ఒకటి మించి మరొకటి

- రెండు సినిమాలు.. 30 రోజులు... రూ. 600 కోట్లు

‘బాహుబలి’ పుణ్యం... తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ఇదివరకు దక్షిణాది సినిమా అంటే చిన్నచూపు చూసినవాళ్లు సైతం మన దూకుడు చూసి ఆశ్చర్యపోతున్నారు. ‘బాహుబలి’ అనే కాదు.. ‘కేజీఎఫ్‌’ కూడా బాలీవుడ్‌లో దుమ్ము దులిపింది. సౌత్‌ సినిమా సత్తాని దేశ వ్యాప్తంగా చాటింది. తెలుగులో సినిమా అంటే బడ్జెట్‌ లెక్కలకు ఓ పరిమితి ఉండేది. ‘ఇంతలోనే సినిమా తీయాలి’ అంటూ గిరి గీసుకునేవారు. ఇప్పుడు ఆ గీతలు చెరిగిపోయాయి. ‘ఖర్చు ఎంతైనా పెట్టండి.. తిరిగి రాబట్టగల సత్తా సినిమాకి ఉంద’ని నమ్ముతున్నారు. అందుకే రూ.వందల కోట్ల చిత్రాలు తెలుగు నుంచి తయారవుతున్నాయి. కేవలం నెల రోజుల వ్యవధిలో టాలీవుడ్‌ నుంచి రెండు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఒకటి ‘సాహో’ అయితే రెండోది ‘సైరా’. ఈ రెండు చిత్రాల మొత్తం బడ్జెట్‌ ఇంచుమించుగా రూ.600 కోట్లు.


‘బాహుబలి’ తరవాత ప్రభాస్‌ నుంచి వస్తున్న సినిమా ‘సాహో’. ‘బాహుబలి’ రెండు భాగాలూ కలిపి దాదాపుగా రూ.2500 కోట్లు వసూలు చేశాయి. ఈ సినిమాతో ప్రభాస్‌ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధించాడు. దాంతో తదుపరి సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. అందుకే ప్రభాస్‌ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సివచ్చింది. ‘సాహో’ బడ్జెట్‌ రూ.300 నుంచి రూ.350 కోట్ల వరకూ ఉంటుందని తెలుస్తోంది. బడ్జెట్‌ ఇంత అని చిత్రబృందం చెప్పడం లేదు గానీ, ఈ అంకెలకు దగ్గరగానే ఖర్చు చేశారు. బాలీవుడ్‌లో ప్రభాస్‌కి పెరిగిన క్రేజ్‌ కారణంగా అక్కడి హక్కుల రూపేణా మంచి ధరే పలికింది. చాలా ప్రాంతాల్లో సొంతంగా విడుదల చేసుకుంటోంది చిత్రబృందం. లేదంటే ఈ సినిమా వ్యాపారానికి సంబంధించిన లెక్కలన్నీ ఇప్పటికే బయటకు వచ్చేసేవి. నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేయడం ‘సాహో’కి కలిసొచ్చే అంశం.


తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని సినిమాగా తీయాలన్నది చిరంజీవి ఆశ.. ఆలోచన. దాదాపుగా పదేళ్ల నుంచీ ఈ కల కంటున్నారాయన. అది ఇప్పటికి సాధ్యమైంది. ‘‘ఈ కథని సినిమాగా తెరకెక్కించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని తెలుసు. నా మార్కెట్‌ కూడా ఆలోచించుకోవాలి. అందుకే ఎప్పటికప్పుడు ఆ ఆలోచన పక్కన పెడుతూనే ఉన్నాను. ‘బాహుబలి’ వచ్చాక, ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు చూశాక నమ్మకం పెరిగింది. అందుకే ‘ఖర్చు ఎంతైనా ఫర్వాలేదు. అనుకున్న కథని అనుకున్నట్టు తీద్దాం’ అనే నిర్ణయానికొచ్చాం’’ అని చెప్పుకొచ్చారు చిరంజీవి. ‘సైరా నరసింహారెడ్డి’ని పాన్‌ ఇండియా సినిమాగా తీర్చిదిద్ది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ‘సైరా’ కోసం దాదాపు రూ.250 నుంచి రూ.300 కోట్ల వరకూ ఖర్చు పెట్టారు. చిరంజీవి కెరీర్‌లో ఇదే అత్యంత ఖరీదైన చిత్రం.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.