సోషల్‌ వాల్‌పై.. తారల తళుక్‌ బెళుక్‌!
కాజల్‌.. తమన్నా ఓ వేడుకకి హాజరవుతున్నారు. ఇద్దరూ అందంగా ముస్తాబయ్యారు. ఇక అక్కడ ఒక ఫొటో షూట్‌ జరిగి తీరాల్సిందే, కాసేపట్లో ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేయాల్సిందే.


శ్రుతిహాసన్‌ ఓ ఫ్యాషన్‌ షోలో ఎర్ర తివాచీపై నడిచేందుకు సిద్ధమైంది. అంతకంటే ముందే ఆ డ్రెస్సు ధరించి కెమెరా ముందుకొస్తుంది. క్లిక్‌ క్లిక్‌మంటూ కెమెరా శ్రుతి అందాల్ని ఒడిసి పడుతుంది. వెంటనే ఆ ఫొటోలు అంతర్జాలంలో వైరల్‌ అయిపోతాయి.

కొత్తగా అడుగులు వేస్తున్న ఓ కథానాయిక ట్రెండీ పాత్రల్లోనే బాగుంటుందనీ, సంప్రదాయ పాత్రలు ఆమెకి నప్పవనే ఓ అభిప్రాయాన్ని వింటుంది. తాను సంప్రదాయ దుస్తుల్లో ఎలా ఉంటానో వీళ్లకి చూపించాల్సిందే అంటూ చీర కట్టుతో కెమెరా ముందుకొస్తుంది. రకరకాల భంగిమల్లో ఫొటోలకి పోజులిచ్చి... ఇదీ నా ప్రతిభ అంటూ ఆ ఫొటోల్ని ఆన్‌లైన్‌లో పెట్టేస్తుంది. దాని గురించి పరిశ్రమలో చర్చ మొదలవుతుంది.


థానాయికలు ఫొటో షూట్‌లతో గ్లామర్‌ ఒలకబోస్తున్నారు. కాజల్‌, తమన్నా, శ్రుతిహాసన్‌, పూజా హెగ్డే, పాయల్‌ రాజ్‌పుత్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ లాంటి తారలు తమ ఫొటోషూట్‌ చిత్రాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటూ వారి అందం గురించి చర్చ లేవనెత్తుతున్నారు. ఇదివరకు ఒక కథానాయిక అందం గురించి మాట్లాడాలంటే ఆమె చేసిన కొత్త సినిమా విడుదల కావల్సిందే. సెట్‌లో కెమెరాల ముందుకు వెళుతున్నప్పుడే అందంగా కనిపించే విషయం గురించి వారు శ్రద్ధ తీసుకొనేవారు. ఇప్పుడలా కాదు. అందాల ప్రదర్శనపై రోజూ కసరత్తులే. రోజూ చర్చే. పదిమంది దృష్టి పడితే తప్ప అవకాశాలు రావనుకొన్నవాళ్లు... ఫ్యాషన్‌ పరంగా తాము అప్‌డేట్‌ అవుతున్నామనే విషయం అందరికీ తెలియాలనుకొనేవాళ్లు.. తాము అన్ని రకాల పాత్రలకీ పనికొస్తామనే సంకేతం పరిశ్రమకి చేరాలనే తలంపుతో ఉన్నవాళ్లు... కొత్త కథానాయికలు, పేరున్న కథానాయికలు... అందరూ ఫొటోషూట్‌లని ఆశ్రయిస్తున్నవాళ్లే. ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళితే వెండితెరని మించిన గ్లామర్‌ కనిపిస్తుంది. కథానాయికల్ని ఎంపిక చేసుకోవాలంటే దర్శకులు వాళ్లని పరిశీలించి, ఫొటో షూట్‌లు చేయించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ఆ అవసరమే ఉండటం లేదు.సామాజిక మాధ్యమాల్ని పరిశీలిస్తే కావల్సిన కథానాయిక దొరుకుతుందనే నమ్మకం పరిశ్రమలో కనిపిస్తోంది. అలా ఎంపికైనవాళ్లు కూడా చాలా మందే.


