అరెరె పుడుతూ మొదలే.. మలుపూ కుదుపూ నీదే!

నవతరం గీత రచయితల్లో తనకంటూ ఓ ముద్ర సంపాదించుకున్నారు కృష్ణకాంత్‌. ప్రేమ పాటలు, విరహ గీతాలు, సరదా స్వరాలు.. ఇలా సందర్భం ఏదైనా ఆయన కలం వేగంగా కదులుతుంది. ఈమధ్య ‘సింగిల్‌ కార్డ్‌’ రైటర్‌గా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ సినిమాలో ఆరు పాటలుంటే ఆరూ ఆయనే రాసేస్తున్నారు. ‘టాక్సీవాలా’లోనూ అంతే. ఇందులో అయిదు పాటలూ ఆయన రాసినవే. వాటిలో ‘పెరిగే వేగమే.. తగిలే మేఘమే’ పాటకు మంచి స్పందన లభిస్తోంది. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ప్రియాంక జవాల్కర్‌ నాయిక. ఈనెల 17న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా గీత రచయిత కృష్ణకాంత్‌ ఈ పాట గురించి ఏమన్నారంటే..


 ‘‘కథానాయకుడు కష్టాల్లో ఉంటాడు. తనకో ఉద్యోగం అవసరం. ఆ సమయంలో పాత కారుని టాక్సీగా తిప్పితే బాగుంటుందని ఎవరో సలహా ఇస్తారు. తనకిష్టం లేకపోయినా, పరిస్థితుల ప్రభావంతో ‘టాక్సీవాలా’గా మారతాడు. అక్కడి నుంచి తన దృక్పథం మొత్తం మారిపోతుంది. తన కారులో రకరకాల వ్యక్తులు ప్రయాణం చేస్తుంటారు. వాళ్లని కారు అద్దాల్లోంచి గమనిస్తూ.. వాళ్ల ఆలోచనల్ని పసిగట్టే ప్రయత్నం చేస్తుంటాడు. మెల్లమెల్లగా తన వృత్తిపై తనకు ఇష్టం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే పాట ఇది. కారులో, కారు గురించి పాడుకునే పాట. అయితే ‘ఈ పాటని విడిగా జీవితానికీ, ప్రేమకీ, స్నేహానికీ అన్వయించి చూసుకుని పాడుకున్నా బాగుండాలి’ అని దర్శకుడు సలహా ఇచ్చారు. దాన్ని పాటిస్తూ రాసిన పాట ఇది. ‘వైపర్‌’ అనే మాట లేకపోతే ఇది కారు పాట అని ఎవ్వరికీ తెలీదు. ‘అరెరె పుడుతూ మొదలే.. మలుపూ కుదుపూ నీదే’ అనే లైన్‌ నాకు నచ్చింది. సాధారణంగా మలుపు - గెలుపూ జంట పదాలుగా వాడేస్తాం. కారు ప్రయాణం గురించి చెప్పాలి కాబట్టి, కుదుపు అనే పదం వాడుకునే అవకాశం వచ్చింది. కథానాయకుడి మనస్తత్వాన్ని కూడా పాటలో ప్రతిబింబించే ప్రయత్నం చేశాను. ఇందులో విజయ్‌.. తనకున్నదాంట్లో కొంత ఇతరులకు పంచుతుంటాడు. దాన్ని గుర్తు చేస్తూ... ‘‘చిన్న చిన్న చిన్న నవ్వులే వెదకడమే బ్రతుకంటే.. కొన్ని అందులోనా పంచవా మిగులుంటే’’ అని రాశాను. అక్కడక్కడ కొంత వ్యక్తిత్వ వికాసం గురించి ప్రస్తావన ఉన్నా అందరికీ అర్థమయ్యే భావాలు, పదాలే వాడాను. చాలా త్వరగా రాసేసిన గీతమిది. గంటలో పూర్తయింది. ట్యూన్‌ ఇచ్చాకే పాట రాశా. పాటని సంగీత దర్శకుడు ‘దందం దిగ దిగ’ అంటూ ఏవో కొన్ని పదాలతో మొదలెట్టారు. దాన్ని అలానే ఉంచేద్దాం అన్నారు. కానీ అర్థం లేని పదాలు ఉండడం నాకు ఇష్టం లేదు. అందుకే ‘పెరిగే వేగమే.. తగిలే మేఘమే’ అంటూ పదాలు జోడించా. పాట చివర్లో ‘రంగుల చినుకులు’ అనే మాట కూడా సంతృప్తినిచ్చింది. ఈ పాటని అంతకు ముందు మరో గాయకుడితో పాడించాం. ‘రేపు విడుదల చేయాలి’ అనుకుంటున్న సమయంలో సిద్‌ శ్రీరామ్‌ వచ్చాడు. రాత్రికి రాత్రే అతనితో పాట పాడించాం. ‘టాక్సీవాలా’లో శ్రేయా ఘోషల్‌ పాడిన ఓ పాట ఉంది. ఆ పాటంటే నాకు మరింత ఇష్టం’’.

అరెరె పుడుతూ మొదలే 

మలుపూ కుదుపూ నీదే
అరెరె పుడుతూ మొదలే 

మలుపూ కుదుపూ నీదే
చిత్రం: టాక్సీవాలా
రచన: కృష్ణకాంత్‌ (కెకె)
సంగీతం: జేక్స్‌ బిజాయ్‌
గానం: సిద్‌ శ్రీరామ్‌

పెరిగే వేగమే తగిలే మేఘమే
అసలే ఆగదు ఈ పరుగే
ఒకటే గమ్యమే దారులు వేరులే
పయనమే నీ పనిలే
అరెరే పుడుతూ మొదలే
మలుపూ కుదుపూ నీదే
ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే
ఆ వైపరే తుడిచే కారే కన్నీరే
మాటే వినదుగ వినదుగ వినదుగ
వేగం దిగదుగ దిగదుగ వేగం ।।3।।

చరణం:
చిన్న చిన్న చిన్న నవ్వులే వెదకడమే.. బ్రతుకంటే
కొన్ని అందులోనా పంచవా మిగులుంటే.. హోహో
నీదనే స్నేహమే.. నీ మనస్సు చూపురా
నీడలా వీడకా.. సాయాన్నే నేర్పురా
కష్టాలెన్ని రానీ జేబు ఖాళీ కానీ
నడుచునులే బండి నడుచునులే
దారే మారిపోనీ ఊరే మర్చిపోని
వీడకులే శ్రమ వీడకులే
తడి ఆరే ఎదపై.. మురిసేను మేఘం
మనసంతా తడిసేలా.. కురిసే వానా..
।।మాటే వినదుగ।।
మరు జన్మతో పరిచయం
అంతలా పరవశం
రంగు చినుకులే గుండెపై రాలెనా...


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.