పాత్రలు చిన్నవైనా.. ప్రభావం పెద్దది
చరిత్రలో లోతుల్లో మసకబారిపోయిన తొలి స్వాతంత్య్ర సమరవీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విజయగాథను ‘సైరా’గా వెండితెరపైకి తీసుకొచ్చారు రామ్‌చరణ్‌. తన తండ్రి చిరంజీవి కన్న కల కోసం దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చిత్రాన్ని నిర్మించి సినీప్రియులకు గొప్ప కానుకిచ్చారు. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి తొలి షో నుంచే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి ఒదిగిపోయిన తీరుకు, క్లైమాక్స్‌లో ఆయన పలికిన సంభాషణలకు సినీప్రియులు జేజేలు పలుకుతున్నారు. అయితే ఈ చిత్రంలో ఆయనతో పాటు అమితాబ్, నయనతార, తమన్నా, అనుష్క, విజయ్‌ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు తదితరులంతా కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి కథ మొత్తం చిరు చుట్టూనే తిరుగుతున్నా.. వీళ్ల పాత్రలు తెరపై మెరిసేది కొద్దిసేపైనా.. ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేస్తున్నారు వీళ్లంతా. తెరపై ఎంత సేపు కనిపించారన్నది ముఖ్యం కాదు.. ఆ పాత్రలకు తమదైన నటనతో ఎంతటి విలువ చేకూర్చారన్నదే లక్ష్యంగా అద్భుత అభినయాలతో అదరగొట్టారు. మరి తెరపై వాళ్ల పాత్రలు ఎలా పండాయో ఓసారి పరిశీలిస్తే..


*
గురువు పాత్రలకే వన్నె తెచ్చిన బిగ్‌బి..
‘సైరా’లో చిరు గురువు గోసాయి వెంకన్నగా కీలక పాత్రలో సందడి చేశారు బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌. నిజానికి ఇందులో ఆయనకున్న సన్నివేశాలు తక్కువైనా.. కనిపించిన ప్రతిసారి తనదైన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా ‘సైరా’కు తన లక్ష్య సాధనకు మార్గం చూపించే సన్నివేశాల్లో ఆయన పలికిన సంభాషణలు, కళ్లతోనే ఆయన భావోద్వేగాలు పలికించిన తీరు హైలైట్‌గా కనిపిస్తాయి. చాలా ప్రశాంతమైన లుక్స్‌తో ఆకట్టుకునేలా కనిపిస్తూ గురువు పాత్రలకే వన్నె తెచ్చినట్లుగా దర్శనమిచ్చారు. ఆయన ఈ పాత్ర కోసం రూపాయి పారితోషికం కూడా తీసుకోలేదని చిరు తాజాగా తెలియజేశారు.

                                                             

*
అదరగొట్టిన స్వీటీ ఝాన్సీ..
‘సైరా’లో స్వీటీ అనుష్క నటిస్తుందనగానే అందరిలోనూ ఓ తెలియని ఆసక్తి ఏర్పడిపోయింది. నిజానికి ఈ చిత్రం విడుదల కాకముందే ఆమె ఝాన్సీ లక్ష్మీభాయి పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రేక్షకులకు తెలిసిపోయింది. కానీ, సినిమాలో ఆమె కనిపించేది కొద్దిసేపే. ఉయ్యాలవాడ కథ ప్రారంభం.. ముగింపు ఆమె కథతోనే ముడిపడి ఉంటాయి. ఆమె కనిపించేది కూడా ఆ రెండు సన్నివేశాల్లోనే. కానీ, తెరపై ఆమె పాత్ర ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఆ పాత్ర పూర్తయ్యే వరకు ఝాన్సీ పాత్రలో ఆమె పలికించిన హావభావాలు, ఆమె చూపించిన రాజసం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అనుష్క కూడా బిగ్‌బిలాగే ఈ పాత్ర కోసం ఎలాంటి పారితోషికం అడగలేదట.


