‘ఆర్య’కు 16 ఏళ్లు

వన్‌సైడ్‌ లవ్‌కి కొత్త అర్థం చెప్పిన చిత్రం ‘ఆర్య’. సుకుమార్‌- అల్లు అర్జున్‌ కలయికలో వచ్చిన సినిమా ఇది. తొలి ప్రయత్నంలోనే అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు సుకుమార్‌. ఎవరు ఊహించని రీతిలో విజయం అందుకున్నాడు. అప్పట్లో ఓ సంచలనం సృష్టించాడు. టాలీవుడ్‌లో ఎన్ని ప్రేమకథలు వచ్చినా, భవిష్యత్తులో రాబోతున్నా.. ‘ఆర్య’ ప్రేమ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. ఆర్యగా అర్జున్, గీతగా అనురాధ మెహతా ఒదిగిపోయారు. అజయ్‌ పాత్రలో శివ బాలాజీ నటన ఆకట్టుకుంది. కథకు తగిన సంగీతం అందించి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు దేవీ శ్రీ ప్రసాద్‌. ఇందులోని ప్రతి పాట ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది. ముఖ్యంగా ‘ఫీల్‌ మై లవ్‌’, ‘నువ్వుంటే’, ‘అ అంటే అమలాపురం’ గీతాలు శ్రోతల్ని విపరీతంగా అలరించాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రం 16 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2004 మే 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. సుక్కు-బన్నీ కాంబినేషన్‌కి అప్పటి నుంచే మంచి క్రేజ్‌ ఏర్పడింది. ఈ కలయికలో ‘ఆర్య 2’ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాతో హ్యాట్రిక్‌ కొట్టబోతున్నారు.






Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.