క్యాన్సర్‌... ఓడిపోయింది!

‘ఆశ క్యాన్సర్‌ ఉన్నవాడిని కూడా బతికిస్తుంది...భయం అల్సర్‌ ఉన్న వాడిని కూడా చంపేస్తుంది...’ ఇది త్రివిక్రమ్‌ సినిమాలోని హిట్‌ డైలాగే కావొచ్చు. నిజమే, ఆ ఆశ ఎందరి జీవితాల్లోకో చెప్పాపెట్టకుండా చొరబడిన క్యాన్సర్‌ మహమ్మారిని మట్టి కరిపించింది. మనోధైర్యం ముందు ఏ వ్యాధీ నిలవలేదన్న సందేశాన్నిచ్చింది. బతుకుమీద ఆశ, బతికితీరతామన్న ధీమాతో క్యాన్సర్‌వ్యాధికి గురైనా మోముపై చిరునవ్వుని చెరగనీయకుండా తమ జీవితాల్ని గెలుపుబాటలో నడిపించుకుంటున్న సెలబ్రిటీలు చాలామందే ఉన్నారు. ఆ పోరాటధీరుల జీవితాలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకాలు!
* సోనాలీ బింద్రే

అందం, అభినయం కలబోసిన ముద్దుగుమ్మగా తెలుగునాటపేరు తెచ్చుకున్న సోనాలీ ఈ మధ్యే మెటాస్టాటిక్‌ క్యాన్సర్‌ బారిన పడింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్‌ మీడియాలో వెల్లడించింది. వ్యాధి గురించి తెలియగానే ఆమె చికిత్స కోసం అమెరికాకు వెళ్లింది. తన అనుభవాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. డాక్టర్ల సూచనల మేరకు తన జట్టును కత్తిరించుకున్న వీడియోనూ ఎంతో భావోద్వేగంతో పోస్ట్‌ చేసింది. ఆమె ఆరోగ్యం గురించి కంగారుగా ప్రశ్నలు వేస్తున్న అభిమానులకు ఏం ఫర్వాలేదంటూ ధైర్యం చెబుతోంది. తాను చదువుతున్న పుస్తకాల గురించీ ఎప్పటికప్పుడు తెలియజేస్తోంది. కీమో తర్వాత పూర్తిగా జట్టు ఊడిపోయిన ఫొటోలోనూ నవ్వుతూ కనిపిస్తూ క్యాన్సర్‌ పట్ల తన దృఢమైన వైఖరిని తెలియజేస్తోంది!
* మమతా మోహన్‌దాస్‌

బ్లడ్‌క్యాన్సర్‌... సినిమాల్లో ఎక్కువగా వినిపించే ఈ పదాన్ని మమతా మోహన్‌దాస్‌ నిజజీవితంలో వినాల్సొచ్చింది. నిండా పాతికేళ్లు కూడా రాకముందే ఈ వ్యాధి బారిన పడినా ఆమె ఎప్పుడూ ఆత్మ స్థైర్యాన్ని కోల్పోలేదు. తన సహజ రీతిలో ఆ విషయాన్నీ చిరునవ్వుతోనే స్వీకరించింది. ఎంతలా అంటే... ట్రీట్‌మెంట్‌ కోసం జుట్టును కత్తిరించుకోవాలని డాక్టర్లు చెబితే, ఇదో కొత్త స్టైల్‌ అంటూ నవ్వేసేదట. ఓ పక్కట్రీట్‌మెంట్‌ తీసుకుంటూనే మరో పక్క సినిమాల్లో నటించేది. తాను క్యాన్సర్‌ నుంచి కోలుకున్నట్టు తనంతట తాను చెప్పేదాకా ఆమెకు క్యాన్సర్‌ వచ్చిన విషయం కూడా ఎవరికీ తెలియదు. అయితే ఆమెకు సోకిన క్యాన్సర్‌ ఒకసారి తగ్గి మళ్లీ తిరగబెట్టింది. అయినా ఆమె భయపడలేదు. ఈసారి చికిత్సలోనూ కొత్త ప్రయోగానికి తెరతీసింది. అమెరికన్‌ క్యాన్సర్‌ వైద్యనిపుణులు నిర్వహించే క్లినికల్‌ ట్రయల్స్‌లో తానూ ఒక భాగమైంది. క్యాన్సర్‌ మీద వివిధ మందుల ప్రభావాన్ని తెలుసుకునేందుకు ఇలాంటి ట్రయల్స్‌ నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 22 మంది పాల్గొంటుండగా 21 మంది అమెరికన్లే. ధైర్యంతో ఆ బృందంలో ముందడుగు వేసిన ఏకైక భారతీయురాలూ, అతి పిన్న వయస్కురాలూ కూడా మమతే!
* లీసా రే


