సాలూరు మెప్పించలేని జోకర్‌ ఖవ్వాలి
చిత్రం: శ్రీ విఠల్‌ ప్రొడక్షన్స్‌ వారి ‘ఆడదాని అదృష్టం’ (14-03-1975)
గీతరచన: డా।। సి.నారాయణరెడ్డి
గానం: ఎస్‌.జానకి
సంగీతం: సాలూరు హనుమంతరావు
అభినయం: జయమాలిని

ఈ రేయి పోనీయనూ... ఇంక ఎవరినీ రానీయనూ
ఓ...చందమామా...ఇదే స్వర్గసీమా ।।ఈ రేయి।।

కులికే...వగలొలికే... కోటి తారలు నీకున్నగానీ
ఎన్నడు వాడని కలువను నేను...
ఎవ్వరుచూడని విలువను నేను... విలువను నేనూ ।।ఈ రేయి।।

చెలినే...ఈ చెలినే... తెలవారితే నీవే మరచినా
ఈ మధురిమలే మరువను నేను...
మరిమరి...నీవు... మరిమరి రాకుంటే
విడువను నిన్ను...విడువను నిన్నూ ।।ఈ రేయి।।


ర్శక నిర్మాత విఠలాచార్య పేరు వింటేనే జానపద సినిమాలు గుర్తుకొస్తాయి. ‘మీరెందుకు జానపద చిత్రాలనే తీస్తూ ఉంటారు?’ అని కొందరు అడిగిన ప్రశ్నకు ‘జానపద చిత్రాలంటే మన ప్రేక్షకులకు మక్కువ ఎక్కువ. మాయలు, మంత్రాలు, విచిత్ర జంతుజాలం వారికి మంచి వినోదాన్ని కలిగిస్తాయి. అందుకే నేను జానపద చిత్రాల నిర్మాణం వైపు మొగ్గు చూపుతుంటాను’ అనే వారు విఠలాచార్య. అటువంటి విఠలాచార్య 1971లో ‘రాజకోట రహస్యం’ చిత్రానికి దర్శకత్వం వహించాక మనసు మారి ‘బీదలపాట్లు’, ‘పల్లెటూరి చిన్నోడు’, ‘ఆడదాని అదృష్టం’ చిత్రాలను సొంత బ్యానర్‌ మీద నిర్మించారు. ఈ సినిమాలు విఠలాచార్యను నిరాశపరచాయి. అయితే విఠలాచార్యకు ఇదేమీ కొత్త కాదు. విఠలాచార్య తెలుగులో విఠల్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం ‘కన్యాదానం’ (1953) సాంఘికమే. తరువాత మలి ప్రయత్నంగా ‘వద్దంటే పెళ్లి’ అనే మరో సాంఘిక చిత్రం నిర్మించారు. కానీ ఈ సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో పంథా మార్చకొని, ‘జయవిజయ’ చిత్రంతో జానపదాల సృష్టికి నాంది పలికారు. అయితే ‘పల్లెటూరిచిన్నోడు’ సినిమా బాక్సాఫీసు వద్ద విఫలం కావడంతో, మరలా ‘కోటలో పాగా’ సినిమాతో జానపద చిత్ర నిర్మాణం కొనసాగించారు. ఇక ‘ఆడదాని అదృష్టం’ ఒక లఘు బడ్జెట్‌ సినిమా. ఇందులో విఠలాచార్య కేవలం నిర్మాతగానే వ్యవహరించి దర్శకత్వ బాధ్యతలు జి.వి.ఆర్‌.శేషగిరిరావుకు అప్పగించారు. కథ, స్క్రీన్‌ప్లే మాత్రం విఠలాచార్యదే. హాస్యనటి మమతను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ రామకృష్ణకు జంటగా నటింపజేయడమే కాకుండా, చలం సరసన సుమ అనే మరో కొత్త అమ్మాయిని రెండవ కథానాయికగా పరిచయం చేశారు. ఈ సినిమా ఆశించినంత గొప్పగా ఆడలేదు. మాటలు రాజశ్రీ రాయగా పాటలు డా।। సి.