వెండితెరపై బాక్సింగ్‌

‘కొత్తగా ఏదైనా చూపించాలేగానీ.. కచ్చితంగా ఆదరిస్తాం’ అంటున్నారు ప్రేక్షకులు. పాత కథే అయినా చక్కటి కథనంతో తీర్చిదిద్దితే ప్రేక్షాదరణ బాగుంటుంది. ఈ క్రమంలో ఎన్నో వైవిధ్యమైన కథలు తెరపైకి వస్తున్నాయి. వాటిల్లో క్రీడా నేపథ్యం ఉన్న కథలకు డిమాండ్‌ ఉంది. అందులోనూ క్రీడాకారుల బయోపిక్‌లు అయితే ఆదరణ ఇంకా బాగుంటుంది. ప్రేక్షకుల్లో స్ఫూర్తి రగిలిస్తూ, ఉత్సాహం నింపేవి ఇవే. ఆటగాళ్ల జీవిత కథతోనో, క్రీడా స్ఫూర్తి రగిలించే కథతోనే తెరకెక్కిన చిత్రాలు బాగా విజయవంతం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హిందీతో పాటు తెలుగులోనూ బాక్సింగ్‌ నేపథ్యం ఉన్న కొన్ని సినిమాలు తెరకెక్కుతున్నాయి.

బాక్సింగ్‌ అంటే ఆద్యంతం ఉత్కంఠ ఉంటుంది. ప్రేక్షకుణ్ని అలరించే స్క్రీన్‌ప్లేతో తీయగలిగితే హిట్‌ ఖాయం. అందుకే బాలీవుడ్‌ యువ కథానాయకులు షాహిద్‌కపూర్, టైగర్‌ ష్రాఫ్, ఫర్హాన్‌ అక్తర్, తెలుగు హీరో వరుణ్‌తేజ్‌ తదితరులు అదే బాటలో వెళుతున్నారు. బాలీవుడ్‌ యువ హీరో టైగర్‌ ష్రాఫ్‌ ప్రధాన పాత్రలో బాక్సింగ్‌ కథాంశంతో ఓ చిత్రం తెరకెక్కనుంది. వికాస్‌ భల్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది కండలు తిరిగిన టైగర్‌కు ఈ కథ కచ్చితంగా సరిపోతుందని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.
మా తరానికి తెలియాల్సిన కథ
గతేడాది ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్‌ ‘కబీర్‌సింగ్‌’తో భారీ విజయం అందుకున్నాడు షాహిద్‌ కపూర్‌. ఆయన ఓ బాక్సింగ్‌ బయోపిక్‌లో నటించనున్నాడు. భారతీయ బాక్సింగ్‌ ఛాంపియన్‌ డింకో సింగ్‌ జీవిత కథలో షాహిద్‌ నటించనున్నాడు. ‘‘క్రీడాస్ఫూర్తి నింపే కథ ఇది. ఎంతో పట్టుదలతో గొప్ప విజయాలు సాధించిన క్రీడాకారులు ఎందరో ఉన్నారు. చాలామందికి వీరి గొప్పతనం తెలియదు. తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి వాళ్లు పడ్డ కష్ట నష్టాలు, బాధలు అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి కథే డింకో సింగ్‌ది. మా తరంతో పాటు రాబోయే తరాలు కూడా తెలుసుకోవాల్సిన జీవితం ఆయనది’’అంటున్నాడు షాహిద్‌.


బాక్సింగ్‌ ధనికుల ఆట కాదు
ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు రాకేష్‌ ఓం ప్రకాష్‌ మెహ్రా తెర కెక్కించిన చిత్రం ‘తుఫాన్‌’. ఫర్హాన్‌ అక్తర్‌ బాక్సర్‌గా నటించిన ఈ చిత్రం మార్చిలో విడుదల కావాల్సి ఉంది. సెప్టెంబరుకి వాయిదా పడింది. కానీ విడుదల కాలేదు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ‘‘సాధారణంగా బాక్సింగ్‌ అంటే ధనికులు ఆడే ఆట అనుకుంటుంటారు. కానీ ఓ మధ్యతరగతి యువకుడి నేపథ్యంగా మా కథ సాగుతుంది’’అన్నారు రాకేష్‌ ఓం ప్రకాష్‌ మెహ్రా.

భావోద్వేగాలు.. చక్కటి స్క్రీన్‌ప్లే

‘‘బాక్సింగ్‌ ఆట, దాని రూల్స్‌.. అందరికీ అర్థం కాకపోవచ్చు. కానీ చూస్తుంటే ప్రేక్షకుడిలో ఓ ఉత్కంఠ ఉంటుంది. దానికి చక్కటి భావోద్వేగాలు జోడించి, పట్టు సడలని స్క్రీన్‌ప్లేతో తీస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రావడం ఖాయం.’’ అంటున్నారు ఓ ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత. దివంగత బాక్సింగ్‌ ఛాంపియన్‌ హవా సింగ్‌ జీవిత కథతో వస్తున్న చిత్రం ‘హవా సింగ్‌’. ఇందులో టైటిల్‌ పాత్రలో బాలీవుడ్‌ యువ కథానాయకుడు సూరజ్‌ పంచోలి నటిస్తున్నాడు.

వరుణ్‌తేజ్‌ బాక్సింగ్‌ సత్తా

తెలుగు యువ కథానాయకుడు వరుణ్‌తేజ్‌ బాక్సర్‌గా సత్తా చాటబోతున్నాడు. ‘గద్దలకొండ గణేష్‌’తో విజయాన్ని అందుకున్న వరుణ్‌ ఈ సినిమా కోసం చాలా శ్రమిస్తున్నారు. కిరణ్‌ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వరుణ్‌ బాక్సర్‌గా కనిపించనున్నాడు. దీని కోసం తన దేహాన్ని తీర్చిదిద్దుకోవడానికి ప్రత్యేక వర్కవుట్‌లు కూడా చేశారు వరుణ్‌.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.