తెలుగు కథలకు మొగ్గు చూపుతున్నారు!

పాన్‌ ఇండియా సినిమాల ప్రభావంతో భాషల మధ్య హద్దులు చెరిగిపోయాయి. తెలుగు సినిమా ముంబయిలో అదరగొడుతుంది. దక్షిణాది తారలు ఉత్తరాది ప్రేక్షకులకూ సుపరిచితం అవుతుంటారు. అక్కడి తారలు ప్రాంతీయ భాషల్లో రూపొందుతున్న సినిమాల్లోనూ విరివిగా మెరుస్తుంటారు. ఒక మోస్తరు బడ్జెట్‌తో సినిమా తీస్తున్నారంటే చాలు... దానికి ఏదో రకంగా పాన్‌ ఇండియా రంగు పూసే ప్రయత్నం కనిపిస్తుంటుంది. అందుకు తగ్గట్టుగా హంగుల జోడింపూ మొదలైపోతుంది. అందులో భాగమే విలన్‌గానో, హీరోయిన్‌గానో జాతీయ స్థాయిలో గుర్తింపున్న తారల్ని దిగుమతి చేసుకోవడం! అలాంటి ప్రయత్నాలు ఈమధ్య ఎక్కువగానే జరుగుతున్నాయి. కొందరు  దర్శకులు మాత్రం పాన్‌ ఇండియాతో సంబంధం లేకుండా ప్రముఖ తారల్ని తెరపై చూపించేందుకు ఇష్టపడుతుంటారు. ఎవరి వ్యూహాలేమిటో తెలియదు కానీ... ఇటీవల బాలీవుడ్‌ నాయికల పేర్లు మాత్రం తెలుగులో గట్టిగానే వినిపిస్తున్నాయి.

ఆలియాభట్, అనన్యా పాండే, ఊర్వశి రౌటేలా... ఇలా బాలీవుడ్‌ నాయికలు ఇప్పటికే తెలుగులో సినిమాలు చేస్తున్నారు. కియారా అడ్వాణీ క్రమం తప్పకుండా సినిమాలు చేస్తోంది. త్వరలోనే మరో చిత్రం చేస్తానని ఆమె ఇటీవల ప్రకటించింది. ప్రభాస్‌తో కలిసి నటించేందుకు దీపికా పదుకొణే కూడా పచ్చజెండా ఊపేసింది. వీళ్లతోపాటు మరికొంతమంది తారల్ని తెలుగు చిత్రసీమ రారమ్మంటోందా? ఈ ప్రశ్నకి అవుననే సమాధానమే వినిపిస్తున్నాయి పరిశ్రమ వర్గాలు. మహేష్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘సర్కార్‌ వారి పాట’ విషయంలో పలువురు బాలీవుడ్‌ తారల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అందులో అనిల్‌ కపూర్‌ ఒకరు, విద్యాబాలన్‌ మరొకరు. ప్రతినాయకుడిగా అనిల్‌కపూర్‌ని ఎంపిక చేసుకునే ప్రయత్నాల్లో చిత్రబృందం ఉన్నట్టు సమాచారం. అగ్ర కథానాయిక విద్యాబాలన్‌ని కూడా ఓ కీలక పాత్ర కోసం సంప్రదిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.


శ్రీదేవి తనయ జాన్వి కోసం తెలుగు చిత్రసీమ ఎప్పుడో ఎర్ర తివాచీ పరిచింది. ఆమె తొలి సినిమా తెలుగులోనే చేస్తారని అప్పట్లో ప్రచారమైంది. కానీ హిందీలోనే ఆమె తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత కూడా పలు తెలుగు కథలు ఆమె దగ్గరికి వెళ్లాయి కానీ కుదరలేదు. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ కలయికలో రూపొందుతున్న సినిమా విషయంలో జాన్వి పేరు వినిపిస్తోంది. త్రివిక్రమ్‌ సినిమాలోని ఓ కథానాయిక పాత్ర కోసం జాన్విని సంప్రదిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అందులో నిజం ఎంతన్నది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.


జాక్వెలిన్‌ ఓకే అయ్యిందా?

బాలీవుడ్‌కి చెందిన మరో సీనియర్‌ భామ... జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌. ఆమె పవన్‌ కల్యాణ్‌తో కలిసి నటించబోతున్నట్టు సమాచారం. క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి  తెలిసిందే. పవన్‌ ప్రస్తుతం చేస్తున్న ‘వకీల్‌సాబ్‌’ పూర్తి కాగానే ఆ చిత్రం పట్టాలెక్కబోతోంది. అందులోనే జాక్వెలిన్‌ కథానాయికగా నటించనున్నట్టు సమాచారం. ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కబోతున్న ‘ఆదిపురుష్‌’ చిత్రానికి సంబంధించి కూడా అందులోని సీత పాత్ర కోసం దక్షిణాది తారలతో పాటు, బాలీవుడ్‌ భామల్ని కూడా సంప్రదిస్తున్నారు. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘పుష్ప’లో ప్రత్యేకగీతం కోసం ‘సాహో’ భామ శ్రద్ధాకపూర్‌ని ఎంపిక చేయాలనే ఆలోచనలో ఆ చిత్రబృందం ఉన్నట్టు తెలిసింది. ఇలా బాలీవుడ్‌ భామలకి తెలుగు సినిమా నుంచి పిలుపులు గట్టిగానే వెళుతున్నాయి. మరి అక్కడే బిజీ బిజీగా గడుపుతున్న ఆ ముద్దుగుమ్మల్లో ఎంతమంది తెలుగు సినిమాల్ని చేయడానికి ఒప్పుకుంటారనేది చూడాలి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.