క్లైమాక్స్‌లో అదరగొట్టేందుకు!!
సినిమా అంతా ఒక ఎత్తు. క్లైమాక్స్‌ మరో ఎత్తు. ప్రీ క్లైమాక్స్‌ వరకూ ఫర్లేదనిపించినా క్లైమాక్స్‌ అదిరిపోతే సూపర్‌ సినిమా అనేస్తారు ప్రేక్షకులు. బాక్సాఫీసు లెక్కల్లో డిసెంబరు కూడా క్లైమాక్స్‌ లాంటిదే. ఏడాది మొత్తం వచ్చిన చిత్రాలు ఓ లెక్క. ఆఖరి నెలలో రాబోయే చిత్రాలు ఇంకో లెక్క. డిసెంబరులో వచ్చే చిత్రాలు ప్రేక్షకులను మెప్పించడంలో విజయం సాధిస్తే ఆ ఏడాదిని ఘనంగా ముగించి అదే ఉత్సాహంతో కొత్త ఏడాదికి సిద్ధమవుతోంది చిత్రసీమ. అందుకే ఆ నెలలో ఏయే చిత్రాలు పలకరించబోతున్నాయా అన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఈ డిసెంబరులో బాలీవుడ్‌ నుంచి మూడు ఆసక్తికరమైన చిత్రాలు రాబోతున్నాయి. వాటికి తోడు మరో రెండు ప్రాంతీయ చిత్రాలు, ఒక హాలీవుడ్‌ చిత్రం హిందీలోనూ విడుదలకాబోతున్నాయి. వాటి సంగతులివీ.

* జీరో..


షారుఖ్‌ ఖాన్‌ లాంటి అగ్రకథానాయకుడు మరుగుజ్జుగా నటించడమా? అయినా ఆ సాహసం చేసి ఆశ్చర్యపరిచారు షారుఖ్‌. ఆయన మరుగుజ్జుగా నటించిన చిత్రమే ‘జీరో’. బాలీవుడ్‌లో ఆ తరహా పాత్రలో కనిపించిన తొలి కథా నాయకుడిగా ప్రత్యేకత చాటుకున్నారాయన. కత్రినా కైఫ్‌, అనుష్క శర్మ నాయికలుగా నటించారు. ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ తెరకెక్కించారు. షారుఖ్‌తో ఆనంద్‌ చేసిన తొలి చిత్రమిది. కత్రినా కైఫ్‌ సినీ కథానాయిక పాత్రలో కనిపించనుండగా, అనుష్క చక్రాల కుర్చీకే పరిమితమైన దివ్యాంగురాలిగా నటించింది. ఈ చిత్రంలో అతిథి పాత్రలో సల్మాన్‌ ఖాన్‌ మెరవనుండటం విశేషం. షారుఖ్‌ పాత్ర కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. అందుకోసం హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన వీఎఫ్‌ఎక్స్‌ నిపుణులను రప్పించారు. డిసెంబరు 21న విడుదలవుతోంది.
* ఆక్వామ్యాన్‌..

హాలీవుడ్‌లో అద్భుతమైన విజువల్‌ ఎఫెక్ట్స్‌తో రూపొందే సూపర్‌ హీరోల చిత్రాలకు భారత్‌లోనూ మంచి ఆదరణ ఉంటోంది. ఆ కోవలోనే మరో సూపర్‌ హీరో చిత్రం హిందీతో పాటు తెలుగులోనూ విడుదలవుతోంది. అదే ‘ఆక్వా మ్యాన్‌’. కంజ్యూరింగ్‌, ఫ్యూరియస్‌ 7 లాంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు జేమ్స్‌ వాన్‌ దీన్ని తెరకెక్కించారు. సుమారు రూ.వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఇది తెరకెక్కింది. సముద్రగర్భంలో ఉండే అట్లాంటిస్‌ అనే రాజ్యం నేపథ్యంలో భారీ యుద్ధాలతో ఈ కథ సాగుతుంది. సముద్ర గర్భంలో జరిగే సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతాయని చిత్రబృందం చెబుతోంది. డిసెంబరు 21న విడుదలవుతోంది.
* కేదార్‌నాథ్..


