‘మీటూ’ స్వరం పెరుగుతోంది..
* మొఘల్‌ దర్శకుడిపై ఆరోపణలు
* ఆ చిత్రం నుంచి వైదొలిగిన ఆమీర్‌


దేశంలో ఏ చిత్ర పరిశ్రమను చూసినా మీటూ మాటే వినిపిస్తోంది. ఇన్నాళ్లు తమ బాధను చెప్పుకొనే ధైర్యం లేక మూగ వేదన అనుభవించిన నటీమణులు తెగించి ముందుకొచ్చి తమను వేధించిన వారిని కడిగిపారేస్తున్నారు. రోజురోజుకీ బాధితుల సంఖ్య, ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖుల సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా ‘జాలీ ఎల్‌ఎల్‌బీ’ చిత్ర దర్శకుడు సుభాష్‌కపూర్‌పై నటి గీతిక త్యాగి ఆరోపణలు చేశారు. గతంలో కూడా ఆయనపై గీతిక లైంగిక ఆరోపణలు చేస్తూ కేసు పెట్టారు. సుభాష్‌ ఎలాంటివాడో చెప్పడానికి అతని భార్యను ఓ స్టూడియోకి పిలిపించింది గీతిక. తను ఎలాంటి తప్పు చేయలేదంటూ సుభాష్‌ తన భార్యతో చెప్పుకుంటుండగా అతడి చెంప మీద కొట్టింది గీతిక. ఈ వీడియో సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతోంది. సుభాష్‌ ప్రస్తుతం గుల్షన్‌కుమార్‌ బయోపిక్‌ను ‘మొఘల్‌’గా తెరకెక్కిస్తున్నారు. ఆమీర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. సుభాష్‌పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ చిత్రం నుంచి తాము తప్పుకొంటున్నట్టు ఆమీర్‌ఖాన్, కిరణ్‌రావ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. సుభాష్‌ను తమ చిత్రం నుంచి తొలిగిస్తున్నట్టు ఈ చిత్ర సహ నిర్మాత భూషణ్‌కుమార్‌ తెలిపారు. దీనికి సుభాష్‌ స్పందిస్తూ...‘‘ఆమీర్, కిరణ్‌రావ్‌ల నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. ప్రస్తుతం ఈ విషయం కోర్టులో ఉంది. చట్టప్రకారం నా నిజాయతీని నిరూపించుకుంటాను’’అని చెప్పారు.


అలోక్‌నాథ్‌పై ఇప్పటికే రచయిత్రి వింటా నందా, నటి సంధ్యా మృదుల్‌ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయనపై మరో ఆరోపణ వచ్చింది. అలోక్‌ తనను లైంగికంగా వేధించాడంటూ ‘సోను కే టిటు క స్వీటీ’ చిత్రంలో నటించిన నటి దీపిక అమిన్‌ ఆరోపించారు. ‘‘అలోక్‌ మద్యం సేవించి మహిళల్ని ఎంత దారుణంగా వేధిస్తాడో చాలామందికి తెలుసు. కొన్నేళ్లకిత్రం అతనితో ఓ ధారావాహిక చిత్రీకరణ కోసం అవుట్‌డోర్‌ వెళ్లినప్పుడు నన్ను బలవంతంగా తన గదిలోకి లాక్కెళ్లబోయాడు. ఆ రోజు అతడు ప్రవర్తించిన తీరు ఎప్పటికీ నేను మర్చిపోలేను’’అని చెప్పారు దీపిక. అలోక్‌పై వింటా చేసిన ఆరోపణల నేపథ్యంలో ‘ది ఇండియన్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ డైరెక్టర్స్‌ అసోషియేషన్‌’ ఆయనకు నోటీసులు పంపింది. నానాపటేకర్‌పై తనుశ్రీదత్తా చేసిన ఆరోపణల వ్యవహారం కొత్త మలుపులు తీసుకుంటోంది. తనపై వస్తున్న ఆరోపణల్ని చట్టప్రకారం ఎదర్కోవడానికి అలోక్‌నాథ్‌ సిద్ధమవుతున్నట్టు ఆయన తరపు న్యాయవాది చెప్పినట్టు సమాచారం. ‘హార్న్‌ ఓకే ప్లీజ్‌’ చిత్రీకరణ సమయంలో నానాపటేకర్‌ నన్ను వేధించాడంటూ తనుశ్రీ కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి ముంబయిలోని ఒషిఒరా పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ అయింది. నానాపటేకర్‌తో పాటు దర్శకుడు రాకేష్‌ సారంగ్, నిర్మాత సమీ సిద్దిఖీ, కొరియోగ్రాఫర్‌ గణేష్‌ ఆచార్య పేర్లను కూడా ఇందులో చేర్చారు. ఓ పెద్ద ఉద్యమంగా మారిన మీటూకు సినీ తారలు మద్దతుగా నిలుస్తున్నారు.


మీటూపై ఎట్టకేలకు అమితాబ్‌బచ్చన్‌ స్పందించారు. ‘‘లైంగిక వేధింపులకు గురవుతున్న మహిళలు, ముఖ్యంగా పనిచేసే చోట వేధింపులు ఎదుర్కొనేవారు వెంటనే పైస్థాయి వ్యక్తుల వద్దకు తీసుకెళ్లాలి. పని ప్రదేశాల్లో మహిళలకు మరింత రక్షణ లభించేలా ఏర్పాట్లు జరగాలని’’అంటూ ట్వీట్‌ చేశారు అమితాబ్‌. ఇప్పటికీ మౌనంగా ఉండిపోయిన మహిళలు ధైర్యంగా ముందుకు రావాలని కోరారు నాయిక పరిణితీ చోప్రా. ‘మనుషులుగా వాళ్ల బాధను విందాం. అర్థం చేసుకుందాం. వాళ్లకు అండగా నిలుద్దామ’ని కోరారు యువ కథానాయకుడు అర్జున్‌కపూర్‌. సమంత కూడా ట్విట్టర్‌లో తన పోరాటాన్ని మొదలు పెట్టింది. ‘ఇన్నాళ్లూ ఈ విషయంపై ఎందుకు మాట్లాడలేదు’ అని ఓ అభిమాని ప్రశ్నిస్తే ‘‘తప్పంతా మీదే అంటూ మావైపు నెట్టివేస్తారన్న భయంతోనే సమయం వచ్చినప్పుడు స్పందిస్తున్నాం’’ అంటూ సమాధానం ఇచ్చింది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.