నీ మూతి ఇరుపులూ భలేగున్నయి బాలా
జానపదం... జనంలోంచి పుట్టింది. జనం కోసం పుట్టింది. జనాన్ని రంజింపచేయడానికి పుట్టింది. అప్పుడెప్పుడో ఆకాశవాణిలో వినపడిన ఈ జానపదాలు... తర్వాత పాటల కేసెట్‌లోకి చేరాయి. కొంతకాలం వీటికి ఆదరణ కరవైపోయింది. యూట్యూబ్‌ వచ్చాక అక్కడక్కడా వినిపిస్తూనే ఉన్నా అంత ప్రాధాన్యం లేకుండా పోయింది. అప్పుడొచ్చారు ఓ కవి రాయలసీమ జానపద పతాకాన్ని సినిమా రంగం మీద ఎగరేయడానికి... ఆయనెవరో కాదు... పెంచల్‌దాస్‌. ‘దారి చూడూ... దమ్మూ చూడూ’ అంటూ నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలో తన గాత్రంతో, సీమ మాండలికంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఇప్పుడు మళ్లీ శర్వానంద్‌ కథానాయకుడిగా చేస్తున్న ‘శ్రీకారం’ చిత్రంలో ‘వచ్చానంటివో... పోతానంటివో’ అంటూ ఆయన పాడిన జానపదం... సన్సేషన్‌ అవుతోంది. ఆ పాట పుట్టుక... దాని నేపథ్యం గురించి ‘ఈనాడు సినిమా’తో ముచ్చటించారు పెంచల్‌దాస్‌. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

‘శ్రీకారం’ చిత్ర దర్శకుడు కిషోర్‌ది చిత్తూరు జిల్లానే. నా పాటల గురించి ఆయనకు బాగా తెలుసు. తన తొలిచిత్రంలో నా పాట ఉండాలని కోరారు. సినిమాలో కథానాయికి హీరోపై అలిగి వెళ్లిపోతున్న సందర్భంలో వచ్చే పాట కోసం రాయమన్నారు. ఇది సరదాగానే ఉంటూ... ఉల్లాసంగా ఉండాలని చెప్పారు. సినిమా నేపథ్యం రాయలసీమ కాబట్టి... ఈ ప్రాంత ప్రజలు మాట్లాడుకునే పదాలే వాడమన్నారు. సీమలో శుభకార్యాలప్పుడు, పొలం పనుల్లో సామాన్యులు పాడుకొనే 200కు పైగా జానపదాలు నేను సేకరించి పెట్టాను. వాటిల్లో కొన్ని వినిపించాను. అందులో ‘వచ్చానంటివో... పోతానంటివో’ కిషోర్‌కు బాగా నచ్చింది. తర్వాత ఆ జానపదాన్ని సినిమాలో సందర్భానికి అనుగుణంగా మార్పు చేసి రాసిచ్చాను. ఎన్నో చర్చల తర్వాత ఇప్పుడు ప్రేక్షకులు వింటున్న పాట పుట్టింది. మిక్కీ జే మేయర్‌ అద్భుతమైన సంగీతం అందించడంతో దానికి మరింత కళ వచ్చింది.   ‘వచ్చానంటివో... పోతానంటివో’ అనే పల్లవి అసలు జానపదంలోనిదే. తొలిచరణంలో కథానాయికని పొగుడుతూ అలక ఎందుకని కథానాయకుడు ప్రశ్నిస్తాడు. ఆ అలక కూడా భలేబాగుందని చెబుతూ... ‘తిక్కారేగి ఎక్కినావు కోమలీ అలక నులక మంచం అలసందా పూవ నీకు అలక ఏలనే అగుడు చేయ తగునా..!’ అంటూ చెప్పుకొస్తాడు. ఇక రెండో చరణానికి వచ్చే సరికి నీ అలక పోవాలంటే నేనేం చేయాలో చెప్పమంటాడు. ‘ముదిగారమైన.. ముదిగారమైన.. ముదిగారమైన... నీ మూతి ఇరుపులూ బలేగున్నయి బాలా... నీ అలక తీరను ఏమి భరణము ఇవ్వగలను భామా!’ అంటూ పాడతాడు. మూడో చరణంలో కథానాయికి స్పందిస్తుంది. ‘ఎన్నెలైన ఏమంత నచ్చదు నువ్వు లేని చోటా’ అంటూ కథానాయకుడిపై తనకున్న ప్రేమను ఒక్క వాక్యంలో చెప్పేస్తుంది. ‘ఇంకనైన పట్టించుకుంటనని మాట ఇవ్వు మావా... తుర్రు మంట పైకెగిరిపోద్ది నా అలక సిటికెలోనా!’ అంటూ కథానాయకుడికి మార్గం సూచిస్తుంది. పూలపూల రైక, అలసందా పూవ, అగుడు, ముదిగారం, మూతిఇరుపులు వంటి పదాలు స్థానిక మాటలు చేర్చడంతో పాటలో.. ఈ ప్రాంత మాండలికం గుభాలిస్తోంది.