ఐదేళ్ల క్రితం కేదార్‌నాథ్‌ పుణ్యక్షేత్రాన్ని వరదలు ముంచెత్తిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ మహా విషాదానికి ఓ అందమైన ప్రేమ కథను జోడించి తెరకెక్కించిన చిత్రం ‘కేదార్‌నాథ్‌’. బాలీవుడ్‌ యువకథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ నటించారు. సైఫ్‌ అలీఖాన్‌ కుమార్తె సారా అలీఖాన్‌ కథానాయికగా పరిచయమవుతున్న చిత్రమిది. అభిషేక్‌ కపూర్‌ తెరకెక్కించారు. ఇందులో వరదల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను భారీ స్థాయిలో తెరకెక్కించారు. వాటి కోసం 470 నీటి ట్యాంకులతో సుమారు 50 లక్షల లీటర్ల నీరు వినియోగించి కృత్రిమ వరదలు సృష్టించారట. సుశాంత్‌, సారా డూప్‌ల సాయం లేకుండానే స్వయంగా ఈ సన్ని వేశాల్లో నటించారట. అందుకోసం కొన్ని వారాల పాటు ఈతలో శిక్షణ తీసుకున్నారట. గజ ఈతగాళ్ల ఆధ్వర్యంలో ఆ సన్నివేశాలను చిత్రీకరించినట్టు సమాచారం. ట్రైలర్‌లో ఆ భారీతనం కనిపించడంతో చిత్రంపై అంచనాలేర్పడ్డాయి. డిసెంబరు 7న విడుదలవుతోంది.
* 2.ఓ..


ఈసారి నవంబరు 29 నుంచే చిత్రసీమలో క్లైమాక్స్‌ మొదలైపోతుంది. ఆరోజే ‘2.ఓ’వచ్చేస్తోంది మరి. ‘రోబో’కు సీక్వెల్‌గా రజనీకాంత్‌ కథానాయకుడిగా శంకర్‌ తెరకెక్కించిన ‘2.ఓ’ తమిళం, తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల కానుంది. ఈ చిత్రానికి బాలీవుడ్‌తో మరో గట్టి సంబంధముంది. బాలీవుడ్‌ కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌ ఇందులో ప్రతినాయకుడిగా నటించారు. రజనీకాంత్‌ పోషించిన చిట్టి పాత్రతో పాటు అక్షయ్‌ కుమార్‌ చేసిన క్రోమ్యాన్‌ పాత్ర ప్రేక్షకులకు కొత్త అనుభూతులను పంచుతుందని తెలుస్తోంది. ఆ రెండు పాత్రల గెటప్పులకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన లుక్కులు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. సాధారణంగా రజనీ చిత్రాలకు దేశవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. దానికి తోడు అక్షయ్‌ తొలిసారి ప్రతినాయకుడిగా కనిపించనుండటంతో బాలీవుడ్‌ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి ఏర్పడింది. అమీ జాక్సన్‌ నాయికగా కనిపించనుంది.
* సింబా..


తెలుగులో విజయం సాధించిన ‘టెంపర్‌’కు రీమేక్‌గా బాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రం ‘సింబా’. రణ్‌వీర్‌ సింగ్‌ కథానాయకుడిగా నటించారు. ఆయన తొలిసారి పోలీస్‌ పాత్రలో నటించిన చిత్రమిది. సారా అలీఖాన్‌ కథానాయిక. ‘సింగం’ సిరీస్‌తో యాక్షన్‌ చిత్రాల స్పెషలిస్ట్‌గా పేరుతెచ్చుకున్న రోహిత్‌ శెట్టి దీన్ని తెరకెక్కించారు. అజయ్‌ దేవగణ్‌ అతిథి పాత్రలో కనిపించనుండటం విశేషం. డిసెంబరు 28న విడుదలవుతోంది. దీపికతో వివాహం తర్వాత రణ్‌వీర్‌ నుంచి వస్తున్న తొలి చిత్రం ఇదే కానుంది.
* కేజీఎఫ్..

కన్నడ కథానాయకుడు యష్‌ నటించిన ‘కేజీఎఫ్‌’ కూడా హిందీలో విడుదల కానుంది. బంగారు గనుల నేపథ్యంలో భారీ స్థాయిలో దీన్ని తెరకెక్కించినట్లు చిత్రబృందం చెబుతోంది. ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబరు 21న విడుదలవుతుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.