చూపించేవారున్నా..చూసే వారు లేరు

హౌస్‌ఫుల్‌’ బోర్డులు..
బ్లాక్‌ టికెట్ల బేరాలు...
ఇవీ సినీ జనాలు కోరుకునే ముచ్చట్లు!
‘సార్‌ ఏదోలా.. ఓ పది టికెట్లు ఇప్పించండి సార్‌’ అంటూ ఫోన్ల మీద ఫోన్లు వస్తుంటే.. ఆ సినిమా దర్శక నిర్మాతలకు భలే సంబరంగా ఉంటుంది.
కానీ ఆ ఆనందం ఏది?... ఆ హడావుడి ఎక్కడ?


జనవరిలో కొత్త సినిమాల కోలాహలం బాగా కనిపించింది. సంక్రాంతికి స్టార్ల చిత్రాలు సందడి చేశాయి. కానీ ‘ఎఫ్‌ 2’ రూపంలో ఒకే ఒక్క విజయం లభించింది. ఆ తరవాత.. టాలీవుడ్‌లో ‘హిట్‌’ అనే మాటే వినిపించకుండా పోయింది. ఫిబ్రవరిలో కూడా చెప్పుకోదగిన సంఖ్యలోనే సినిమాలొచ్చాయి. ‘యాత్ర’, ‘దేవ్‌’, ‘మహానాయకుడు’... ఇలాంటి చిత్రాలు పలకరించినా విజయోత్సాహం అందించలేకపోయాయి. జనవరిలో డీలా పడిన చిత్రసీమ... ఫిబ్రవరిలో మరింత నష్టాల్లోకి కూరుకుపోయింది. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో..?!

ఫిబ్రవరిలో అటూ ఇటుగా 20 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో చిన్న సినిమాలు, డబ్బింగ్‌ బొమ్మలూ ఎక్కువ. వాటిలో ‘యాత్ర’పై ప్రేక్షకుల దృష్టి పడింది. వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి చేసిన పాద యాత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. మహి.వి.రాఘవ దర్శకత్వం వహించారు. వై.ఎస్‌ పాత్రలో మమ్ముట్టి కనిపించారు. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. కార్తి - రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జోడీ కట్టిన ‘దేవ్‌’ నిరాశ పరిచింది. తొలి రోజు వసూళ్లు కూడా అంతంతమాత్రంగానే వచ్చాయి. అటు తమిళంలోనూ ఈ చిత్రానికి చుక్కెదురైంది.


జనవరిలో వచ్చిన ‘కథానాయకుడు’ నందమూరి అభిమానుల్ని నిరాశ పరిచింది. ఆ లోటు ‘మహా నాయకుడు’ భర్తీ చేస్తాడనుకుంటే, ఆ ఆశలూ ఆశించినంతగా నెరవేరలేదు. ఎన్టీఆర్‌ ఇమేజ్‌, బాలకృష్ణ స్టార్‌డమ్‌ ఈ చిత్రానికి వసూళ్లని తీసుకురాలేకపోయాయి. బయోపిక్‌ అనే కాదు, ఇటీవల స్టార్‌ కథానాయకుల చిత్రాలకు సైతం సరైన ప్రారంభ వసూళ్లు రాకపోవడం చిత్రసీమని ఆశ్చర్యంలోనూ, నైరాశ్యంలోనూ ముంచెత్తుతోంది. ఇక ఈ నెలలో వచ్చిన డబ్బింగ్‌ చిత్రాలు, చిన్న సినిమాల సంగతి సరేసరి.

ఫిబ్రవరి, మార్చి.. తెలుగు చిత్రసీమకు అంత మంచి సీజన్‌ కాదు. పరీక్షల హడావుడి ఉంటుంది. యువతరం అంతా పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన పరిస్థితి. వాళ్లని థియేటర్లకు రప్పించడం అంత తేలికైన విషయం కాదు. సినిమాలకు మహారాజ పోషకులు యువతరమే. వాళ్లే లేకపోతే.. గళ్లాపెట్టెలు నింపడం ఎలా? ఎప్పుడైనా సరే - సంక్రాంతి సీజన్‌ ముగిశాక కాస్త స్తబ్దత వస్తుంటుంది. పెద్ద సినిమాలు వచ్చి వెళ్లిపోతాయి కాబట్టి, మళ్లీ వేసవి వచ్చేంత వరకూ స్టార్‌ కథానాయకుల హడావుడి కనిపించదు. ఈలోగా చిన్న, ఓ స్థాయి బడ్జెట్‌ ఉన్న సినిమాలు తమ అదృష్టం పరీక్షించుకుంటుంటాయి. ఈసారి వాటి సంఖ్య ఎక్కువ ఉన్నా, విజయాలు దక్కడం లేదు.


థియేటర్ల నిర్వహణ ఇప్పుడు ప్రధాన సమస్యగా మారుతోంది. కనీస సంఖ్యలో టికెట్లు తెగకపోతే.. అద్దె డబ్బులు కూడా రాకపోతే.. నిర్వాహకుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో వచ్చిన వరుస పరాజయాలతో పంపిణీదారులు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. ఇప్పుడు కొత్త సినిమాలు కొనడానికి వాళ్లకు ధైర్యం చాలడం లేదు. కొన్ని చోట్ల థియేటర్లని తాత్కాలికంగా మూసేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన కూడా వస్తోంది. మల్టీప్లెక్స్‌ల వల్ల సింగిల్‌ స్క్రీన్‌లకు ఆదరణ తగ్గుతోంది. పెద్ద సినిమాలొస్తే తప్ప.. గత వైభవం కనిపించడం లేదు. అద్దె డబ్బులు కూడా రానప్పుడు థియేటర్లు నడిపి ఏం లాభం? అనే లెక్కలు వేసుకుంటున్నారు. ఎలాగూ వేసవి వరకూ పెద్ద సినిమాలు రావు. ఈలోగా మరమ్మతుల పేరుతో కొన్ని రోజులు థియేటర్లను మూసేస్తే మంచిదనుకుంటున్నారు.

మల్టీప్లెక్స్‌ల పరిస్థితి కూడా ఇంచుమించుగా ఇలానే ఉంది. పార్కింగ్‌ రుసుముని తొలగించడంతో ఆ రూపంలో వచ్చే ఆదాయానికి గండి పడుతోంది. నిర్దేశించిన ధరలకే తినుబండారాలను అమ్మాలన్న నిర్ణయం కూడా ఆదాయానికి కోత విధించేదే. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల పాటు పరిమిత సంఖ్యలోనే ప్రదర్శనలు నిర్వహించాలని యాజమాన్యాలు భావిస్తున్నాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.