నారాయణరెడ్డి సమకూర్చారు. సాలూరు హనుమంతరావు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఇందులో కేవలం అయిదు పాటలే ఉండగా వాటిలో ఒక్కటి కూడా జనరంజకం కాలేదు. వాటిలో నర్తకి జయమాలినికి రెండు పాటలున్నాయి. ‘మొన్ననే వయసొచ్చింది, నిన్ననే పిలుపొచ్చింది’ అనే జానకి ఆలపించినది తొలి పాట కాగా రెండవది ‘ఈ రేయి పోనీయనూ, ఇంక ఎవరినీ రానీయనూ’ అనే ఒక ఖవ్వాలి తరహా పాట. సినిమాలో వున్నవి అయిదు పాటలే అయినా ఈ పాటను హనుమంతరావు హిందీ సినిమా పాట నుంచి ఎత్తి పోశారు. ఆ మాతృక రాజ్‌కపూర్‌ నిర్మించిన ‘మేరా నామ్‌ జోకర్‌’ సినిమాలోనిది కావడం విశేషం. ఈ సినిమాకు శంకర్‌ జైకిషన్‌ సంగీతం సమకూర్చిన తొమ్మిది పాటలు నవరత్నాల వంటివే. ‘బర్సాత్‌’ (1949) సినిమా నుంచి శంకర్‌ జైకిషన్‌లే రాజ్‌కపూర్‌ చిత్రాలకు ఆస్థాన సంగీత దర్శకులు. ఈ సినిమాలో రాజ్‌కపూర్, పద్మిని ఒకానొక రంగస్థలం మీద ఆలపించే ఖవ్వాలి పాటను సాలూరు హనుమంతరావు అలనుకరించి నర్తకి పాటగా స్వరపరచారు. హిందీలో ఆ ఖవ్వాలి పాట ‘దాగ్‌ న లగ్‌ జాయే, కహి దాగ్‌ న లగ్‌ జాయే.. హే...ప్యార్‌ కియా తో కర్‌ కే నిభానా, దాగ్‌ న లగ్‌ జాయే’ అంటూ సాగుతుంది. ఈ పాటను హజ్రత్‌జైపురి రాయగా ముఖేష్, ఆశాభోంస్లే ఆలపించారు. ఈ పాట పల్లవిని యాధాతధంగా అనుకరిస్తూ, రెండు చరణాలను ఖవ్వాలి పద్ధతిలో హిందీ పాట స్థాయిలోనే హనుమంతరావు స్వరపరచారు. తెలుగులో ఈ పాట పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ‘మేరా నామ్‌ జోకô’Â సినిమా నిర్మాణానికి ఏకంగా ఆరు సంవత్సరాలు పట్టింది. ఈ సినిమా నిర్మాణానికి తన ఆస్తులతోబాటు, తను నివశించే బంగళాను కూడా రాజ్‌కపూర్‌ తాకట్టు పెట్టి, రష్యా నుంచి సర్కస్‌ కంపెనీని తెప్పించి, శ్రమకోర్చి సినిమా నిర్మించారు. నాలుగు గంటల పదిహేను నిమిషాల నిడివితో, రెండు ఇంటర్‌వెల్స్‌తో విడుదలైన ఈ సినిమా రాజ్‌కపూర్‌ అభిమానులను నిరాశపరిచింది. అంతేకాదు, ఈ సినిమాకు పొడగింపు చిత్రాన్ని నిర్మించాలనే రాజ్‌కపూర్‌ ఆశలకు గండికొట్టింది. తరువాత ప్రేక్షకుల నాడిని దృష్టిలో పెట్టుకొని నిడివి తగ్గించి విడుదల చేయగా రిపీట్‌రన్‌లో ఈ సినిమా బాగా ఆడడం విశేషం. ‘మేరా నామ్‌ జోకర్‌’ సినిమాకు సంగీతం సమకూర్చిన శంకర్‌ జైకిషన్‌కు ఫిలింఫేర్‌ వారి ఉత్తమ సంగీత దర్శకుల బహుమతి లభించింది. అలాగే రాధూ కర్మార్కర్‌కు ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ బహుమతి, మన్నాడే ఆలపించిన ‘ఏ భాయ్‌ జరా దేఖ్‌ కె ఛలో’ పాటకి ఉత్తమ గాయకుని బహుమతి, రాజ్‌కపూర్‌కి ఉత్తమ దర్శకుని బహుమతి, అల్లావుద్దీన్‌ ఖాన్‌ ఖురేషికి ఉత్తమ రిరార్డిస్టు బహుమతి ఫిలింఫేర్‌ సంస్థ బహుకరించింది.- షణ్ముఖాచారి


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.