అందుకే ‘భద్ర’లో బన్నీ నటించలేదు

‘భద్ర.. ఎ ట్రూ లవర్‌’ అంటూ రవితేజ చేసిన సందడి ఎప్పటికీ మర్చిపోలేరు తెలుగు ప్రేక్షకులు. బోయపాటి శ్రీను ఈ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయమయ్యారు. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం అందుకుంది. తొలి ప్రయత్నమే బోయపాటికి ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. నాయిక మీరా జాస్మిన్‌ తన అందం, అభినయంతో యువత హృదయాలు దోచుకుంది. రవితేజ హుషారైన నటన ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. దేవీశ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రతి పాట విపరీతంగా అలరించింది. ముఖ్యంగా ‘ఆకాశం నేలకు వచ్చింది’, ‘తిరుమలవాస’, ‘ఎర్రకోక పచ్చరైక’, ‘ఓ మనసా ఓ మనసా’ గీతాలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం విడుదలై 15 ఏళ్లు పూర్తయింది. 2005 మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ‘భద్ర’. అయితే బన్నీకి ఈ చిత్రంతో సంబంధం ఏంటి? అంటే.. ముందుగా ఈ కథను అల్లు అర్జున్‌తో చేయాలనుకున్నాడు బోయపాటి. బన్నీని కలిసి కథ వినిపించగా.. బన్నీకి బాగా నచ్చింది. కానీ, అప్పటికి ‘గంగోత్రి’, ‘ఆర్య’ సినిమాలు మాత్రమే చేశాడు బన్నీ. అవి ప్రేమ కథలు. ‘భద్ర’ యాక్షన్‌ నేపథ్యంలో సాగుతుంది. ఆ ఎమోషన్‌ పండించేందుకు అప్పటికీ బన్నీకి అనుభవం లేకపోవడంతో వద్దన్నాడట. ఆ తర్వాత దిల్‌రాజుకి బోయపాటిని పరిచయం చేసి కథ చెప్పమన్నాడు. బోయపాటి చెప్పిన తీరు దిల్‌రాజుకి నచ్చంది. హీరోగా రవితేజను ఎంపిక చేశారు. అలా ‘భద్ర’గా బన్నీ కనిపించాల్సింది రవితేజ కనిపించాడు. భారీ హిట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. కొన్నాళ్లకు ‘సరైనోడు’ చిత్రంతో అల్లు అర్జున్‌ని డైరెక్ట్‌ చేశాడు బోయపాటి.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.