అంచనాలు పెంచుతున్న మద్దుగుమ్మలు!

కథానాయకుడు - దర్శకుడు... ఈ కలయికే సినిమాలపై అంచనాలకు కారణమవుతుంది. అయితే కథానాయికల పాత్ర మాత్రం అంచనాలు పెంచడంలో పెద్దగా కనిపించదు. హిట్టు కొట్టిన నాయకానాయికలు మళ్లీ కలిసి నటిస్తున్నప్పుడు మాత్రమే ఆసక్తి ఏర్పడుతుంటుంది. అందుకే కథానాయికలు ఒక మంచి కలయికని చూసుకొని సినిమాలో భాగమవుదాం అని ఆలోచిస్తుంటారు. కానీ ఈమధ్య ఆ వరస మారింది. కలయికకి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో... కథలకూ అంతే ప్రాధాన్యం ఇస్తున్నారు. మంచి కథ దొరకే వరకూ వేచిచూస్తున్నారు. కథల విషయంలో తమ అభిరుచిని చూపుతుండడంతో కథానాయికల పరంగానూ అంచనాలు పెరుగుతున్నాయి.


కథానాయికల కెరీర్‌ పరిధి పరిమితం. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆలోచనతో అడుగులేస్తుంటారు. కథలు, పాత్రల ప్రాధాన్యం కన్నా మొదట అవకాశాల్ని చేజిక్కించుకోవడంపైనే దృష్టిపెడుతుంటారు. అయితే నవతరం కథానాయికల్లో చాలామంది ఆ తరహా ఆలోచనలకి భిన్నంగా అడుగేస్తున్నారు. ఆచితూచి కథల్ని ఎంపిక చేసుకొంటున్నారు. తాము చేసే ప్రతి సినిమా గురించీ ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకొనేలా చేస్తున్నారు. సమంత, కీర్తి సురేష్‌, అనుష్క, నయనతార, కాజల్‌, తమన్నా, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తదితర భామలంతా కూడా అదే దారిలోనే ఉన్నారు.

సమంత ఈ యేడాది ‘రంగస్థలం’, ‘మహానటి’, ‘అభి మన్యుడు’ చిత్రాలతో విజయాల్ని అందుకొన్నారు. త్వరలోనే ‘యు టర్న్‌’తో సందడి చేయబోతున్నారు. ఆమె గతేడాది ఎంపిక చేసుకొన్న సినిమాలే ఇవన్నీ కూడా. కొత్త కథల విషయంలో మాత్రం ఆమె తొందరపడటం లేదు. శివ నిర్వాణ దర్శకత్వంలో కథకి మాత్రమే పచ్చజెండా ఊపారు. ‘‘చేతిలో రెండు మూడు సినిమాలైనా లేకపోతే ఎలా అనే ఒక రకమైన అభద్రతాభావంతో ఆలోచించేదాన్ని. కానీ గత రెండేళ్లుగా ఆ తరహా ఆలోచనలే దరి చేరకుండా స్వేచ్ఛగా కథల్ని ఎంపిక చేసుకొంటున్నా. కథే ప్రామాణికంగా సినిమాలు చేస్తున్నా. దాంతో నా నటనలో ఓ కొత్త కోణం వెలుగులోకి వచ్చినట్టైంది. ఇకపై నటిగా మరింత జాగ్రత్తగా అడుగులేయాలి’’ అంటోంది సమంత. అనుష్క ‘బాహుబలి’ చిత్రాల తర్వాత ‘భాగమతి’ చేశారు. ఆ తర్వాత ఆమె కొత్త సినిమాల విషయంలో అసలేమాత్రం తొందరపడటం లేదు. కీర్తి సురేష్‌ ‘మహానటి’ తర్వాత తెలుగులో ఒప్పుకొన్నది ‘ఎన్టీఆర్‌’ మాత్రమే. అందులో సావిత్రి పాత్రలోనే కీర్తి నటించబోతోంది. నయనతార తెలుగులో ‘సైరా నరసింహారెడ్డి’లో నటిస్తున్నారు. ఆమె తమిళంలో కథా నాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు చేస్తూ అలరిస్తోంది. తెలుగు నుంచి ఎన్ని అవకాశాలొచ్చినా ఒప్పుకోని ఆమె ‘సైరా నరసింహారెడ్డి’లో పాత్ర నచ్చడంతోనే అంగీకరించారు. కాజల్‌, తమన్నా ఒప్పుకోవాలి కానీ... వాళ్లకు అవకాశాలకి కొరత ఉండదు. కానీ వాళ్లూ ఈ యేడాదిలో కొన్ని సినిమాల ఫలితం దృష్ట్యా ఆచితూచి అడుగులేస్తున్నారు. తమన్నా ‘సైరా నరసింహారెడ్డి’లో ఓ కీలక పాత్రతో పాటు, ‘ఎఫ్‌2’లో నటిస్తోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఇదివరకు ‘ఖాళీగా ఉండటం కంటే ఏదో ఒక సినిమా చేయడం మేలు కదా?’ అనేవారు. కానీ ఇకపై వేగం తగ్గిస్తా అంటోంది. రాశి కంటే వాశి ముఖ్యమని, ఇకపై మంచి కథలు మాత్రమే చేయాలని నిర్ణయించుకొన్నా అంటోంది. ఆమె ‘ఎన్టీఆర్‌’లో శ్రీదేవిగా నటించడానికి ఒప్పుకొన్నారు.


ఇదివరకు ఐదారేళ్లకి మించి సినిమాలు చేసేవాళ్లు కాదు కథానాయికలు. కానీ ఇప్పుడు పదేళ్లుగా సినీ ప్రయాణం చేస్తున్నవారు చాలామందే కనిపిస్తున్నారు. అందుకే నవతరం కథానాయికలు తొందరపడకుండా మంచి కథల్నే ఎంపిక చేసుకొని, ప్రేక్షకుల మనసుల్లో గుర్తుండిపోయే పాత్రలే చేద్దాం అనుకుంటున్నారు. అందుకే వాళ్ల సినిమాలపై అంచనాలు పెంచేసుకుంటున్నారు ప్రేక్షకులు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.