పాలి. ముఖ్యంగా మహిళలను ఆకట్టుకునే కథాంశం కావడంతో సుందర్లాల్‌ నహతా ఈ చిత్రాన్ని రెండుసార్లు తెలుగులో నిర్మించడం జరిగింది. సతీ అనసూయ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. అంతకు ముందు 1936లో ఈస్ట్‌ ఇండియా ఫిలిం కంపెనీవారు చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వంలో ‘సతీ అనసూయ’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని ‘ధృవ విజయం’ కథను కూడా అనుసంధానించి విడుదల చేసారు. ప్రభల సత్యనారాయణ సంగీతం అందించగా బలిజేపల్లి లక్ష్మీకాంత కవి సంభాషణలు సమకూర్చారు. ప్రఖ్యాత రచయిత, చిత్రకారుడు అడివి బాపిరాజు, కళా దర్శకత్వం నిర్వహించడం ఒక విశేషమైతే, ఇందులో వారణాసి, హరిద్వార్‌లోని పురాణ విశేషాలను చూపించడం ప్రత్యేకత. ఈ మూడు చిత్రాలు కూడా విజయవంత మయ్యాయి,. 1971 సినిమాలో ఆదినారాయణరావు బాణీలు కట్టిన ‘ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా’, ‘హిమగిరి మందిరా గిరిజా సుందరా’, ‘ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో’ పాటలు నేటికీ రేడియోలో వినిపిస్తూనే ఉంటాయి. వాటి కోవలో చేరినదే ‘చెలీ అందాల వేళలో ఆనంద డోలలో అలవోలే తేలగా రావే’ కాపీ పాట కూడా!

- షణ్ముఖ


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.