ఫిలింసిటీలో కొత్త చిత్రాల సందడి..
సినీ తారల స్వప్న లోకం రామోజీ ఫిలింసిటీ. ప్రపంచం నలుమూలల నుంచి ఎన్నో భాషా చిత్రాలు ఇక్కడ తెరకెక్కుతున్నాయి. నిత్యం సినిమా చిత్రీకరణలతో సందడిగా ఉండే ఫిలిం సిటీ ఇప్పుడు మరింత శోభాయమానంగా వెలిగిపోతోంది. సినిమా చిత్రీకరణలు, భారీ చిత్రాల సెట్టింగుల ఏర్పాటు మధ్య కోలాహలంగా ఉంది. ‘సైరా’ అంటూ చిరంజీవి కత్తి దూస్తున్నారు. శర్వానంద్‌, సాయిపల్లవి సరదాగా ఓ పాటేసుకుంటున్నారు. వీళ్ల మధ్యలో రాజశేఖర్‌ ఓ ఫైట్‌ షురూ చేసేశారు. ‘సాహో’ కోసం ప్రభాస్‌ సిద్ధమవుతున్నాడు. ‘అత్తారింటికి దారేది’ అని అడుగుతున్నాడు తమిళ హీరో శింబు. ఆ విశేషాల్లోకి వెళితే..


య్యాలవాడ నరసింహా రెడ్డిగా వెండితెరపై సందడి చేయబోతున్నారు చిరంజీవి. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. కీలక సన్నివేశాలతో పాటు రామ్‌ లక్ష్మణ్‌ నేతృత్వంలో పోరాట ఘట్టాల్నీ తెరకెక్కిస్తున్నారు. సెట్లో చిరుతో పాటు అందాల తార తమన్నా కూడా ఉంది. రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో గోసయి వెంకన్నగా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు అమితాబ్‌బచ్చన్‌. శర్వానంద్‌, సాయిపల్లవి కలసి సరదాగా ఓ వాన పాట పాడుకుంటున్నారు. ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ‘పడి పడి లేచె మనసు’. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు, ఓ పాటను ఫిలింసిటీలో తెరకెక్కిస్తున్నారు. శివాజీరాజా తనయుడు విజయ్‌ నటిస్తున్న ‘ఏదైనా జరగొచ్చు’ సినిమాలోని రైల్వేస్టేషన్‌ నేపథ్యంగా వచ్చే సన్నివేశాల్ని ఫిలింసిటీలో తెరకెక్కిస్తున్నారు. బాబీ సింహా, పూజ తదితరులపై వీటిని చిత్రీకరిస్తున్నారు. పులిచెర్ల హరినాథ్‌ స్వీయ దర్శకత్వంలో వస్తోన్న సినిమా చిత్రీకరణ కూడా ఫిలింసిటీలో వేగంగా సాగుతోంది.


గాయాన్ని లెక్క చేయకుండా
‘గరుడవేగ’తో విజయాన్ని అందుకొన్న రాజశేఖర్‌ ప్రస్తుతం యువ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ‘కల్కి’లో నటిస్తున్నారు. ఆదాశర్మ, నందిత శ్వేత, స్కార్లెట్‌ కథానాయికలు. హ్యాపీ మూవీస్‌, సి.కల్యాణ్‌, శివానీ రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుగుతోంది. రాజశేఖర్‌, ఇతర తారాగణంపై పోలీస్‌ స్టేషన్‌ నేపథ్యంలో సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే రాబిన్‌ సుబ్బు నేతృత్వంలో పోరాట ఘట్టాలు తెరకెక్కించారు. కీలకమైన ఆ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్న సమయంలోనే ఓ ఫైటర్‌ చేతిలో ఉన్న గన్‌ రాజశేఖర్‌ తలకి బలంగా తాకిందట. దాంతో ఆయనకి తీవ్ర గాయమైంది. అయినా లెక్క చేయకుండా రాజశేఖర్‌ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో అశుతోష్‌ రాణా, నాజర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


1980 రోజుల్ని గుర్తు చేస్తూ... 
విభిన్నమైన కథతో ‘అ!’ను తెరకెక్కించి తన ప్రతిభని నిరూపించుకొన్నారు ప్రశాంత్‌ వర్మ. ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘కల్కి’ 1980 నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కుతోంది. అప్పటి కాలాన్ని ప్రతిబింబించేలా రూ.2 కోట్ల వ్యయంతో ప్రత్యేకంగా ఓ సెట్‌ని తీర్చిదిద్దారు.

సాహో కోసం
ప్రభాస్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సాహో’. సుజీత్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోంది. భారీ స్థాయి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే రామోజీ ఫిలింసిటీలో జరగనుంది. అందుకోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ను నిర్మిస్తున్నారు. యువీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ తార శ్రద్ధాకపూర్‌ కథానాయికగా నటిస్తోంది.


శింబు... సుదీప్‌ హంగామా
పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం తమిళంలో రీమేక్‌ అవుతోంది. శింబు, మేఘా ఆకాష్‌ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని రైల్వే స్టేషన్‌ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల చిత్రీకరణ ఫిలింసిటీలో జరుగుతోంది. సుదీప్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న కన్నడ చిత్రం ‘పైల్‌వాన్‌’. బాక్సింగ్‌ ప్రధానాంశంగా సాగే ఈ చిత్రంలోని సన్నివేశాల చిత్రీకరణ కోసం ఫిలింసిటీలో ప్రత్యేకంగా ఓ సెట్‌ను తీర్చిదిద్దారు. అందులోనే సుదీప్‌, బాలీవుడ్‌ నటుడు కబీర్‌ తదితరులపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.                                


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.