ఖర్చు ఎక్కువే...
బాలీవుడ్‌కి వెళ్లి మరీ ఫొటో షూట్‌లు చేయించుకొనే దక్షిణాది కథానాయికలు చాలా మందే. కెమెరా ముందుకెళ్లి పోజిస్తే ఫొటో షూట్‌ అయిపోయినట్టు కాదు. దానికి ముందు చాలా కసరత్తులు ఉంటాయి. ఫొటో షూట్‌కి తగ్గట్టుగా స్టైలింగ్‌, మేకప్‌పై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. కోరుకున్నట్టుగా ఫొటో షూట్‌ చేయించుకోవడానికి, ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌లని ఆశ్రయించి లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఒక సినిమాలో నటించి పేరు తెచ్చుకొన్న తెలుగు కథానాయికకి.. మరిన్ని కొత్త అవకాశాలు రావాలంటే ఓ మంచి ప్రొఫైల్‌ ఉంటే బాగుంటుందని సన్నిహితులు సలహా ఇచ్చారట. దాంతో ఆమె ముంబయికి వెళ్లి రూ.5 లక్షల వ్యయంతో ప్రొఫైల్‌ ఫొటో షూట్‌ చేయించుకొంది. ఆ ఫొటోలు ప్రత్యేకంగా ఉండటంతో అంతర్జాలంలో వైరల్‌గా మారాయి. దుస్తులు, మేకప్‌, స్టూడియో ఖర్చులతో కలిపి ఫొటో షూట్‌కి వెల కడుతుంటారు. అయితే కొద్దిమంది ఫొటోగ్రాఫర్లు నాయికలకి ఉచితంగా ఫొటో షూట్‌ చేయించి ఇస్తుంటారు. ఆ ఫొటోలపై వాళ్ల స్టూడియో పేర్లు కనిపించేలా ఉండాలని షరతు పెడుతుంటారు.


అదొక కళ

ఫొటోలకి పోజులివ్వడం ఓ కళ అంటుంది అగ్ర కథానాయిక శ్రుతిహాసన్‌. ‘నాకు చిన్నప్పట్నుంచే అది బాగా అలవాటైంది. అందుకే నా ఫొటోలు అంత బాగా వస్తుంటాయ’ని ఆమె చెబుతోంది. కాస్ట్యూమ్స్‌కి, మన ఫొటో షూట్‌కి తగ్గట్టు పోజులివ్వడం తెలిసుండాలని, అప్పుడే అనుకొన్నట్టుగా ఫొటోలు వస్తాయంటోంది శ్రుతి. ఈ ట్రెండ్‌ గురించి కాజల్‌ మాట్లాడుతూ... ‘‘ఎక్కడ ఫొటోలు క్లిక్‌మన్నా అవి ఇన్‌స్టాగ్రామ్‌లోకి రావల్సిందే. ఇప్పుడదే కీలక పాత్ర పోషిస్తోంది. కొన్ని మేగజీన్ల కవర్‌ ఫోటోల కోసం ఆ మధ్య ఫొటో షూట్‌ల్లో పాల్గొన్నా. వాటికి మంచి స్పందన లభించింద’’ని చెప్పింది. నాయికలు తరచూ కెమెరా ముందుకు వెళ్లడానికి ఈమధ్య మరో ట్రెండ్‌ కూడా కారణమవుతోంది. కొన్ని సోషల్‌ నెట్‌వర్కింగ్‌ యాప్స్‌ నాయికలకి డబ్బు చెల్లించి, రోజూ కొన్ని ఫొటోలతో పాటు వీడియోలు పోస్ట్‌ చేస్తూ ఉండాలని ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. నాయికల అందమైన ఫోటోల కోసమైనా తమ యాప్స్‌ని చూస్తారనేది వారి ఉద్దేశం.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.