‘‘రాయలసీమ నుంచి ఎంతోమంది జానపద కళాకారులున్నారు. ఇక్కడి పాటల్లో విరహం, సరసమే కాదు... వేదన, దుంఖమూ ఉంటాయి. సినిమాల ద్వారా ఇక్కడి సాహిత్యాన్ని అందరికీ పరిచయం చేసే గొప్ప అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తాను. ఇప్పుడందరూ నా పాటను ప్రశంసిస్తుంటే సంతోషంగా ఉంది.’’


పల్లవి: వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే


వచ్చానంటివో పోతానంటివో వగలు పలుకుతావే


కట్టమింద.. కట్టమింద.. కట్టమింద..


పొయ్యే అలకల చిలకా బలేగుంది బాలా


దాని ఎదాన.. దాని ఎదాన.. దాని ఎదాన..


ఉండే పూల పూల రైకా బలేగుంది బాలా!

చరణం -1:

నారి నారి వయ్యారి సుందరీ... నవ్వు మొకముదానా


నారి నారి వయ్యారి సుందరీ... నవ్వు మొకముదానా


నీ నవ్వూ మొకం.. నీ నవ్వూ మొకం..నీ నవ్వూ మొకం..


మింద నంగనాచి అలకా బలేగుంది బాలా!


తిక్కరేగి ఎక్కినావు కోమలీ అలకనులక మంచం


తిక్కారేగి ఎక్కినావు కోమలీ అలక నులక మంచం


అలసందా పూవ నీకు అలక ఏలనే అగుడు చేయ తగునా..!


చరణం-2:

సురుకు సూపు సురకత్తులిసరకే చింత ఏల బాలా


సురుకు సూపు సురకత్తులిసరకే చింత ఏల బాలా


ముదిగారమైన.. ముదిగారమైన.. ముదిగారమైన


నీ మూతి ఇరుపులూ బలేగున్నయి బాలా


నీ అలక తీరను ఏమి భరణము ఇవ్వగలను భామా!


చరణం-3

ఎన్నెలైన ఏమంత నచ్చదు నువ్వు లేని చోటా


ఎన్నెలైన ఏమంత నచ్చదు నువ్వు లేని చోటా


నువు దాపూనుంటే.. నువ్వు దాపూనుంటే.. నువ్వు దాపూనుంటే


ఇంకేమి వద్దులే చెంత చేరరావా!


ఇంకనైన పట్టించుకుంటనని మాట ఇవ్వు మావా


తుర్రు మంట పైకెగిరిపోద్ది నా అలక సిటికెలోనా!
చిత్రం: శ్రీకారం, రచయిత: పెంచల్‌దాస్‌


సంగీతం: మిక్కీ జె మేయర్, దర్శకుడు: కిషోర్‌.బి


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.