*
అదరహో అనిపించిన తమన్నా..
తమన్నా ఈ చిత్రంలో ఉయ్యాలవాడ ప్రియురాలిగా లక్ష్మీ అనే నాట్యకారిణి పాత్రలో కనిపించింది. వాస్తవానికి ఈ చిత్రంలో కథానాయికగా నయనతార పేరే గట్టిగా వినిపించినప్పటికీ, తెరపై ఆ పాత్రని డామినేట్‌ చేసేలా కనిపించింది తమన్నానే. నరసింహారెడ్డి పెళ్లి రహస్యం తెలిశాక.. తన ప్రేమను త్యాగం చేసే సన్నివేశాల్లో, ‘సైరా’ టైటిల్‌ గీతాల్లో ఆమెలోని నటన ఓ స్థాయిలో దర్శనమిస్తుంది. ఇక క్లైమాక్స్‌కి ముందు ఆమె పాత్ర ఆత్మబలిదానం చేసుకుని శ్వేతజాతీయులను మట్టుబెట్టే సన్నివేశాలు సినీప్రియులకు ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తాయి.

                                                 

*
అవుకు రాజు అదరగొట్టాడు..
‘సైరా’ చిత్రంలో అవుకురాజుగా కనిపించి సందడి చేశారు కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌. తొలి భాగంలో ఉయ్యాలవాడ అంటే గిట్టని వ్యక్తిగా ఆయనపై పగ సాధించాలనే తపనతో రగిలిపోతూ ఎంత చక్కటి అభినయాన్ని ప్రదర్శించారో.. ద్వితియార్థంలో ఉయ్యాలవాడకు నమ్మిన బంటులా అంతే చక్కటి నటనను చూపించారు. తన పాత్రలోని ఈ రెండు కోణాలు ఎంతో వైవిధ్యంగా ప్రదర్శించి మెప్పించారు.

                                               

*
రాజసం చూపించిన రాజ పాండీ..
తెల్లజాతీయులపై ‘సైరా’ జరుపుతున్న పోరుతో స్ఫూర్తి పొంది.. ఆయన వెన్నంటి నడిచే ప్రధాన అనుచరుడిగా మారిపోతాడు తమిళ ప్రాంత రాజు రాజపాండి. ఆ పాత్రనే సినిమాలో విజయ్‌ సేతుపతి పోషించారు. సైరాకు నమ్మిన బంటుగా ఉంటూ.. ఆయన్ని చంపేందుకు రవికిషన్‌ కుట్ర పన్నినప్పుడు దాన్ని బట్టబయలు చేసే సన్నివేశాల్లో అద్భుతమైన నటనతో అదరహో అనిపించాడు సేతుపతి. ఇక క్లైమాక్స్‌లో తెల్లవారితో పోరులో బ్రహ్మాజీని రక్షించి తాను ప్రాణాలు కోల్పోయే సన్నివేశాల్లో ప్రతిఒక్కరితో కంటతడి పెట్టించారు సేతుపతి.

                                                   

*
జగ్గూభాయ్‌ కట్టప్పగా మారిన వేళ..
‘సైరా’లో అన్ని పాత్రలదీ ఒకెత్తయితే జగపతిబాబుది మరొక ఎత్తు. ఆయనీ చిత్రంలో వీరారెడ్డి అనే పాలెగాడిగా తెరపై దర్శనమిచ్చాడు. సినిమా మొదటి నుంచి ఉయ్యాలవాడకు అండగా నిలుస్తూ.. చివర్లో ఒక్కసారిగా ఆయనకి వెన్నుపోటు పొడిచే కట్టప్పలా మారతాడు. కానీ, ఆఖరికి తన తప్పు తెలుసుకోని ఉయ్యాలవాడ కళ్ల ముందే ఆత్మహత్యకు పాల్పడి తన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. ఈ నేపథ్యంగా వచ్చే సన్నివేశాల్లో ఆయనలోని విలనిజం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. ముఖ్యంగా తన తప్పుతాను తెలుసుకోని ఆత్మహత్యకు పాల్పడే సందర్భంలో తన నటనతో ‘బాహుబలి’లోని రమ్యకృష్ణ పాత్రను గుర్తు చేస్తారు జగపతిబాబు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.