నింగి చుట్టే మేఘం యెరుగద ఈ లోకం గుట్టు..
ప్రేమ పాటలు... టైటిల్‌ గీతాలు.. కాస్త చేయి తిరిగిన రచయితలెవరైనా సులభంగానే రాసేస్తారు. కాస్త కవిత్వం రంగరించి... భావుకత నిండిన పదాలను సంగీత దర్శకుడిచ్చిన బాణీలకు తగ్గట్లు సమతూకంగా పేర్చుతారు. కానీ, నిత్యం కళ్ల ముందు కనపడే సామాన్య సగటు మనుషుల వ్యక్తిత్వాల్ని, వారి జీవితాల్లోని చిన్న చిన్న ఆనందాల్ని మనసులకు హత్తుకునేలా ఆవిష్కరించగలగడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. దీన్ని ‘‘నింగి చుట్టే మేఘం యెరుగద’’ గీతంతో ఎంతో అద్భుతంగా పూర్తి చేసి చూపించారు గీత రచయిత విశ్వ. సత్యదేవ్‌ హీరోగా నటించిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రం కోసం ఈ ప్రయత్నం చేశారాయన. వెంకటేష్‌ మహా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. తన పాట గురించి విశ్వ చెప్పిన కబుర్లేంటంటే..


‘‘నాకు.. దర్శకుడు వెంకటేష్‌ మహాకు ‘కేరాఫ్‌ కంచరపాలెం’ చిత్రం నుంచి మంచి అనుబంధం ఉంది. నేను ఆ చిత్రానికి  ‘‘ఆశాపాశం..’’ అనే గీతం రాసిచ్చా. ఆ పాట సినిమాకు, నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అందుకే తను రెండో ప్రయత్నంగా చేసిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’లోనూ మంచి పాటిచ్చారు. సినిమాకు చాలా ముఖ్యమైన పాటిది. దర్శకుడు వెంకట్‌ నాకీ పాట ఇచ్చేటప్పుడు చెప్పిన మాట ఒకటే.. ‘ఈ సినిమా సగటు మనిషి జీవితాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. వాళ్ల జీవితాల్లోనూ అందమైన భావుకత ఉంటుంది. చక్కటి సంఘర్షణలు, చిన్ని చిన్ని ఆనందాలు ఉంటాయి. వాటిని సినిమాలో అందంగా చూపించబోతున్నాం. దీనికి తగ్గట్లుగా పాట రాసి పెట్టండి’’ అన్నారు.నిజానికి ఈ చిత్ర మాతృకలో వచ్చే గీతంలో ఆ పాట రచయిత ప్రకృతి అందాల్ని వర్ణించాడు. ఇక్కడ ప్రకృతితో మమేకమైన సగటు మనిషి జీవితాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. అదీ.. అరకు నేటివిటీకి తగ్గట్లుగా సాగుతుంది. గొప్ప వాళ్ల జీవితాల గురించి చెప్పాలంటే.. వాళ్లు ఇది సాధించారు, అది చేశారు.. అని వర్ణిస్తూ పోవచ్చు. సగటు మనుషుల జీవితాల్ని ఆవిష్కరించాలంటే ప్రత్యేకంగా ఏం ఉంటుంది. వాళ్లు ఆరోజుకి పూట గడిస్తే చాలనుకుంటారు. చిన్న ఉద్యోగం, వచ్చిన సంపాదనలో భార్య, పిల్లలతో మంచిగా ఉంటే బాగుంటుందనుకుంటారు. ప్రకృతిని ఎప్పుడూ ఎదిరించరు. చెట్లు కొట్టెయ్యరు, అడవుల్ని నాశనం చేయరు. ప్రకృతిలో భాగంగా జీవిస్తుంటారు. ఇలాంటి అంశాల్ని స్పృశిస్తూ ఈ పాటతో సగటు మనిషి గొప్పతనాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాం.

