యాస... లెస్సగా పలుకుతోంది

భాష ఒక్కో చోట ఒక్కో అందంతో వినిపిస్తుంది. తెలుగు కూడా అంతే. ఆయా మాండలికాలతో ప్రత్యేకమైన యాసని సంతరించుకుని స్థానిక సొబగులతో వినిపిస్తుంటుంది. ఎవరెలా మాట్లాడినా... సినిమా వరకు వచ్చేసరికి ప్రామాణిక భాషే వినిపిస్తుంటుంది. అందరికీ అర్థం కావాలనేదే ఆ ప్రయత్నం. దాంతో మాండలికాలు, యాసలు మనం మాట్లాడుకోడానికే పరిమితమయ్యేవి. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు సినిమాల్లో యాస విరివిగా వినిపిస్తోంది. తొలినాళ్లలో హాస్య పాత్రలు... ప్రతినాయక పాత్రలతోనే యాసల్ని వినిపించేవాళ్లు. ఇటీవల నాయకానాయికల పాత్రలు సైతం యాసని లెస్సగా పలుకుతున్నాయి. కొన్ని సినిమాలకు ఆయా యాసలే ప్రధానాకర్షణగా నిలుస్తూ... పాత్రలకి, కథలకి అందాన్ని తెస్తున్నాయి.

నవతరం దర్శకులు మనవైన కథలు చెప్పడంపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. మన మట్టిలో నుంచి పుట్టిన కథలు అవి. వాటికి సహజత్వం రావాలంటే అందులోని పాత్రలు మాట్లాడే భాష కూడా స్థానికతకి అద్దం పట్టేలా ఉండాల్సిందే. దాంతో దర్శకులకి యాస ప్రధాన అస్త్రంగా మారుతోంది.

ఓ కథానాయకుడు నన్ను ఒగ్గెయ్యే అంటూ శ్రీకాకుళం యాస మాట్లాడతాడు. మరో కథానాయకుడు ఈడా ఉంటా ఆడా ఉంటా అంటూ తెలంగాణం వినిపిస్తాడు. ఓ కథానాయిక పుక్కట్ల నేనేం తీసుకోనంటూ సందడి చేస్తుంది. ఇంకొకరు ఏందప్పా అంటూ మాటల్లో సీమ పౌరుషం చూపిస్తాడు. ఇలా తెరపై కనిపించే పాత్రలన్నీ కూడా అచ్చమైన యాస మాట్లాడటం విని పులకరించిపోవడం ప్రేక్షకుల వంతు అవుతోంది. ఒకొక్క యాసలో ఒకొక్క అందం ఉంటుంది కాబట్టి... ఆ ప్రభావం తెరపైన కనిపించే పాత్రల్లోనూ కనిపిస్తుంటుంది. పనిలోపనిగా ఆయా ప్రాంతాల్లో వినిపించే జానపదాల్ని కూడా సినిమాల్లో విరివిగా వినియోగిస్తున్నారు. దాంతో మన మాట... మన పాటతో సినిమా కూడా మన సొంతం అనే భావన కలిగిస్తోంది.


తారల సన్నాహాలు

ఈమధ్య విడుదలైన ‘పలాస 1978’లో శ్రీకాకుళం యాస వినిపించింది. అందులో పాత్రలన్నీ స్థానిక జనాలు మాట్లాడుకునే భాషనే వినిపించాయి. ‘కేరాఫ్‌ కంచరపాలెం’ కూడా ఉత్తరాంధ్ర పలుకులతో రూపుదిద్దుకున్నదే. ఆయా యాసల కోసం నటీనటులు ప్రత్యేకంగా కసరత్తులు చేస్తుంటారు. నిపుణుల దగ్గర శిక్షణ తీసుకుని మరీ కెమెరా ముందుకొస్తుంటారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ తన కొత్త చిత్రం కోసం చిత్తూరు జిల్లా యాసలో పట్టు పెంచుకునే పనిలో ఉన్నారు. ఆయనకి ఆ యాస నేర్పించడంకోసం దర్శకుడు సుకుమార్‌ ఓ ప్రత్యేక బృందాన్నే నియమించారు. గోపీచంద్‌ నటిస్తున్న ‘సీటీమార్‌’లో తమన్నా తెలంగాణ యాసతో సందడి చేయనుంది. రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’లో గోదావరి యాసని వినిపించారు. ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత’లో సీమ యాస పలికి పౌరుషం ప్రదర్శించారు. నాగార్జున ‘రాజన్న’లో తెలంగాణం, ‘రగడ’లో రాయలసీమ మాండలికంలో సంభాషణలు చెప్పారు. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’, ‘అర్జున్‌రెడ్డి’ తదితర చిత్రాలకి యాసే అలంకారంగా నిలిచింది. వెంకటేష్‌ నటిస్తున్న ‘నారప్ప’ రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది. అందులో కొన్ని పాత్రలైనా రాయలసీమ యాసలో మాట్లాడే అవకాశాలున్నాయి. నాగచైతన్య, సాయిపల్లవి నటిస్తున్న ‘లవ్‌స్టోరీ’లో తెలంగాణ యాసే హైలెట్‌గా నిలవనుందని సమాచారం. ‘ఫిదా’,‘ఎంసీఏ’లోనూ తెలంగాణ మాటనే వినిపించింది సాయిపల్లవి. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో రామ్‌ హైదరాబాద్‌ యాసనీ, నభా నటేష్‌ వరంగల్‌ అమ్మాయిలా మాట్లాడుతూ గడుసుదనాన్నీ ప్రదర్శించారు. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ‘విరాటపర్వం’లో కూడా చాలా పాత్రలు తెలంగాణలోనే మాట్లాడతాయని సమాచారం.

షరతులు వర్తిస్తాయి

సినిమాల్లో భాష, యాసల విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిందే అంటున్నారు దర్శకులు. మాటల్లో సొగసు వినిపించాలి, అదే సమయంలో అన్ని ప్రాంతాల వాళ్లకీ అర్థమయ్యేలా ఉండాలని వారు చెబుతున్నారు. ‘పలాస 1978’ దర్శకుడు కరుణకుమార్‌ మాట్లాడుతూ ‘‘పాత్రల స్వభావాన్ని బట్టి వాటి మాటలు ఉండాలి. అందుకే మా చిత్రంలో స్థానిక భాషలోని కొన్ని తిట్లు కూడా వినిపిస్తాయి. మా సినిమాలో శ్రీకాకుళం యాస సొగసు వినిపిస్తుంది తప్ప మరీ అర్థం కాని రీతిలో భాషని వినియోగించలేదు. బేపి బీపిని బక్కిరీసింది అనేది శ్రీకాకుళం మాటే. కుక్క వచ్చి వీపుమీద రక్కేసి వెళ్లిపోయిందని దాని అర్థం. కానీ అదే భాష సినిమాలో వాడామంటే ఎవరికీ అర్థం కాదు. ఏ మాండలికంలోనైనా చిన్న విరుపు, సంగీతం ఉంటుంది. దాన్ని వినిపిస్తేనే అందంగా ఉంటుంది’’ అన్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.