గొంతెమ్మ కోరికలతో ఇబ్బంది పెడుతున్నారు
మహేష్‌ బాబు - అనిల్‌ రావిపూడి సినిమా ఓకే అయిపోయింది..!
- అయితే హీరోయిన్‌ ఎవరు?
???

బోయపాటి శ్రీనుతో బాలకృష్ణ మరో సినిమా చేస్తున్నాడోచ్‌..

- బాగానే ఉంది... మరి కథానాయిక ఖరారైందా? లేదా?
???
నాగ్‌ ‘మన్మథుడు 2’గా మారబోతున్నాడు తెలుసా?
- మరి జోడీ ఎవరితో..?

????

... అదండీ సంగతి! సినిమాలైతే ‘ఓకే’ అయిపోతున్నాయి. కాంబినేషన్లు సెట్టయిపోతున్నాయి. కానీ కథానాయికల దగ్గరే అసలు సమస్య వచ్చి పడిపోతోంది. ‘మీ సినిమాలో హీరోయిన్‌ ఎవరు’ అని అడిగితే చాలు నిర్మాతలు మౌనం వహిస్తున్నారు. ‘ప్రస్తుతం ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాం’ అంటూ సమాధానం దాటేస్తున్నారు. స్టార్‌ కథా నాయకుల సినిమాలకు సైతం నాయికల కొరత వచ్చిపడడం ఈమధ్య కాలంలో దర్శక నిర్మాతల్ని వేధిస్తున్న ప్రధాన సమస్య.


‘కథానాయికల కొరత’ అన్నది చాలా పాత మాట. ఎప్పటికప్పుడు ఈ సమస్యని అధిగమించడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఫలితం కనిపించడం లేదు. అగ్ర కథానాయికల్ని మళ్లీ మళ్లీ తీసుకుంటే... ‘రొటీన్‌’ అయిపోతోంది. అలాగని మరీ కొత్త కథానాయికలతో ప్రయోగాలు చేయలేరు. ఒకవేళ చేద్దామని ఉన్నా కావల్సిన సంఖ్యలో కథానాయికలను తయారు చేయలేకపోతున్నారు. బాలీవుడ్‌ నుంచి తీసుకొద్దామనే ప్రయత్నాలు జరుగుతున్నా పారితోషికాల పేరుతో వాళ్లంతా భయపెట్టేస్తున్నారు. అడిగినంత ఇద్దామన్నా.. డిమాండ్‌కి తగిన సప్లై అక్కడి నుంచి కూడా లేదు.


రాజమౌళి మల్టీస్టారర్‌లో కథానాయికలెవరన్న సంగతి ఇంకా తేలలేదు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలకు చోటుంది. చాలా పేర్లు వినిపించాయి. కానీ చిత్రబృందం ఎవ్వరినీ అధికారికంగా ప్రకటించలేదు. రాజమౌళి సైతం కథానాయికల ఎంపిక విషయంలో తర్జన భర్జనలు పడుతుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. నాగార్జున ‘మన్మథుడు 2’గా ముస్తాబవుతున్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.


ఇంత వరకూ నాయిక ఎవరన్నది చెప్పడం లేదు. మహేష్‌బాబు - అనిల్‌ రావిపూడి చిత్రానికి ఇద్దరు నాయికలు కావాలి. ఓ పాత్ర రష్మికకి దక్కింది. మరో పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదిస్తే... కాల్షీట్ల సమస్యతో ‘నో’ చెప్పింది. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది. కథానాయిక కోసం చాలా కసరత్తులు చేశారు. తిరిగి తిరిగి మళ్లీ పూజా హెగ్డేనే ఎంచుకోవాల్సివచ్చింది. ఆ పేరు కూడా ఖాయమో, కాదో ఇంత వరకూ తెలియలేదు.

హిట్‌ కాంబినేషన్‌ అనేది తరచూ వినిపించే మాట. హిట్టయిన చిత్రంలో కనిపించిన జోడీతోనే మరో సినిమా చేయడం అన్నమాట. సెంటిమెంట్‌ ప్రకారమే దర్శకులు ఇలా కాంబినేషన్లను మళ్లీ మళ్లీ చూపిస్తుంటారకునుంటారంతా. నిజానికి.. కథానాయికల కొరతని ‘హిట్‌ కాంబో’ పేరుతో ఏమారుస్తుంటారు.


అగ్ర నిర్మాణ సంస్థలు ఈ సమస్యని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాయి. హీరోయిన్ల కోసం ప్రకటనలు ఇవ్వడం, ఆడిషన్స్‌ నిర్వహించడం పనిగా పెట్టుకున్నాయి. ఇంత జరుగుతున్నా కావల్సిన సంఖ్యలో నాయికలు దొరకడం లేదు. తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమల్లోనూ నాయికల సమస్య ఉంది. అయితే మరీ ఈ స్థాయిలో లేదు. ‘‘సినిమా అంటే చాలా మందికి చిన్నచూపు. అందులోనూ కథా నాయికగా తమ ఇంటి అమ్మాయిని పంపించాలంటే భయం. కాస్టింగ్‌ కౌచ్‌లాంటి వివాదాలతో ఈ రంగంలోకి రావడానికి మరింతగా అమ్మాయిలు భయపడుతున్నారు. అందుకే తప్పని పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నాయికలతోనే సర్దుకుపోతున్నాం. చేతిలో హిట్లు లేకపోయినా, పారితోషికాలు పెంచేస్తున్నా వాళ్లనే భరించాల్సివస్తోంది. తమకున్న డిమాండ్‌ని గ్రహించి గొంతెమ్మ కోరికలతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు’’ అని ఓ అగ్ర నిర్మాత ‘ఈనాడు సినిమా’తో చెప్పారు.

విజయ్‌ దేవరకొండ, శర్వానంద్‌, నాని, నిఖిల్‌, అఖిల్‌, వరుణ్‌తేజ్‌ లాంటి యువ కథానాయకులకు మరో రకమైన సమస్య. వీళ్లకు స్టార్‌ కథానాయికలు అవసరం లేదు. కొత్తవారు దొరకడం లేదు. తమ మార్కెట్‌కి, ఇమేజ్‌కీ తగిన వాళ్లని వెదుక్కోవడం ఇబ్బందిగా మారుతోంది. దాదాపు కొత్త నాయికలతో చేయడానికే మొగ్గు చూపిస్తున్నారు. వాళ్లేమో ఒక్క హిట్టు పడగానే ‘స్టార్‌’ భ్రమల్లో తేలిపోతున్నారు. దాంతో ప్రతి సినిమాకీ కొత్త వాళ్లని జల్లెడపట్టడం ఓ ప్రహసనంగా మారుతోంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.