బాలీవుడ్‌ హీరోయిన్‌ లీసా రే క్యాన్సర్‌పై విజయం సాధించిన సెలబ్రిటీగా చాలా రోజుల క్రితమే వార్తల్లో నిలిచింది. ఆమె తెల్లరక్త కణాలకు సంబంధించిన క్యాన్సర్‌ బాధితురాలు. అయితే క్యాన్సర్‌ రాగానే తన జీవితం అంతమైందని భావించలేదు లీసా. దాన్నీ బతుకుబాటలో ఎదురయ్యే ఓ సవాలులాగానే స్వీకరించింది. కీమో థెరపీ సమయంలో జుట్టు మొత్తం ఊడిపోయిన ఫొటోను ‘కీమో కట్‌’ అంటూ సోషల్‌ నెట్‌వర్క్‌సైట్లో పెట్టింది. ఆమె మానసిక స్థైర్యం ముందు క్యాన్సర్‌ మహమ్మారి తలవంచింది. క్యాన్సర్‌ నుంచి కోలుకున్నాక పెళ్లి చేసుకున్న ఆమె సరోగసీ ద్వారా ఇద్దరు కవలపిల్లలకు తల్లైంది కూడా. సినిమాల్లోనూ చాలా హుషారుగా నటిస్తోంది. ‘క్యాన్సర్‌ వచ్చాక కూడా ఎంతో సంతోషకరమైన జీవితం ముందు ఉంటుంది... దాని కోసం ఆలోచిస్తూ ముందుకు సాగడమే మన పని’ అంటుందామె! అందుకే నటిగా, మోడల్‌గా, రచయిత్రిగా రాణిస్తూనే మోటివేషన్‌ స్పీచులూ ఇస్తోంది. క్యాన్సర్‌ పట్ల అవగాహన కల్పించే క్యాంపెయిన్‌లూ నిర్వహిస్తోంది.
* ఇర్ఫాన్‌ ఖాన్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ కూడా తను క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు ఈ ఏడాదే సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు తెలిపాడు. మహేశ్‌బాబు నటించిన ‘సైనికుడు’ సినిమాలో ఇతను విలన్‌గా నటించాడు. తనకు క్యాన్సర్‌ అని తెలిసినప్పుడు తీవ్రమైన బాధకు లోనయ్యాననీ, ఆసుపత్రికి వెళుతున్నా పాతాళంలో కూరుకుపోతున్నంత బాధగా ఉండేదనీ అయితే అక్కడ చిరునవ్వుతో కనిపించిన క్రికెట్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌ ఫొటో తనలో ధైర్యాన్ని నింపిందనీ చెబుతాడు. క్యాన్సర్‌ విషయంలో మనం చేయగలిగింది ఏమీ లేదు, కానీ అదొక ఆట అనుకుంటే, ఆ ఆటలో మన బలాలేమిటో బలహీనతలేమిటో తెలుసుకుని వాటి ఆధారంగా వీలైనంత బాగా పోరాడాలి... అని ధైర్యంగా చెబుతాడు.
* గౌతమి


హీరోయిన్‌గా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన గౌతమికి 2005లో రొమ్ము క్యాన్సర్‌ సోకింది. బ్రెస్ట్‌ సర్జరీతో పాటు ఆరేళ్ల పాటు కీమో థెరపీ చేయించుకుందామె. అంతేకాదు 35 సార్ల దాకా రేడియో థెరపీ చేయించుకుంది. గౌతమికి క్యాన్సర్‌ బయటపడేనాటికి ఆమెకు ఐదేళ్ల పాప ఉంది. చికిత్స సమయంలో జుట్టు రాలడంతో పాటు తీవ్రమైన నీరసం ఆవహించేదట. ‘ఆ సమయంలో నా శరీరం మాత్రమే నీరసానికి గురయ్యేది మనసును ఎప్పుడూ బలంగానే ఉంచుకునేదాన్ని’ అని చెబుతుంది. చికిత్స పూర్తై తిరిగి వచ్చాక ఆమె తనలాంటి క్యాన్సర్‌ బాధితుల కోసం ‘లైఫ్‌ ఎగైన్‌ ఫౌండేషన్‌’ను స్థాపించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు బ్రిటన్‌, కువైట్‌లాంటి దేశాల్లోనూ సంస్థ తరఫున అవగాహనా కార్యక్రమాలు చేపడుతోంది. క్యాన్సరేమీ మరణశాసనం కాదనీ, ముందు దశల్లో గుర్తించినట్లయితే నిండు నూరేళ్లూ సంతోషంగా బతకొచ్చనీ చెబుతోంది గౌతమి.
* మనీషా కొయిరాలా


