అమితాబ్‌ ఆల్బమ్‌లో... అనుభూతుల ఆనవాళ్లు!
ఒక్క ఫొటో వంద మాటలకు సమానం అంటారు. అదే పాత ఫొటోల విషయానికి వస్తే ఒకొక్కటి వెయ్యి అనుభూతులకు నిలయమని చెప్పొచ్చు. ఆల్బమ్‌లోని ఫొటోలను తిరగేస్తుంటే మనసు పొరల్లో ముద్రించుకుపోయిన మధుర జ్ఞాపకాలు సజీవంగా కళ్లముందు మెదులుతుంటాయి. అందుకే చాలా మందికి తమ పాత ఫొటోలను సన్నిహితులతోనో స్నేహితులతోనే పంచుకోవడమంటే భలే మక్కువ. ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ తన పాత ఫొటోలను పంచుకుంటూ, ఆయా సందర్భాల్లోని జ్ఞాపకాలను అభిమానులతో నెమరువేసుకుంటుంటారాయన. 76 ఏళ్ల జీవితంలో, 50 ఏళ్ల సుదీర్ఘ నట ప్రస్థానంలో అమితాబ్‌కు అంతులేని ఆనందకర క్షణాలు, మరచిపోలేని విషాద సంఘటనలు, తిరుగులేని విజయాలు, సాటిలేని అభిమానాన్ని రుచిచూశారు. ఆ అనుభూతులను కళ్ల ముందుంచే కొన్ని ఫొటోలివీ.


*
1. ‘గంగా కీ సౌగంధ్‌’ చిత్రీకరణ హృషికేష్‌లో జరగుతున్నప్పుడు అక్కడున్న ఓ కోతికి అమితాబ్‌ ఆకలి తీరుస్తున్నప్పటి దృశ్యమిది. అప్పుడు ఇంకో కోతి వచ్చి తనను పట్టించుకోనందుకు తన మొహం మీద కొట్టిందని గుర్తు చేసుకున్నారు అమితాబ్‌.


*
2. అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో ఓ సినిమా కోసం 1968లో తీయించుకున్న స్టిల్‌ ఇది. ఇది చూశాక నాకు ఆ అవకాశం రాకపోవడంలో ఆశ్చర్యమేముంది అని చమత్కరించారు అమితాబ్‌.


*
3. అమితాబ్‌ జీవితంలో అతి పెద్ద విషాదం ‘కూలీ’ చిత్రీకరణలో జరిగిన ప్రమాదం. ప్రాణాపాయ స్థితిలో కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో గడిపారాయన. ఆయన ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ దేశవ్యాప్తంగా అభిమానులు పూజలు చేశారు.
ఓరకంగా ఈ సంఘటనతోనే అమితాబ్‌కు ప్రేక్షకుల్లో ఎంత ఆదరణ ఉందో అందరికీ తెలిసొచ్చింది. ఆ ప్రమాదం తర్వాత ఆరోగ్యం కోలుకున్నాక ఇంటికి తిరిగొచ్చిన అమితాబ్‌ తన తండ్రి హరివంశ్‌రాయ్‌ బచ్చన్‌ పాదాలకు నమస్కరిస్తున్నప్పటి ఫొటో ఇది. ఆ సమయంలో తన తండ్రి కన్నీరు పెట్టుకున్నారని, ఆయనను అలా చూడటం జీవితంలో అదే మొదటిసారని చెప్పారు అమితాబ్‌. ఫొటోలో బుల్లి అభిషేక్‌ బచ్చన్‌నూ చూడొచ్చు.


*
4. ‘ఇంక్విలాబ్‌’ సినిమా షూటింగ్‌లో స్విమ్మింగ్‌ పూల్‌ సన్నివేశంలో అతిలోక సుందరి శ్రీదేవితో అమితాబ్‌


*
5. ‘ఖూన్‌ పసీనా’ చిత్రీకరణలో నిజమైన పులితో పోరాడుతున్న అమితాబ్‌. ఆ సీన్‌ చిత్రీకరిస్తున్న సమయంలోనే అమితాబ్‌ సతీమణి జయా బచ్చన్‌ పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరారన్న వార్త అందింది. కొడుకు పుడితే టైగర్‌ అని పేరుపెట్టమని యూనిట్‌ సభ్యులు సరదాగా అన్నారట. అన్నట్లుగానే కుమారుడు పుట్టాడు. అతడే అభిషేక్‌ బచ్చన్‌.


*
6. అమెరికాలో 1983లో కాన్సర్ట్‌ నిర్వహించినప్పుడు తన సతీమణి జయా బచ్చన్‌తో కలసి అమితాబ్‌ హుషారుగా స్టెప్పులేసి అభిమానులను అలరించారు. ఆ సందర్భంలోనే తన శ్రీమతిని ఇలా ఎత్తుకుని ఆశ్చర్యపరిచారు.


