రూటు మార్చారు.. ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నారు
చిత్రసీమ నిత్యం కొత్తదనం వెంట పరుగులు పెడుతూ ఉంటుంది. కొత్త కథలు, కొత్త కలయికలు అందులో భాగమే. ఎప్పుడూ ఒకేలా కాకుండా, ప్రేక్షకుడికి కాస్త భిన్నమైన వినోదాన్ని అందించాలంటే కొత్త దారుల్లో ప్రయాణం చేయాల్సిందే. కానీ ఆ ప్రయాణం అంత ఆషామాషీ కాదు. కొత్త కథ ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా? యువ దర్శకుడు అనుకొన్నట్టుగా సినిమా తీస్తాడా? అభిమానుల్ని సంతృప్తి పరచగలడా? ఇలా ఎన్నో సందేహాలు కథానాయకుల్ని వెంటాడుతుంటాయి. నిర్మాతల భయాలు కూడా అవే. అందుకే చాలాసార్లు అచ్చొచ్చిన కథలు, కలయికలవైపే మొగ్గు చూపుతుంటారు. ఈ కథకు ఫలానా దర్శకుడైతే బాగుంటుందని ముందే లెక్కలేసుకొని రంగంలోకి దిగుతుంటారు. అయితే కథానాయకులు ఆ లెక్కల్ని క్రమంగా మార్చేస్తున్నారు. కొత్తదనంపై ఇష్టంతో, దర్శకులపై నమ్మకంతో... ధైర్యంగా కొత్త ప్రయత్నాలకు పచ్చజెండా ఊపేస్తున్నారు మన అగ్ర కథానాయకులు.


ఎన్టీఆర్‌ ఒక పక్క అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తూనే మరో పక్క కన్నడ పరిశ్రమకి చెందిన యువ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ని రంగంలోకి దింపారు. ప్రశాంత్‌ ప్రస్తుతం ‘కె.జి.ఎఫ్‌ 2’ చేస్తూనే, మరోపక్క ఎన్టీఆర్‌ కోసం కథని సిద్ధం చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించ బోతుంది. అల్లు అర్జున్‌ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకొన్నారు. త్రివిక్రమ్‌, సుకుమార్‌ లాంటి అగ్ర దర్శకుల కథలకి ఓకే చెప్పినా, వీటితో పాటుగా యువ దర్శకుడు వేణు శ్రీరామ్‌తో ‘ఐకాన్‌’ చేయడానికి సిద్ధమయ్యారు. దిల్‌రాజు నిర్మించనున్న ఈ చిత్రం దసరాకి ప్రారంభం కానుందని సమాచారం. మహేష్‌బాబు మరోసారి వంశీ పైడిపల్లితో సినిమా చేయాలని నిర్ణయించుకొన్నా, మరో యువ దర్శకుడు పరశురామ్‌ చెప్పిన కథని కూడా విన్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ లాంటి అగ్ర కథానాయకులతో సినిమాలు చేయడానికి పలువురు సీనియర్‌ దర్శకులు సిద్ధంగానే ఉన్నా, వాళ్లూ కొత్తతరం కెప్టెన్ల వైపే మక్కువ చూపుతుండడం విశేషం. మారిన ప్రేక్షకుల అభిరుచులకి తగ్గట్టుగా తమ సినిమాలు ఉండాలంటే, కొత్త తరంతో పనిచేయాల్సిందే అని కథానాయకులు బలంగా నమ్ముతున్నారు. అందుకే కొత్తతరానికి స్వాగతం పలుకుతున్నారు.

* తుది మెరుగుల్లో కథలు
చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాని పూర్తి చేసేశారు. తదుపరి ఆయన కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ కలయికలో సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ఎప్పట్నుంచో కథని సిద్ధం చేస్తున్నారు దర్శకుడు. వెంకటేష్‌ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ‘వెంకీ మామ’ చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన వరుసగా తరుణ్‌ భాస్కర్‌, త్రినాథ్‌రావు నక్కినతో సినిమాలు చేయడానికి పచ్చజెండా ఊపారు. నవతరం దర్శకులైన వీళ్లు కూడా కథల్ని ముస్తాబు చేస్తున్నారు. ‘చి.ల.సౌ’ చిత్రాన్ని తీసిన విధానం నచ్చి రాహుల్‌ రవీంద్రన్‌కి అవకాశమిచ్చారు నాగార్జున. ఈ కలయికలో త్వరలోనే ‘మన్మథుడు 2’ రాబోతోంది. ఆ తర్వాత కూడా మరో యువ దర్శకుడైన కల్యాణ్‌కృష్ణ కురసాలతో సినిమా చేయనున్నారు నాగార్జున. ‘సోగ్గాడే చిన్నినాయనా’కి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’గా రాబోతున్న ఆ సినిమా కథ తుది మెరుగులు దిద్దుకొంటోంది. ‘‘అగ్ర దర్శకులు తీసే సినిమాల్లో కొత్తదనం ఉండదని కాదు. కానీ వారి శైలి ఎలా ఉంటుందో ప్రేక్షకులకు అవగాహన ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని ముందే ఒక అంచనాతో థియేటర్‌కు వస్తారు. కానీ నవతరం దర్శకులు సినిమాలు తీస్తున్నప్పుడు ‘వీళ్లు మా కథానాయకుడిని ఎలా చూపించారో, ఎలాంటి కథ చెప్పారో’ అనే ఆసక్తి ప్రేక్షకుడిలో వ్యక్తమవుతుంది. ఒక సినిమాపై అలాంటి ఆసక్తి ఉండటం ఎంతో మంచిది. అందుకే కొత్త కలయికలపై మేం దృష్టి పెడుతున్నాం’’ అని ఓ ప్రముఖ నిర్మాత చెప్పారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.