బొంబాయి సినిమాతో ప్రేక్షకుల మనసుల్లో చెదరని ముద్ర వేసిన అందాల నటి మనీషా కొయిరాలా పదేళ్ల క్రితం క్యాన్సర్‌ బారిన పడింది. తనకు అండాశయ క్యాన్సర్‌ అని తెలియగానే అందరిలాగే షాక్‌కి గురయిన మనీషా భయపడితే వ్యాధిని ఎదరించలేమన్న సన్నిహితుల మాటలను వంటపట్టించుకుంటూ మనసును గట్టి పరచుకుంది. అతి కష్టమైన ట్రీట్‌మెంట్‌ సమయంలోనూ ఏమాత్రం మనోస్థైర్యాన్ని కోల్పోలేదు. ఓ పక్క ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూనే మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఆన్‌లైన్లో ధ్యానానికి సంబంధించిన కోర్సు చేసింది. కీమోథెరపీ సమయంలో కనుబొమలతో సహా జుట్టు మొత్తం ఊడిపోయినా ఆ ఫొటోలను సైతం సోషల్‌నెట్‌వర్కింగ్‌ సైట్లలో పెట్టింది. ‘నేను ఇలా జుట్టు లేకుండా ఉన్నా న్యూయార్క్‌లో నన్నెవరూ వింతగా చూడలేదు. నిజానికి అక్కడ నాకన్నా వింతగా కనిపించే మనుషులే ఎక్కువ’ అంటూ చమత్కరించింది. మొత్తానికి ఆమె చిరునవ్వు ముందు క్యాన్సర్‌ ఓడిపోయింది. వ్యాధినుంచి కోలుకున్న ఆమె తిరిగి సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. ఈ మధ్యే క్యాన్సర్‌ మీద పోరాటంలో తన అనుభవాలను వివరిస్తూ ‘హీల్డ్‌: హౌ క్యాన్సర్‌ గేవ్‌ మి ఎన్యూ లైఫ్‌’ అనే పుస్తకాన్ని విడుదల చేసింది.
* యువరాజ్‌ సింగ్‌

క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌ కూడా చిన్న వయసులోనే క్యాన్సర్‌ బారిన పడ్డాడు. 2011లో అతని ఊపిరితిత్తుల మధ్య క్యాన్సర్‌ కణితులు పెరుగుతుండటాన్ని డాక్టర్లు గుర్తించారు. చికిత్స కోసం అమెరికాకు వెళ్లిన యువీ ఒక్కోసారి నొప్పిని తట్టుకోలేక గట్టిగా ఏడ్చేసేవాడట. అయితే దుఃఖపడటం వల్ల తన బాధ ఏమాత్రం తగ్గకపోగా మానసిక స్థైర్యం దెబ్బతింటోందని గుర్తించి, తనను తానే సముదాయించుకునేవాడట. అంతేకాదు చికిత్స సమయంలోని తన ఫొటోలను సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లలో పెడుతూ ఉండేవాడు. అదే స్థైర్యంతో క్యాన్సర్‌ను గెలిచి పూర్తి ఫిట్‌నెస్‌తో మళ్లీ టీమిండియాలో చేరాడు. క్యాన్సర్‌తో తన పోరాటాన్ని ‘జిందగీ అభీ బాకీ హై’ పేరుతో డాక్యుమెంటరీగా రూపొందించాడు. ఆ సమయంలో తన అనుభవాలను ‘ది టెస్ట్‌ టైం ఆఫ్‌ మై లైఫ్‌’ అనే పుస్తకం రూపంలోనూ పొందుపరిచాడు. చిన్నారులూ నిరుపేదలకు క్యాన్సర్‌ చికిత్సలో సహాయాన్నిందించేందుకు ‘యువీకెన్‌’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించిన యువరాజ్‌ కొద్దిరోజుల క్రితం జరిగిన తన పుట్టిన రోజు సందర్భంగా ఈ ఏడాది కనీసం పాతికమంది చిన్నారులకు ఈ ఫౌండేషన్‌ ద్వారా చికిత్సనందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.