*
7. దేశ అత్యున్నత పౌరపురస్కారాలైన పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్‌ అందుకుంటున్న మధుర క్షణాలు. అమితాబ్‌ అప్రతిహత ప్రస్థానం గురించి చెప్పాలంటే ఈ మూడు ఫొటోలు చాలు.


*
8. ఎనిమిదేళ్ల వయసులో జీవితంలో తొలిసారి సూటు వేసుకుని, టై ధరించి టిప్‌టాప్‌గా రెడీ అయి తన తల్లితో కలసి ఇలా పోజిచ్చారు అమితాబ్‌. అచ్చం కాబోయే హీరోలా ఉన్నాడు కదూ.


*
9. అమితాబ్‌ కెరీర్‌లో తిరుగులేని విజయాన్ని సాధించిన చిత్రం ‘డాన్‌’. ఆ సినిమా షూటింగ్‌లోని స్టిల్‌ ఇది. ఆ కళ్లజోడు అమితాబ్‌ కోసం ప్రత్యేకంగా తెప్పించారట.


*
10. ‘షోలే’లోని ‘యే దోస్తీ హమ్‌ నహీ ఛోడేంగే..’ పాట ఎంత పాపులరో... అందులో అమితాబ్, ధర్మేంద్ర వాడిన మూడు చక్రాల బైక్‌ కూడా అంతే పాపులర్‌. ఆ పాటను బెంగళూరు రోడ్లపై చిత్రీకరిస్తున్నప్పటి చిత్రమిది.


*
11. ‘షోలే’లో జైలు సీన్లు తీస్తున్నప్పుడు ఖైదీ దుస్తుల్లో అమితాబ్, ధర్మేంద్ర.


* 12. అభిషేక్‌ బచ్చన్‌ పుట్టినప్పుడు ఆసుపత్రిలో పుత్రోత్సాహంతో అమితాబ్‌. ఈ బుజ్జాయి 6 అడుగుల 3 అంగుళాల ఎత్తు ఎదుగుతాడని అప్పుడూహించలేదని చమత్కరించారు అమితాబ్‌.


*
13. అమితాబ్‌కు ప్రతి దశలోనూ వెన్నంటి ఉంటూ అర్ధాంగికి అసలైన నిర్వచనంలా ఉంటుంది జయా బచ్చన్‌. ఆమె యవ్వనంలో అందంగా ఉన్నప్పటి ఫొటోనూ పంచుకున్నారు అమితాబ్‌. ‘శ్రీమతి... నా శ్రీమతి కాక ముందు..’ అని సరదాగా క్యాప్షన్‌ ఇచ్చారు.


*
14. ఆపత్కాలాల్లో తన వంతు సాయమందించడానికి ముందుంటారు అమితాబ్‌. అప్పుడప్పుడు దాతృత్వ కార్యక్రమాలకు హాజరవుతూ అండగా నిలుస్తారు. అప్పట్లో దిల్లీలో నిర్వహించిన ఓ ఛారిటీ క్రికెట్‌ మ్యాచ్‌లో పాల్గొన్న హుషారు నింపారు. ఆ సందర్భంలోని చిత్రమిది.


*
15. ఓ హాస్య సినిమా లుక్‌ టెస్ట్‌ కోసం విచిత్ర హావభావాలతో అమితాబ్‌ ఇచ్చిన పోజులివి. తన పాత్ర కోసం ఆయన ఎంత తపిస్తారో ఇవి చూస్తేనే అర్థమవుతోంది.


*
16. కాలం గడచినా, దేశం దాటినా అమితాబ్‌ పట్ల అభిమానుల ఆదరణలో ఎలాంటి మార్పూ లేదు. ఇప్పటికీ అమితాబ్‌ దర్శనం కోసం ముంబయిలోని ఆయన ఇళ్లు ‘జల్సా’ ముందు ఎంతో మంది గుమికూడుతుంటారు. వారిని నిరాశపర్చకుండా ప్రతి ఆదివారం తన ఇంటి దగ్గరకు వచ్చిన అభిమానులకు దర్శనమిస్తుంటారు. విదేశాల్లోనూ ఆయనకు అంతే ఆదరణ ఉంది. ఇక్కడ నలుపు తెలుపులో ఉన్న ఫొటో 1986లో మాస్కోలో తీసినది. అమితాబ్‌ ఆటోగ్రాఫ్‌ కోసం అభిమానులు ఎగబడుతుండటాన్ని అందులో చూడొచ్చు. రంగుల్లో ఉన్న ఫొటో 2017లో తన ఇంటి వద్ద తీసినది. అమితాబ్‌ను ఫొటోల్లో బంధించడానికి పోటీపడుతున్న అభిమానులను అందులో చూడొచ్చు. అమితాబ్‌ ఇప్పటికీ సూపర్‌స్టార్‌ అనేందుకు ఇదే తిరుగులేని నిదర్శనం.సి.హెచ్.నాగార్జునCopyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.