తొలి   పల్లవిలో ‘‘నింగి చుట్టే మేఘం యెరుగద ఈ లోకం గుట్టు.. మునిలా మెదలదు నీ మీదొట్టు’’ అని ఉంటుంది. తర్వాత చరణంలో ‘‘తారావాసాల ఊసుల్ని వీడి.. చూసింది ఓసారి సగటుల కనికట్టు’’ అని రాశా. అంటే పైనున్న మేఘాలకు అన్నీ తెలుసు. కానీ, ఏం చూసీ చూడనట్లు వెళ్లిపోతుంటాయి అని చెప్పా. మధ్యతరగతి మనుషుల వ్యక్తిత్వాలు.. వాళ్ల ఆలోచనలు.. నడవడికలు.. వారి జీవితాల్లో ఉన్న అందమైన భావోద్వేగాల్ని తర్వాతి చరణాల్లో ఆవిష్కరిస్తూ.. ‘‘తమదేదో తమదంటు.. మితిమీర తగదంటు.. తమదైన తృణమైన చాలను వరస’’ అని రాశా. మధ్యతరగతి జీవితాల్లోనూ జగడాలుంటాయి. కానీ, వాళ్లు పొద్దున్న కొట్టుకుంటే సాయంత్రానికి కలిసిపోతారు. వారి గొడవల్లో పగ ఉండదు. ఈ విషయాన్నే.. ‘‘ఉచితాన సలహాలు.. పగలేని కలహాలు.. యెనలేని కథనాల చోటిది బహుశ..’’ అంటూ    వివరించే ప్రయత్నం చేశా. నేను స్వతహాగా ప్రకృతి ఆరాధకుడ్ని అవ్వడం, మధ్యతరగతి కుటుంబంలోనే పుట్టి పెరగడం వల్ల ఈ గీతం రాయడానికి పెద్దగా సమయం పట్టలేదు.సరస్వతీ దేవి అనుగ్రహంతో ఒకపూటలోనే చక్కగా పాట పూర్తి చేసిచ్చా. ఆ లిరిక్స్‌ చూడగానే వెంకట్‌కి బాగా నచ్చేసింది. ఇక పాట విడుదలయ్యాక సిరివెన్నెల సీతారామశాస్త్రి, కీరవాణి, వెన్నెల కంటి వంటి పెద్దలంతా నాకు ఫోన్‌ చేసి ఆశీర్వదించారు.


గానం- విజ‌య్ ఏసుదాస్‌

సంగీతం- బిజిబ‌ల్‌

నింగి చుట్టే మేఘం యెరుగద

ఈ లోకం గుట్టు... మునిలా

మెదలదు నీ మీదొట్టు

కాలం కదలికలతో జోడి కట్టు...

తొలిగా,

తారావాసాల ఊసుల్ని వీడి

చూసింది ఓసారి సగటుల కనికట్టు ।। నింగి చుట్టే ।।

చరణం 1

తమదేదో తమదంటు..

మితిమీర తగదంటు..

తమదైన తృణమైన చాలను వరస

ఉచితాన సలహాలు..

పగలేని కలహాలు..

యెనలేని కథనాల చోటిది బహుశ

ఆరాటం తెలియని జంఝాటం

తమదిగ    

చీకు చింత తెలియదుగా

సాగింది ఈ తీరు.. కథ సగటుల

చుట్టూ.. ।।నింగి చుట్టే।।

చరణం 2

సిసలైన సరదాలు...

పడిలేచే పయనాలు..

తరిమేసి తిమిరాలు

నడిచేలే మనస

విసుగేది దరిరాని..

విధిరాత కదిలీని..

శతకోటి సహనాల నడవడి తెలుసా

చిత్రంగా, కలివిడి సూత్రంగా..

కనపడే ప్రేమ పంతం తమ సిరిగా,

సాగింది ఈ తీరు సగటుల కనికట్టు ।।నింగి చుట్టే।।Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.