శోభన్‌ బాబు, శ్రీ దేవిలా.. వరుణ్‌, పూజా వచ్చారిలా

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు 1982లో తెరకెక్కించిన ‘దేవత’ సినిమాలోని ‘వెల్లువచ్చి గోదారమ్మ’ పాట శ్రోతలను ఎంతగానో అలరించింది. ఇప్పటికీ ఆ పాటకు ఆదరణ తగ్గలేదనేది అందరికీ తెలిసిన విషయమే. సంగీత ప్రియులు ఈ పాటను ఏదో ఓ సందర్భంలో హమ్‌ చేస్తుంటారు. అంతేకాదు సంగీతానికి తగినట్టుగానే అలనాటి తారలు శ్రీదేవి, శోభన్‌ బాబు ఈ పాటలో నర్తించి ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. గోదావరి ఒడ్డున బిందెలతో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈ పాటను చిత్రీకరించడంతో పండగ వాతావరణం ఉట్టిపడుతుంది. అలాంటి గీతాన్ని మరోసారి వెండితెరపై చూస్తే ఎలాంటి ఉంటుంది? ఆ ఆలోచనతోనే ఇప్పుడు ఇదే పాటను యువ కథానాయకుడు వరుణ్‌ తేజ్‌ హీరోగా వస్తున్న ‘వాల్మీకి’ చిత్రంలో రీమిక్స్‌ చేస్తున్నారు. తాజాగా ఈ పాట ప్రోమో వీడియో విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో వరుణ్‌ శోభన్‌ బాబులా, పూజా హెగ్దే శ్రీ దేవిగా కనిపిస్తున్నారు. ఆ ఒరినల్‌ పాటకు ఏమాత్రం తీసిపోకుండా ఈ పాటను చిత్రీకరణ చేసినట్లుగా ఉంది మేకింగ్‌ చూస్తుంటే. ముకుంద చిత్రం తర్వాత వరుణ్‌తేజ్, పూజాహెగ్డే కలిసి నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. హరీష్‌ శంకర్‌ దర్శకుడు. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జే.మేయర్‌ ఈ సినిమానికి బాణీలు సమకూరుస్తున్నారు. సెప్టెంబర్‌ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.