‘అరణ్య’వాసం కోసం రానా తపన!
న తాతముత్తాతలు చూసిన జంతువుల్లో సగం మన అయ్యలు చూడలేదు. మన అయ్యలు చూసిన వాటిలో సగం జంతువుల్ని మనం చూళ్లేదు. మనం చూసిన జంతువుల్ని మన వెనకాల తరం చూస్తారో లేదో తెలియదు. ఎప్పటికప్పుడు అంతరించి పోతున్న జంతువుల్ని కాపాడటానికి ఒక అడవి మనిషి పూనుకున్నాడు. అతని పేరు... అరణ్య. తుర్ర్‌ర్ర్‌ తు తు తు... అంటూ వన్య ప్రాణులతో మమేకమయ్యాడు. అడవే జీవితంగా బతికాడు. మరి అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయో తెలియాలంటే ఏప్రిల్‌ 2న వస్తున్న ‘అరణ్య’ చూడాల్సిందే. రానా దగ్గుబాటి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. తమిళంలో ‘కాడన్‌’గా, హిందీలో ‘హాథీ మేరే సాథీ’గా రూపొందింది. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ నిర్మించింది. సాహసాలతో కూడిన కథ ఇది. ఈ చిత్రం కోసం రానా రెండున్నరేళ్లు అడవిలో ఏనుగుల మధ్య తిరిగారు. వాటిని మచ్చిక చేసుకున్నారు. 30 కిలోల బరువు తగ్గారు. ఆ ప్రయాణం వెనక విశేషాలివీ...


పాత్రలకి తగ్గట్టుగా తనని తాను మార్చుకోవడంలో దిట్ట రానా. ‘బాహుబలి’ చిత్రాల కోసం ఆయన కండలు తిరిగిన దేహంతో సిద్ధమై కెమెరా ముందుకెళ్లారు. బాహుబలికే చెమటలు పట్టించిన ఆయన రూపం ప్రేక్షకులకు నచ్చింది. ఇప్పుడు ‘అరణ్య’ కోసం ఆయన మరోసారి తనని తాను మార్చుకున్నారు. కఠినమైన ఆహార నియమాలు, శిక్షణతో 30 కిలోల బరువు తగ్గారు. సినిమా అంతా ఒకవైపు వంగినట్టుగా ఉండే భుజంతోనే కనిపించబోతున్నారాయన. బాగా పెరిగిన గెడ్డం, బూడిద రంగులో కనిపించే జుట్టుతో ఆయన పాత్ర ఉంటుంది.

రానా పాత్ర కోసం పలు రకాల లుక్స్‌ ప్రయత్నించారట దర్శకనిర్మాతలు. అయితే ఏ లుక్‌ ఖాయం చేశారనే విషయం రానాకి సెట్లోకి వెళ్లే వరకు చెప్పలేదట. ‘‘దర్శకుడు ప్రభు సాల్మన్‌ నా పాత్రకి సంబంధించిన ప్రతిదీ సహజంగా ఉండాలని భావించారు. అందుకే బరువు తగ్గమన్నారు. ఎప్పుడూ దృఢంగా ఉండాలనుకునే నేను ఆ స్థాయిలో బరువు తగ్గాల్సి రావడం సవాల్‌గా అనిపించింది. అరణ్య పాత్ర కోసం సన్నగా మారడం కోసం చేసిన ప్రయత్నం ఓ గొప్ప అనుభవం’’ అన్నారు రానా.


అరణ్య పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం గురించి రానా మాట్లాడుతూ ‘‘ఈ పాత్ర కోసం నేను అడవిలో గడుపుతూ ఏనుగులను మచ్చిక చేసుకోవడం మొదలుపెట్టా. అప్పుడే ఈ అడవి మనిషి ఎలా ఉండాలో, ఎలా ఉంటాడో అర్థమైపోయింది. అలా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశా’’ అని చెప్పారు. సినిమా చిత్రీకరణను ఇండియా, థాయ్‌లాండ్‌ సహా ఆరేడు దేశాల్లోని అడవుల్లో తీశారు. కొన్ని నెలల పాటు రానా అడవుల్లో కేవలం ఏనుగులతో మాత్రమే కలిసి నటించాల్సి వచ్చింది. దాదాపు 30 ఏనుగులతో కలిసి నటించే సన్నివేశాలు కూడా ఉన్నాయి. అడవుల్లో ఉన్నంత కాలం సెల్‌ఫోన్‌ కూడా చూడకుండా గడపాల్సి వచ్చిందని, ఈ షూటింగ్‌ వల్ల మనిషిగా, నటుడిగా కూడా చాలా నేర్చుకున్నానని రానా చెబుతున్నారు.

కథ ఇదీ...
1300 ఎకరాల అడవిని ఒక్కడే పెంచి, పద్మశ్రీ అవార్డు అందుకునే స్థాయికి ఎదిగిన సామాన్య వ్యక్తి జాదవ్‌ ప్రియాంక్‌ నిజ జీవిత కథను స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రం తీశారు. అసోంలోని కజిరంగా ప్రాంతంలో ఉన్న ఏనుగుల ఆవాసాన్ని మనుషులు కబ్జా చేసిన దురదృష్టకర ఘటన ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఈ చిత్రంలో రానా అడవికే తన జీవితాన్ని అంకితం చేసిన అరణ్య అనే పాత్రలో కనిపిస్తాడు. అడవిలో నివసించే జంతువుల్ని కాపాడాలనే ఏకైక లక్ష్యంతో అరణ్య పాత్ర కనిపిస్తుంది. వన్యప్రాణుల్నీ, ప్రకృతినీ కాపాడుకోవడానికి జరిగిన ఘర్షణలో అరణ్య పోరాటం ఎలా సాగిందన్నది ఈ సినిమాలో చూడొచ్చు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.